6tvnews

Header - Ramky
collapse
...
Home / ఆధ్యాత్మికం / బోధనలు / ఎదురుబొదురుగా బుద్ధుడు, త్రిమూర్తులు

ఎదురుబొదురుగా బుద్ధుడు, త్రిమూర్తులు

2021-11-06  Spiritual Desk
venus

buddhist temple

 

 

థాయ్ లాండ్ లో అత్యధికులు బౌద్ధులు. అయినా కూడా హిందూ దేవాలయాలు అధికంగానే ఉంటాయి. భారత్ లో కనిపించని బ్రహ్మ ఆలయాలు కూడా అక్కడ ఉండడం మరో విశేషం. పిల్లలు కావాలనుకునే వారు మొదలుకొని లాటరీ టికెట్ లో గెలువాలనుకునే వారి దాకా ఎంతో మంది ఎరవన్ ఆలయంలో బ్రహ్మను దర్శించుకుంటారు. బ్రహ్మను ఏం కోరుకుంటే అది అనుగ్రహిస్తాడన్నది వారి నమ్మకం. బౌద్ధ దేశమైన థాయ్ లాండ్ లో అడగడుగునా కనిపించేది హిందూ సంస్కృతే. ఆ మాటకు వస్తే బౌద్ధం అనేది హిందూ సంస్కృతికి విభిన్నమైందనే భావనే అక్కడ కనిపించదు. హిందూ సంస్కృతిలో విలీనమైన బౌద్ధాన్ని మనం పలు ఆసియా దేశాల మాదిరిగానే థాయ్ లాండ్ లోనూ చూడవచ్చు.       

బ్యాంకాక్ ఎయిర్ పోర్ట్ లో దిగగానే అక్కడ 15 మీటర్ల పొడవుతో కనిపించే క్షీరసాగరమథన దృశ్యం మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. అక్కడి టర్మినల్ భవనంపై రావణుడి బొమ్మ కూడా కనువిందు చేస్తుంది. ఎయిర్ పోర్ట్ పేరే సువర్ణభూమి.        

బౌద్ధ ఆలయాల్లో హిందూ దేవతలు      

థాయ్ లాండ్ లో హిందూ ఆలయాలు మాత్రమే కాదు. బౌద్ధ ఆలయాల్లో కొలువుదీరి ఉండే హిందూ దేవతల ఉదంతాలూ ఉన్నాయి. దాదాపుగా అక్కడ అన్ని బౌద్ధ ఆలయాల్లోనూ హిందూ దేవతలనూ దర్శించుకోవచ్చు. వేల ఏళ్లక్రితం నాటి హిందూ సంస్కృతి థాయ్ లాండ్ బౌద్ధ ఆలయాల్లో నేటికీ సజీవంగా ఉంది. మనదేశంలో అంతరించి పోయిన ఒక నాటి సంస్కృతిని థాయ్ లాండ్ లో మనం దర్శించుకోవచ్చు.       

రాముడి అవతారంగా రాజు      

థాయ్ లాండ్ రాజును రాముడి అవతారంగా భావిస్తారు. ఆ పరంపరలోనే వ్యవహరిస్తారు. రాజును పట్టాభిషిక్తుడిని చేసే ప్రక్రియను బ్రాహ్మణ పూజారులే నిర్వహిస్తారు. పదకొండో శతాబ్దంలో చోళ రాజుల పాలన దక్షిణాసియా రాజ్యాలకూ విస్తరించిందని, అక్కడి రాజవంశాలు చోల వంశానికి సంబంధించినవేననీ కొందరు చరిత్రకారులు భావిస్తారు.       

థాయ్ లాండ్ లో వాట్ ఖేక్, వాట్ విత్సను (విష్ణు), ఎరవన్ (బ్రహ్మ) ఆలయాలు బాగా పేరొందాయి. లక్ష్మి, త్రిమూర్తి, గణుషులు బుద్ధుడి చెంతనే కొలువుదీరి ఉండే ఆలయాలు అనేకం ఉన్నాయి. శ్రీ మహా మరియమ్మన్ ఆలయం (మహా ఉమాదేవి టెంపుల్), సిలోమ్ లోని వాట్ ఖేక్ (శివ) కూడా బాగా పేరొందాయి.       

కోరికలు తీర్చే బ్రహ్మదేవుడు      

ప్రపంచంలో బౌద్ధులు అత్యధికంగా ఉండే దేశాల్లో థాయ్ లాండ్ ఒకటి. అక్కడ నూటికి 95శాతం మంది (సుమారుగా ఏడు కోట్ల మంది) బౌద్ధులు. హిందువులమని చెప్పుకునే వారు 0.03 శాతం (22 వేల మంది మాత్రమే). హిందువులు అత్యంత తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ, అక్కడి సాంస్కృతిక, సామాజిక జీవనంపై హిందూ సంస్కృతి ప్రభావం అత్యధికంగా ఉంటుంది. విడదీయడానికి వీల్లేనంతగా కలగలసిపోయింది. అక్కడ బ్రహ్మ ముందు నిలబడి కోరికలు కోరుకునే బౌద్ధులు, అవి తీరిన తరువాత ధన్యవాదసూచకంగా నాట్యగత్తెలతో రామకథ చెప్పిస్తారు.       

వినాయకుడు (ఫరా ఫికానెట్), ఇంద్రుడు (ఫరా ఇన్), శివ (ఫరా ఇసువన్ ) లు బౌద్ధులకు ప్రధాన దైవాలుగా ఉంటారు. అన్ని అడ్డంకులు తొలగించేవాడిగా గణనాథుడిని పూజిస్తారు. ఏదైనా ముఖ్యమైన పని చేయడానికి ముందుగా విఘ్నాధిపతిని పూజిస్తారు.       

నేటికీ చోళ వంశీయుల పాలన      

థాయ్ లాండ్ తో భారత్ కు వందల ఏళ్ల క్రితమే సంబంధాలు ఏర్పడ్డాయి. బ్యాంకాక్ లోని ప్ర నఖోన్ లో వర్తమాన శకం 1784లో దేవస్థాన్ ఆలయాన్ని నిర్మించారు. దీన్నే బ్రాహ్మిణ్ టెంపుల్ గా కూడా వ్యవహరిస్తారు. వెయ్యేళ్ళ క్రితమే, చోళ రాజుల పాలనలో ఇక్కడికి బ్రాహ్మణ పూజారుల వారసులే నేటికీ ఇక్కడ పూజాదికాలు నిర్వహిస్తుంటారు.      

ఒక్క ముక్కలో చెప్పాలంటే బౌద్ధమతం, హిందూ సంస్కృతి పెనవేసుకున్న దేశమే థాయ్ లాండ్. అక్కడ బుద్ధుడు, త్రిమూర్తులు ఎదురుబొదురుగా ఉంటూ పలకరించుకుంటూ ఉంటారు.      


 


2021-11-06  Spiritual Desk

rajapush