
అధికారాన్ని అడ్డం పెట్టుకుని అమాయక యువతులపై అఘాయిత్యాలకు పాల్పడే వారు అన్ని దేశంలో ఉన్నారనేది నమ్మక తప్పని నిజం. దానికి ఉదాహరణే ఈ కధనం. యూకే కి చెందిన ఎడ్వార్డ్ లూయిస్ అనే ఓ కానిస్టేబుల్ చేసిన నీచమైన పని గురించి తెలిస్తే ఎవరైనా అతగాడిని చీదరించుకుంటారు. అతడిపై సొంత కుటుంబ సభ్యులకు కూడా అసహ్యం కలిగిఉంటుందేమో. ఇంటెలిజెన్స్‌కి అందిన సమాచారం మేరకు అతడి బ్యాంకు లావాదేవీలను పరిశీలించారు, అంతేకాక డార్క్ వెబ్ నుండి అసభ్యకర చిత్రాల డౌన్‌లోడ్స్ వ్యవహారంలో పోలీసులు తీగ లాగడంతో డొంక మొత్తం కదిలింది. ఆధారాలు మొత్తం దొరకడంతో గుట్టు రట్టయింది.
విచారణలో పోలీసులే విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ఇతగాడు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 160 మంది చిన్నారులపై లైంగిక వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్‌కి పాల్పడినట్టు తేలింది. అసలు అంతమందిని ఎలా మోసం చేశాడు అన్నది ఒక్కసారి చూద్దాం. బ్రిడ్జెండ్ అనే ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల లూయిస్ ఎడ్వర్డ్ 2021లో పోలీస్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. సోషల్ మీడియా స్నాప్ చాట్ లో టీనేజ్ కుర్రాడిలా ప్రొఫైల్ ఫొటో సెట్ చేసుకున్నాడు. ఆ ఫోటో అడ్డుపెట్టుకుని మైనర్ బాలికల పై వల పన్నేవాడు.
వారికి అనుమానం రాకుండా ఉండేందుకు, టీనేజీ అబ్బాయిలా కనిపించడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవాడు. అభం శుభం తెలియని ఆ యువతులకు ఏమాత్రం అనుమానం రాకుండా, వారితో వీడియోకాల్స్ మాట్లాడుతూనే, వారి నగ్న చిత్రాలను కొన్ని ప్రత్యేకమైన యాప్ లను ఉపయోగించి సేకరించేవాడు. ఇంకేముంది ఆతరువాత సదరు యువతులను బెదిరించి లొంగదీసుకోవడం చేసేవాడు.
డార్క్‌వెబ్ నుంచి అసభ్యకర చిత్రాల డౌన్‌లోడ్స్ వ్యవహారం మీద 2022 డిసెంబర్ నెలలో ఐపీ అడ్రస్ ఆధారంగా బ్రిడ్జెండ్ ప్రాంతానికి చెందిన ఓ ఉన్నతాధికారి ఈ ప్రబుద్దుడిని తనదైన శైలిలో విచారించాడు. దీంతో లూయిస్ నిజాన్ని ఒప్పుకోక తప్పలేదు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయని అధికారులు అతడిని విధుల్లోనుండి తొలగించి విచారణను పరుగులు పెట్టించారు. ఎన్ క్వైరి కోసం అతడి ఫోన్ ను తీసుకుని పరిశీలించగా అందులో 207 మంది మైనర్ అమ్మాయిల నగ్న చిత్రాలు ఉన్నట్టు గుర్తించారు. 4,500మంది అమ్మాయిల అసభ్యకర చిత్రాలు, 10-16 వరకు వయసున్న అమ్మాయిలపై బ్లాక్‌మెయిలింగ్, బెదిరింపులు వంటివాటికి పాల్పడినట్టు రుజువైంది. న్యాయమూర్తి ట్రేసీ లాయిడ్ క్లార్క్ ఇతగాడికి 12 సంవత్సరాలు జైలుశిక్ష విధించింది.