6tvnews

Header - Ramky
collapse
...
Home / న్యూస్ / అంతర్జాతీయం / బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు

బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు

2021-10-22  Vamshi Mohan
venus

sheik hasina
 

ఇటీవల ముగిసిన దుర్గా పూజల సందర్భంలో బంగ్లాదేశ్ మరోసారి వార్తలలోకి వచ్చింది. ఈ సారి కూడా కారణం బంగ్లాదేశ్ లో మైనారిటీ వర్గమైన హిందువులపై జరిగిన దాడులే. ఈ దాడుల్లో కనీసం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరెందరో దాదాపుగా 450 మంది గాయపడ్డారు. 71 కేసులను పోలీసులు నమోదు చేశారు. ఈ వార్త మన దేశంలోని పత్రికలలో ప్రముఖంగానే వచ్చింది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఇలాంటి దాడులు మొట్టమొదటి సారిగా జరగలేదు. చాలా సార్లు జరిగాయి. 2013 నుంచి ఇప్పటివరకు 3600 సార్లు దాడులు జరిగినట్లు బంగ్లా దేశ్ లో మానవ హక్కుల కోసం పోరాడుతున్న ఎయిన్ ఓ శలీశ్ అనే సంస్థ వెల్లడించింది.


దాడులకు కారణం – సోషల్ మీడియాలో ముస్లింల పవిత్ర గ్రంధం ఖురాన్ విషయమై అభ్యంతరకరమైన పోస్టింగ్ల వచ్చాయట. దుండగులపై కఠినమైన చర్యలు ఉంటాయని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా హామీ ఇచ్చారు. బంగ్లా విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. దాడుల పట్ల తీవ్ర సంతాపం ప్రకటించింది. అర్ధ శతాబ్దం క్రితం బంగ్లా దేశ్ స్వతంత్రమైంది. ఇప్పటికీ ఈ వాస్తవాన్ని గుర్తించని దుష్ట శక్తులు ఇప్పటికీ మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, జాతుల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి పనిచేస్తున్నాయని విమర్శించింది. 


బంగ్లాదేశ్ జనాభా (17 కోట్లు) లో హిందువుల సంఖ్య 8.5 శాతం ఉంటుంది. ముస్లింల  సంఖ్య 90 శాతం వరకు ఉంటుంది. ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 1980 నాటికి హిందువులు 13.5 శాతం ఉండేవారు. అంతకు ముందు భారతదేశం, పాకిస్తాన్ విభజన (1947) నాటికి హిందువులు 30 శాతం వరకు ఉండేవారు. దాడుల లక్ష్యం సుస్పష్టమే. మైనారిటీగా ఉన్న హిందువులను భయభ్రాంతులకు గురిచేసి దేశం నుంచి తరిమివేయడమే. ఈ విషయాన్ని ఆ దేశంలో మైనారిటీ వర్గాలైన హిందువులు, బౌద్ధులు, క్రిస్టియన్ల సంక్షేమం కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ జనరల్ సెక్రెటరీ రాణా దాస్ గుప్తా వెల్లడించారు.


బంగ్లాదేశ్ లో 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం హిందూ జనాభా దేశంలోని అన్ని ప్రాంతాలలోను విస్తరించి ఉంది. ఖాగ్రాచరి ప్రాంతంలో 16.81 శాతం, మగూరా ప్రాంతంలో 17.92 శాతం, బగేర్ హట్ ప్రాంతంలో 18.35 శాతం, నరైల్ ప్రాంతంలో 30.56 శాతం, ఠాకూర్ గావ్ పరిసరాలలో 22.56 శాతం, ఖుల్నా ఏరియాలో 22.68 శాతం, మౌల్వీ బజార్ సమీపంలో 24.59 శాతం ఉన్న జిల్లాలు. అయితే బంగ్లాదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో హిందువులు వలసపోతున్నారు. ఢాకా యూనివర్సిటీకి చెందిన ఆర్థిక శాస్త్రవేత్త అబుల్ బర్కాత్ అధ్యయనం ప్రకారం ప్రతి రోజూ కనీసం 750 మంది దేశం వదిలి పారిపోతున్నారు. వారిలో చాలా మంది సురక్షితమైన భవిష్యత్తు కోసం, ఆర్థికంగా బాగుపడేందుకు ఇండియాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యం లోనే భారత ప్రభుత్వం వివాదాస్పద పౌరసత్వ బిల్లును రూపొందించింది. ఈ చట్టం ప్రకారం బంగ్లాదేశ్ తో పాటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లనుంచి వలస వచ్చే హిందూ, బౌద్ధులతో పాటు ఆరు మైనారిటీ వర్గాలకు భారత పౌరసత్వం లభిస్తుంది. 


బంగ్లాదేశ్ లో మత స్వేచ్ఛ అంతంత మాత్రమే
అన్ని మతాల వారికీ సమాన అవకాశాలు ఇచ్చే విషయం  బంగ్లాదేశ్ లో అనేక ఆటుపోట్లకు గురవుతోంది. దేశం ఆవిర్భవించినప్పుడు సెక్యులర్ తత్వాన్ని స్వీకరించింది. కానీ 1970లో సెక్యులర్ అనే పదాన్ని తొలగించి వేశారు. 1980 వచ్చే సరికి అధికారిక మతం గుర్తింపు ముస్లిం మతానికి వర్తింపచేశారు.  కానీ 2010లో బంగ్లా సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం ప్రకటించింది. బంగ్లాదేశ్ సెక్యులర్ దేశమేనని, అంతకుముందు ఆ పదాన్ని తొలగిస్తూ తీసుకు వచ్చిన రాజ్యాంగ సవరణ చెల్లదని స్పష్టం చేసింది. దేశంలో అన్ని మతాల వారికి సమానమైన స్వేచ్ఛ ఉన్నదని, మతం విషయంలో పురుషులు కానీ, స్త్రీలు కాని చిన్నారులపై కానీ ఎలాంటి బలవంతం చేయకూడదని కోర్టు ప్రకటించింది. అయినా ఎన్నో అనుమానాలు ఉన్నాయని నిపుణులు ఆందోళన పడుతున్నారు. మత స్వేచ్ఛ విషయంలో ఉన్న గందరగోళం కారణంగా చాందస వాదం, ఉగ్రవాదం, పాశ్చాత్య వ్యతిరేక భావాలు విచ్చలవిడిగా వ్యాపిస్తున్నాయని వఢాకా వర్శిటీలో విశ్వ వ్యాప్త మతాలు, సంస్కృతుల వ్యవహారాల విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ షఫీ మహ్మద్ ముస్తఫా 2020 నాటి ది డిప్లమేట్ సంచికలో వ్యాఖ్యానించారు. ప్రధాన రాజకీయ పార్టీలైన పాలక మితవాద అవామీ లీగ్ లేదా ముస్లింలకే ప్రాతినిధ్యం వహిస్తున్న ది జమాయిత్ ఎ ఇస్లామీ పార్టీ కానీ స్పష్టతనివ్వకపోవడం మరింత గందరగోళానికి కారణమవుతోంది. భారత దేశంలో జరిగే దాడులు ప్రతిగానే ఇలాంటివి జరుగుతున్నాయని హిందువుల సమ్మేళనంలోనేబంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఒకానొక సమయంలో వ్యాఖ్యానించడం కొసమెరుపు.


2021-10-22  Vamshi Mohan

rajapush