
తెలుగుదేశంపార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి రిమాండ్ నుండి కొంత ఉపశమనం దొరికింది. ఆయనకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో నిన్నటి నుండి టీడీపీ శ్రేణుల్లో తెలుగు తమ్ముళ్లలో, తెలుగు మహిళల్లో ఆనందం వెల్లివిరిసింది.
ఇక చంద్రబాబును రిసీవ్ చేసుకునేందుకు రాజమండ్రి కేంద్ర కారాగారానికి ఊహించని స్థాయిలో అభిమానులు చేరుకున్నారు. పోలీసులు వారిని కట్టడి చేయడంలో విఫలమయ్యారు. బారికేడ్లు తోసుకుంటూ ముందుకు వెళ్లారు. ఇక చంద్రబాబు కుటుంబ సభ్యులు కూడా ముందుగానే అక్కడికి చేరుకున్నారు.
బాబు బయటకు వచ్చిన వెంటనే అక్కడ కాసేపు ఉద్వేగభరిత వాతావరణం చోటుచేసుకుంది. అదే సమయంలో ఒక చిత్రమైన ఘటన కూడా వెలుగు చూసింది. చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి, ఆమె తండ్రి బాలయ్య కలిసి బాబుకి ఒక పసుపు రంగులో ఉన్న సంచిని ఇచ్చారు. అయితే ఆ సంచి ఏంటి ? అందులో ఏముంది అని అంతా చర్చించుకుంటున్నారు. హిందపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చంద్రబాబు క్షేమం కోరుతూ తెలుగు రాష్ట్రాల్లోనే కాక తమిళనాడులోని ఆలయాల్లో కూడా ప్రత్యేకంగా పూజలు చేయించారు.
తమిళనాడులోని ప్రసిద్ధ దేవాలయాల్లో సోమవారం చంద్రబాబు కోసం ప్రత్యేక పూజలు చేయించిన బాలయ్య ఆ ఆశీర్వాద ఫలాన్ని కుమార్తె తోకలిసి బాబుకి అందజేశారు.