
అమెరికాలో అర్ధరాత్రి కాల్పులు, ఇటువంటి వార్తలు మనం తరచూ వింటూనే ఉంటాము. తరచూ వింటున్నాం కాబట్టి వాటిని చాలా సాదాసీదాగా తీసుకోవచ్చు అని అర్ధం కాదు. అటువంటి ఘటనలు కడు శోచనీయం అని అర్ధం. తాజాగా అమెరికాలో ఇటువంటి ఘటనే పునరావృతమైంది. కాల్పుల మోతతో అమెరికా అదిరిపడింది. ఈ ఘటనలో 22 మంది మృతిచెందగా 60 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. లెవిస్టన్‌లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్, బౌలింగ్ అలే వద్ద ఈ కాల్పుల ఉదంతం వెలుగుచూసింది. బాగా రద్దీ గా ఉండే ఈ ప్రాంతంలో ఆగంతకుడు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. భయాందోళనకు గురైన స్థానికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. అయితే కాల్పుల అనంతరం నిందితుడు అక్కడినుండి పరారయ్యాడు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అంతేకాక కాల్పులు జరిపిన నిందితుడి ఫోటోలను సోషల్ మీడియా లో రిలీజ్ చేశారు. నిందితుడిని రాబర్ట్ కార్డ్‌గా గుర్తించారు. ఇతడు మైనేలోని యూఎస్ ఆర్మీ రిజర్వ్ ట్రైనింగ్ సెంటర్‌లో ఫైర్‌ఆర్మ్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందాడు. కాల్పులు జరిగిన ప్రాంతంలో అతడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అత్యవసర సందర్భమయితే తప్ప ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావద్దని, తలుపులు వేసుకుని ఇంట్లోనే ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
ఈ కాల్పులు ఇప్పుడు కొత్తగా జరుగుతున్నవి కాదు ఇదే సంవత్సరం జనవరి నెలలో కూడా కాల్పులు చోటుచేసుకున్నాయి. టెక్సాస్‌లోని ఓ ఎలిమెంటరీ స్కూల్‌లో ఓ సాయుధుడు 19 మంది చిన్నారులతో సహా 21 మందిని కాల్చిచంపాడు. తుపాకులు, మారణాయుధాలతో అమెరికాలో సామూహిక హత్యలు తరచూ జరుగుతున్నాయి.
అలబామా రాష్ట్రంలోని డేడ్ విల్లేలోని ఓ డాన్స్ స్టూడియోలో బర్త్ డే పార్టీలో గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా అనేక మందికి గాయాలయ్యాయి. మహోగని మాస్టర్ పీస్ డాన్స్ స్టూడియోలో ఏప్రిల్ నెలలో ఈ ఘటన చోటుచేసుకుంది. 2023 మే నెలలో అమెరికాలోని టెక్సాస్ స్టేట్‌లోని ఎలన్ పట్టణంలోగల ఒక షాపింగ్ మాల్‌లో ఉన్నట్టుండి కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో కాల్పులకు పాల్పడిన వ్యక్తితో పాటు మొత్తం 9 మంది మృతి చెందారు. వీరిలో ఒక బాలుడు కూడా ఉన్నాడు. ఏడుగురు గాయపడ్డారు.
ఇవన్నీ కేవలం 2023 సంవత్సరంలో జరిగిన ఉదంతాలు మాత్రమే ఇలా ప్రతి సంవత్సరం అనేక ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇలాంటి కాల్పుల కలకలం రెజినా ప్రతిసారి మన భారతీయ పౌరులు ఎవ్వరుకూడా అందులో ఉండకూడదు అని మనసులో ప్రార్ధిస్తూనే ఆ వార్తా ఆసాంతం వినాల్సిన పరిస్థితి ఉంటోంది. ఎందుకంటే మనదేశం నుండి చదువు లేక ఉద్యోగం పేరిట అనేక మంది అమెరికాకు వెళుతూనే ఉంటారు.
దాదాపు 50 ఏళ్ళ కిందట అమెరికా అధ్యక్షుడు లిండన్ బైన్స్ జాన్సన్ ఏమన్నారంటే అమెరికాలో వివిధ నేరాల కారణంగా మరణిస్తున్న వారిలో ఎక్కువ శాతం మరణాలు తుపాకుల వల్లే సంభవిస్తున్నాయని అన్నారు. అమెరికాలో పెరుగుతున్న ఆయుధ సంస్కృతే దీనికి ప్రధాన కారణమని అప్పట్లోనే వెల్లడించారు. కనుక అగ్రరాజ్యమైన అమెరికా ఈ గన్ కల్చర్ ను కంట్రోల్ చేయడం వల్ల శాంతి ఆ దేశంలో శాంతి స్థాపనకు నాంది పలికినట్టు అవుతుందని చెప్పొచ్చేమో.