6tvnews

Header - Ramky
collapse
...
Home / బిజినెస్ / వ్యవసాయం / ఆవుపేడతో అద్భుత దీపం

ఆవుపేడతో అద్భుత దీపం

2021-10-21  Health Desk
venus

ఆవుపేడతో అద్భుత దీపం
ఉత్తరాఖండ్ రాష్ట్రం రానున్న దీపావళికి వినూత్నమైన కాంతులు వెలుగులు విరజిమ్మడానికి సిద్ధమవుతోంది. అదే సమయంలో స్థానికంగానే లభించే వనరులను ఉపయోగించి మహిళలకు అదనపు ఆదాయం చేకూర్చే విధంగా ఒక అద్భుతమైన ప్రతిపాదనను కృషి విజ్ఞాన కేంద్రం (డెహ్రాడూన్) సిద్ధం చేసింది. ఇందుకు చాలా రోజులుగా ముమ్మరమైన ఆలోచనలు చేసి చివరికి ఆవు పేడతో పాటు ఔషధ గుణాలు సమృద్ధిగా ఉండే దీప కాంతులకు రూపకల్పన చేసింది. ఈ దీపాలపై ప్రయోగాలలో డెహ్రాడూన్ జిల్లాకు చెందిన సీతా భట్ (ఛార్బా గ్రామం, వికాస్ నగర్ బ్లాక్) కీలక పాత్ర పోషించారు.
దీపావళి దివ్వెలు

ముందు మృదువుగా జల్లెడ పట్టిన ఇసుక కలిపిన ఆవు పేడను ఎండలో ఎండబెడతారు. సువాసనలు ఇచ్చేందుకు వీలుగా అందులో వేప, నిమ్మ గడ్డి, తులసి, లాంటాన్ (తలంబ్రాల చెట్టు) ఆకులను ఇంకా స్థానికంగా లభించే మరికొన్ని ఆకుల పొడి మిశ్రమం చేస్తారు. ఆ మిశ్రమం ముద్దను దీపపు ప్రమిదలుగా చేస్తారు. బాగా ఆరబెట్టిన తరువాత ఆ ప్రమిదలకు సహజసిద్ధమైన రంగులతో ఆకర్షణీయమైన రూపునిస్తారు. వాటి అలంకరణలో పసుపు, మెత్తటి బియ్యపు పిండిని వాడతారు. వెలుగులు ఇచ్చేందుకు ఆయిల్ కు బదులుగా మైనపు వాక్స్ ఉపయోగిస్తారు. ఈ దీప కాంతులు అందంగా ఆకట్టుకోవడం మాత్రమే కాదు, పర్యావరణంలో కాలుష్యం భయం లేకుండా భరోసా ఇస్తాయి. 
సుగంధ పరిమళాలు

ఆవు పేడ, సహజసిద్ధమైన ఓషధుల ఆకుల మిశ్రమంతో రూపొందించిన ఈ దివ్వెలు కాంతులతో పాటు సుగంధ పరిమళాలను వెదజల్లుతాయి. మట్టి ప్రమిదల కన్నా ఇవి ఎక్కువగా ప్రజల ఆదరాభిమానాలను సంపాదించుకుంటున్నాయి. దీపావళి సంబరాల తరువాత వీటి బూడిదను పచ్చని మొక్కలకు ఎరువుగా ఉపయోగించవచ్చు. 


ప్రమిదల తయారీలో శిక్షణ

ఇప్పటికే ఈ తరహా దీపపు ప్రమిదలను తయారు చేయడంలో కృషి విజ్ఞాన్ కేంద్రం నిర్వహణలో 50 మంది మహిళలు పూర్తి శిక్షణ పొందారు.  సీతా భట్ ఒక్కరే ఇప్పటికి 50,000 ప్రమిదలను తయారుచేసారు. వాటిలో కొన్ని ఆయిల్ ఆధారంగా వెలుగుతాయి. ఆమెకు వీటి ద్వారా వచ్చిన ఆదాయం  రూ. 70,000. ఇటీవల జరిగిన కుంభ మేళా సమయంలో ఆమె వీటిని ప్రదర్శించి అందరి మన్ననలు అందుకున్నారు. అంతేకాదు ఆమె స్వయంగా పరిసర గ్రామాలకు చెందిన వంద మంది స్త్రీలను ఈ ప్రమిదల తయారీలో సుశిక్షితులను చేశారు. వీరు కాక స్థానికంగా పనిచేస్తున్న ఏడు స్వయంసహాయక కేంద్రాలు కూడా సీతా భట్ పర్యవేక్షణలో శిక్షణ కార్యక్రమాలు చేపట్టాయి.


2021-10-21  Health Desk

rajapush