collapse
...
Home / చదువు / ఆమె ‘చదువు’ని జయించింది - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu | News Telugu

ఆమె ‘చదువు’ని జయించింది

2021-12-01  Health Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

MADHAVI LATHA-1
 

వరంగా ఉండాల్సిన బాల్యం...పిల్లలకు శాపంగా మారుతోంది. మరి ఆ పాపం ఎవరిది ? అంటూ నిలదీస్తారు ఆమె. అంతేకాదు...ఆ పాపంలో తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు కూడా వాటా ఉందని అంటారు. యావత్ వ్యవస్థనూ ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చిందంటారు. ఆమెనే      కొంపెల్ల మాధవీలత.  

మాధవీలత చెప్పే మాటలు నిజమే. ఆమెనే కాదు....మరెందరో అవే మాటలు చెబుతున్నారు. మరి ఆమె ప్రత్యేకత ఏంటి ? ఆమె చెప్పే మాటలను మనం వినాల్సిన అవసరం ఏంటి ? అనే ప్రశ్న కూడా వస్తుంది. అదీ నిజమే. కాకపోతే....ఇలాంటి మాటలు చెప్పేందుకు ఆమెకు ఒక అర్హత కూడా ఉంది. అంతకు మించిన తపన ఉంది. ఆమె తన ఇద్దరు పిల్లలను బడికి పంపకుండా ఇంట్లో తనే గురువై అన్నీ నేర్పించి ....చివరకు ఐఐటీలో కూడా చేర్పించారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే నేటి ‘చదువు’లో ఉన్న లోపాలను జయించారు. అందుకే ఆమె చెప్పే మాటలను మనం కచ్చితంగా విని తీరాల్సిందే. పిల్లలతో చేసిన చదువు ప్రయాణంలో ఆమె అనుభవాలను తెలుసుకొని తీరాల్సిందే.  

135 ఏళ్ల క్రితం.....1885 నవంబర్ 15న పుట్టిన గిజూభాయ్ బదేకా భారతీయ విద్యారంగంపై చెరగని ముద్ర వేశారు. మాంటిస్సోరి సిస్టమ్ ను భారత దేశానికి తీసుకువచ్చింది ఆయనే. ఆటలే అసలైన విద్య.... మైదానంలోనే గొప్ప శక్తులెన్నో పుట్టాయి. ఆటలంటే శీల నిర్మాణం....ఇలా పిల్లల చదువు గురించి ఎన్నో విషయాలు ఆయన చెప్పారు. దాదాపుగా వందేళ్ల క్రితం గిజూ భాయ్ చెప్పిన మాటలే ఈ రోజున మళ్లీ వినవస్తున్నాయి. కొంపెల్ల మాధవీ లత కూడా అవే మాటలు చెబుతున్నారు. అంటే ఏమిటీ అర్థం ....వందేళ్ల నుంచి మన దేశ విద్యావ్యవస్థలో ఆశించిన మార్పులు రాలేదనే. మరి ఇంతకూ మన విద్యావ్యవస్థలో లోపాలేంటి ?....పెంపకంలో తప్పిదాలేంటి ? మనం చేస్తున్న పొరపాట్లేంటి ? ఇలాంటి అంశాలపై కొంపెల్ల మాధవీలతతో 6tvnews.com      ముచ్చటించింది. ఆ విశేషాలేంటో చూద్దాం.  

ప్రశ్న: నేటి కాలంలో పిల్లలు ఎందుకు ఇంతగా ప్రెషర్ ఎదుర్కొంటున్నారు ?     

మాధవీలత: అసలు ప్రెషర్ అంటే ఏంటో కూడా చూడాలి. అదెక్కడ ఉందో పరిశీలించాలి. ఎక్కడి నుంచి విద్యార్థుల్లోకి వస్తుందో తెలుసుకోవాలి. అది పరీక్షలో ఉందా ? సిలబస్ లో ఉందా ? బోధించే ఉపాధ్యాయుల్లో ఉందా ? వీటన్ని   టినీ ఆర్గనైజ్ చేసే వ్యవస్థలో ఉందా? ప్రెషర్ అనేది అన్నిటిలో ఉంది. ప్రాసెస్ లో మార్పు ద్వారా ప్రెషర్ సమస్యను మనం అధిగమించవచ్చు.  

ప్రశ్న: ప్రెషర్ కు పరిష్కారం ప్రాసెస్ లో మార్పు అంటున్నారు....అదేంటో కాస్త వివరిస్తారా ?     

మాధవీలత:   క్రికెట్ లో టీమ్ ఇండియా హెచ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ ను నియమించారు. నిజానికి రాహుల్ మొ దట్లో హాకీ ప్లేయర్. ఆ తరువాత క్రికెటర్ గా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఒకవేళ ఆయన క్రికెట్ లో లేకుండా, హాకీలో ఉన్నా కూడా ఆయనను తీసుకొచ్చి క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ గా చేస్తారా ? చేయరు కదా.... కాకపోతే...మన విద్యారంగంలో అందుకు భిన్నంగా జరుగుతోంది. ఏమాత్రం అర్హతలు లేనివారిని, నైపు ణ్యాలు లేని వారిని ఉపాధ్యాయులుగా నియమిస్తున్నారు. వారే సరిగా చదువుకోలేదు....ఇక భావితరాలకు వారేం చెబుతారు...ఇలా ఎన్నో తరాలను మనమే చేజేతులా నాశనం చేసుకుంటున్నాం. 

ప్రశ్న: విద్యాబోధనలో ఉన్న కొన్ని ప్రాక్టికల్ సమస్యలు ....     

మాధవీలత: చదువు అనేది కమర్షియల్ అయిందనడంలో సందేహం లేదు. కేజీ నుంచి పీజీ దాకా స్పూన్ ఫీడింగ్ జరుగుతోంది. పిల్లలంతా కూడా పాఠ్యపుస్తకాల కన్నా ఎక్కువగా ప్రాక్టీస్ పేపర్స్, గైడ్స్, క్వశ్చన్ బ్యాంక్ లాంటి వాటిపై ఆధారపడుతున్నారు. నిజానికి అంతా మొదట దృష్టి పెట్టాల్సింది కాన్సెప్ట్ పై. మనం మాత్రం ఆ విషయాన్ని విస్మరిస్తున్నాం. అందుకే విద్యారంగంలో పునాదుల్లేని భవనాల మాదిరిగా ప్రాథమిక భావనలే తెలియని విద్యార్థు లను చూస్తున్నాం. ఈ తప్పు విద్యార్థులది మాత్రమే కాదు....మనందరిదీ.  

ప్రశ్న:దేశంలో నేడు ఎన్నో లక్షల మంది తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని ఐఐటీలో చేర్పించాలని కలలు కంటు న్నారు కానీ అవి నిజం కావడం లేదు. అలా ఎందుకు జరుగుతోంది ?     

మాధవీలత: ఒక పని చేసిన వారికే ఆ పనిలో ఉన్న కష్టమేంటో...సాధించిన ఫలితం విలువేంటో తెలుస్తుంది. అలా కష్టపడని వారు....ఫలితం విలువ తెలియని వారు దాని గురించి ఇతరులకు చెప్పలేరు. ఇది విద్యారంగానికీ వర్తి స్తుంది. ఐఐటీలో చదివిన వారికే తాము ఎంత కష్టపడ్డదీ తెలుస్తుంది. విజయం సాధించిన రోజున ఫలితం విలువ అర్థమవుతుంది. అలాంటి వారే మరో పది మందికి మార్గదర్శకులు కాగలుగుతారు. ప్రభుత్వరంగమైనా....ప్రైవేటు రంగమైనా సరే....నేడు అలాంటి పరిస్థితులు లేవు. ఐఐటీల్లో....అది కూడా టాప్ ఐఐటీలలో చదివిన వారికి మా త్రమే వాస్తవ పరిస్థితులపై అవగాహన ఉంటుంది. అలాంటి వారు మాత్రమే సరైన విధంగా మార్గనిర్దేశనం చేయ గలుగుతారు.  

ప్రశ్న: మీరు అన్నిటికీ బేసిక్స్ ముఖ్యమని అంటారు. నిజంగా వాటికి అంత ప్రాధాన్యం ఉంటుందా ?     

మాధవీలత: ప్రాథమిక తరగతుల నుంచే పటిష్ఠ పునాది ఉంటే తప్ప విజయాలు సాధ్యం కావు. అలాంటి పునాది కోసం మొదటి నుంచీ ప్రయత్నించాలి. ఐఐటీ సిలబస్ చూడండి. అందులో ఉన్న అంశాలకు మూలాలు, ఆ ప్రాథ మిక భావనలు మనకు 7,8,9 తరగతుల నుంచే ఉంటాయి. బోధించే ఉపాధ్యాయులకే సరిగా అవగాహన లేకుం టే...ఇక వారు పిల్లలకు ఏం చెబుతారు.... 

ప్రశ్న: హోమ్ స్కూలింగ్ భావన విదేశాల్లోనే అధికంగా ఉన్నట్లుంది....     

మాధవీలత: అక్కడ హోమ్ స్కూలింగ్ అంటారు కానీ అది నిజమైన హోమ్ స్కూలింగ్ కాదు. ట్యూటర్ వచ్చి చెప్ప   డమో లేదంటే...ఆన్ లైన్ ట్యూటర్ చెప్పడమో జరుగుతుంది. అంతే తప్ప తల్లిదండ్రులు గురువులుగా చెప్పడం ఉండదు. నిజానికి హోమ్ స్కూలింగ్ అంటే....తల్లిదండ్రులే పిల్లలకు ఆయా విషయాల్లో అవగాహన కల్పించడం. అందరికీ ఇది సాధ్యం అవుతుందని చెప్పలేం. అలా అని సాధ్యం కాదనీ చెప్పలేం. పూర్తిగాక హోమ్ స్కూలింగ్ కాకపోయినా....పిల్లల చదువులో తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు చురుగ్గా పాలుపంచుకోవాలి.  

ప్రశ్న: పిల్లల చదువులో తల్లి పాత్ర....     

మాధవీలత: పిల్లల చదువులో తల్లిపాత్రనే కీలకం. పిల్లలకు మొదటి గురువు మాత్రమే కాదు....నిరంతర గురువు కూడా అమ్మనే. చదువుకున్న వారు మాత్రమే కాదు...చదువుకోని వారు సైతం తమకు తెలియకుండానే గురువు పాత్ర పోషిస్తుంటారు. నిత్య జీవితంలో ఎదురయ్యే వివిధ సందర్భాల పాఠాలను, అనుభవసారాలను పిల్లలకు నేర్పి స్తుంటారు. అలా నేర్పించాలి కూడా. అప్పుడు మాత్రమే విలువలు చేదోడుగా భావి తరాన్ని ఆదర్శాల బాటలో ముం దుకు తీసుకెళ్తున్నాం. గతంలో ఇది ఉండింది. ఇప్పుడు మాత్రం ఆధునిక ఉపకరణాల వినియోగం, జీవనశైలిలో మార్పులు లాంటి వాటి వల్ల గురువు పాత్ర నుంచి తల్లి    క్రమంగా దూరమవుతోంది. అలా కాకుండా చూసుకోవాలి.  

ప్రశ్న: ఇలా కాకుండా ఉండాలంటే కుటుంబంలోని ఇతర సభ్యులు     ఏవిధంగా మెలగాలి ?     

మాధవీలత: నిజానికి మహిళ కేంద్రంగానే కుటుంబం ఉంటుంది. బయటకు చూసేందుకు మాత్రం అది పురుషుడు కేంద్రంగా కనిపిస్తుంది. కుటుంబంలోని ప్రతి ఒక్కరి అవసరాలను భార్యగా, తల్లిగా ఓ మహిళ ఎలా తీరుస్తున్నదో చూడండి. పిల్లల్ని పెంచడం ఒక కళ. ఇంటి పనులు చేయడం ఓ నైపుణ్యం. మరి ఆ సేవలకు ప్రతిఫలం సంగతి తరువాత....ముందు కనీసం ఓ గుర్తింపును ఇవ్వాలి. అది ఆమెకు దక్కుతున్నదా ? ఎన్ని కుటుంబాల్లో మహిళను ఓ వ్యక్తిగా గుర్తిస్తున్నారు? భర్త చులకనగా చూస్తే ...పిల్లలు... చివరకు ఆడపిల్లలు సైతం అదే బాటలో నడుస్తారు. కుటుంబంలోని ఇతర సభ్యుల కోసం ఓ మహిళ చేస్తున్న త్యాగాలను ఎవరూ గుర్తించడం లేదు. పైగా వాటిని బాధ్యతలుగా చెబుతూ భారం మోపుతుంటారు. మరి ఆ బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తున్నవారికి మాత్రం ఎలాంటి గుర్తింపు దక్కడం లేదు. 

ప్రశ్న: ఈ రోజుల్లో జీవితం అంటేనే కాలంతో పోటీగా పరుగెత్తడం అయిపోయింది. మరీ ముఖ్యంగా ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్న సందర్భంలో పిల్లలపై శ్రద్ధ వహించేందుకు తల్లిదండ్రులకు సమయం లభించడం లేదు. మరి పిల్లల పెంపకంపై శ్రద్ధ వహించేదెలా ?     

మాధవీలత: సాధ్యమైనంత వరకు పిల్లలకు ఆరేళ్లు వచ్చే వరకూ తల్లి ఉద్యోగం చేయకుంటేనే మంచిది. ఆ తరువాత కూడా పార్ట్ టైమ్ లేదా ఇంట్లో నుంచి పని చేసుకుంటేనే పిల్లల పెంపకం సజావుగా సాగుతుంది. పిల్లల పెంపకం ఆషామాషీ ఏమీ కాదు. అది కూడ ఉద్యోగం లాంటిదే. అంతకు మించింది కూడా. పిల్లల మెదళ్లు ప్రశాంతంగా ఉండాలి. అదే సమయంలో ఖాళీసమయంతో కూడా ఉండకూడదు. మెదడుకు సమాచారం ఇవ్వడాన్ని పెంచాలి. కుటుంబంలో మనం చేసే ప్రతి పని కూడా విద్యాత్మకంగా, పిల్లలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలి. భార్యాభర్తలిద్దరు తగువు పడుతుంటే దాని ప్రభావం పిల్లలపై పడుతుంది. వారిలోనూ నెగెటివ్ ధోరణులు పెరుగుతుంటాయి. తల్లిదండ్రులు మొబైల్ కు అలవాటుపడితే, పిల్లలకు దాన్ని దూరం చేయడం సాధ్యం కాదు. పిల్లలతో ఆటపాటలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆటపాటల్లోనే చదువును కూడా చొప్పించాలి.  

ప్రశ్న: మీ మాటల్లో ఒక విప్లవం కనిపిస్తోంది. ప్రస్తుత వ్యవస్థలను ధ్వంసం చేయాలన్న ఆవేశం కనిపిస్తోంది. మీరు కలలు కంటున్న భారీ మార్పులు తీసుకురావడం సాధ్యమేనా ?     

మాధవీలత: మనం ఒక బస్సు ఎక్కుతాం...లేదా ఒక విమానంలో ప్రయాణిస్తాం. మన ప్రాణాలు డ్రైవర్ చేతి లోనో...పైలట్ చేతిలోనో ఉంటాయి. మరి వారికి నైపుణ్యం లేకుంటే మన పరిస్థితి ఏంటి ? ఊహించుకుంటేనే భయ మేస్తుంది కదా...మరి మనం మన ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే మన పిల్లలను తీసుకెళ్లి సరైన అర్హతలు, నైపుణ్యాలు లేని ఉపాధ్యాయులకు వదిలేస్తే ఏంటి పరిస్థితి ? బస్సు...విమానం ప్రమాదానికి గురైతే కొన్ని ప్రాణాలే పోతాయి...నాసిరకం ఉపాధ్యాయుల చేతుల్లో కోట్లాది పిల్లల జీవితాలు నాశనమవుతున్నాయి. పిల్లల జీవితాలను నాశనం చేసే హక్కు వారికి ఎవరిచ్చారు ? మరి వాటి గురించి ఎవరూ ఎందుకు పట్టించుకోవడం లేదు. దశాబ్దాలుగా ఇలానే జరుగుతున్నా ఎవరూ ఎందుకు మాట్లాడడం లేదు. కొన్ని రంగాల్లో ప్రతిభకు పట్టం కట్టాల్సిందే. విద్యారంగం కూడా అలాంటిదే. విద్యాసంస్థల్లో సీట్ల కేటాయింపు మొదలుకొని గురువుల నియామకాల దాకా ప్రతిభను గుర్తించాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయుల్లో క్వాలిటీ ఉంటేనే రేపటి తరం నుంచి వివిధ రంగాల నాయకులు పుట్టుకొస్తారు.  

ప్రశ్న: నేటి కాలంలో తల్లిదండ్రులంతా తమ పిల్లలు ఐఐటీలో చదవాలని అనుకుంటున్నారు....మరి ఆ స్థాయికి తీసుకెళ్లేలా పిల్లలకు ప్రేరణ ఇవ్వగలుగుతున్నారా ?     

మాధవీలత: తల్లిదండ్రులకు....మరీ ముఖ్యంగా మధ్యతరగతి వారికి ఆశలు అధికం. ఆశ ఉండడంలో తప్పు లేదు. ప్రయత్నం కూడా సరిగా ఉండాలి. లేకుంటే ఆశ నెరవేరదు. ఉన్నత చదువులు అందించడంలోనూ అలానే జరుగు తోంది. తమ పిల్లలు అన్నిట్లోనూ ఫస్ట్ రావాలని అనుకుంటారు. మరి అందరు తల్లిదండ్రులూ అలానే అనుకుంటారు కదా...మరి అలా జరుగుతోందా ? పిల్లవాడికి 20వ ర్యాంకు వస్తే తిట్టాల్సిన అవసరం లేదు. మరో పది మంది నీ వెనుక ఉన్నారు. ఇంకో పదిమందిని దాటి ముందుకెళ్లు అనే విధంగా చెప్పాలి. 

ప్రశ్న: డాక్టర్...ఇంజినీర్....ప్రస్తుతం ఈ రెండు కోర్సులే బాగా డిమాండ్ లో ఉన్నాయి. తల్లిదండ్రుల ఆశలు సరే... పిల్లల ఆశలు కూడా అలానే ఉంటున్నాయా ?     

మాధవీలత: మనం సాధించలేకపోయాం కాబట్టి...ఆ ఆశలను మన పిల్లల రూపంలోనైనా నెరవేర్చుకుందాం అని ఎంతో మంది తల్లిదండ్రులు భావిస్తుంటారు. అయితే ఇక్కడ వారు మర్చిపోతున్న అంశాలు కొన్ని ఉన్నాయి. సబ్జెక్టుపరంగా చూసుకుంటే......మన చిన్నతనంలో మనం డాక్టర్లు, ఇంజినీర్లం కాలేకపోయాం కదా....మనకు అప్పుడు అది కష్టమైంది కదా...మరి మనకు కష్టమైంది మన పిల్లలకు కష్టం కాదా...ఇతర కష్టాల గురించి మరి కొందరు ప్రస్తావిస్తుంటారు. అలాంటి    కష్టాలు ఇప్పుడు పిల్లలకు లేవు కదా...చదువుకోవచ్చు కదా అంటూ ఉంటా రు. అదీ నిజమే. కానీ అందుకు తగ్గ వాతావరణాన్ని మనం కల్పించామా అన్నది కూడా చూసుకోవాలి. మన తల్లిదండ్రులు మనతో ప్రేమతో వ్యవహరించి ఉంటే మన జీవితాలు మరోలా ఉండేవని అంతా అనుకుంటూ ఉంటారు. మరి మీరు మీ పిల్లలతో ప్రేమతో ఎందుకు వ్యవహరించలేకపోతున్నారు? ఆప్యాయతతో ఎందుకు మెలగలేక పోతున్నారు? వారి సమస్యలను అర్థం చేసుకునేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదు? పిల్లలకు ఒక    కెరీర్ ను పరిచయం చేయాలి. అందులో మంచిచెడులు వివరించాలి. ఆసక్తి కల్పించేందుకు ప్రయత్నించాలి. ఇవి చేయడంలో ఏ దశలోనూ వారిని బలవంతపెట్టకూడదు. ఇన్నిచేసినా కూడా వారి దృష్టి వేరే కెరీర్ పై పడిందంటే...ఇక వారి కోణంలోనుంచి కూడా ఆలోచించేందుకు ప్రయత్నించాలి.  

ప్ర: తల్లిదండ్రులు పిల్లలతో మెలిగే తీరులో మీ సూచనలు...     

మాధవీలత: పిల్లలతో వ్యవహరించేటప్పుడు కాస్తంత తగ్గితే తప్పులేదు. అద్దంలో కొండ చిన్నగా కనిపిస్తుంది. అంత మాత్రాన కొండ చిన్నదైపోతుందా ? పిల్లలూ అంతే. మన చిన్నప్పుడు మనం ఎలా ఆలోచించామో ఒక్కసారి గుర్తు చేసుకోండి. పిల్లలు చెప్పేది కూడా వినాలి. తెలుగు మీడియంలో చదువుకున్న తల్లితో నేటి కాలం పిల్లలు నీకేం తెల్వదు...అంటూ చిన్నబుచ్చుతుంటారు. అంతమాత్రాన బాధపడాల్సింది ఏమీ లేదు. నీకు తెలిసింది నీవు చెప్పు....నేను కూడా నేర్చుకుంటా అంటూ వారి వెంట ఉంటూ నేర్పించాలి. పిల్లలు బయటి వాళ్లేమీ కాదు. మన నుంచి వచ్చిన వారే. వారితో వ్యవహరించేటప్పుడు ఆత్మాభిమానం, ఇగో లాంటివి పక్కనబెట్టాలి. మనం వాళ్ళకు నేర్పాలి. వారి నుంచి నేర్చుకోవాలి. నేడు పోల్చిచూసుకోవడం అధికమైపోయింది. దృష్టి మళ్లించే అంశాలు అధికమై   పోతున్నాయి. వీటి విషయంలో జాగ్రత్త వహించాలి.  

ప్ర: పిల్లల పెంపకంలో మీరు సంస్కృతి, సంప్రదాయాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా ఉంది...     

మాధవీలత: అవును. మన చుట్టూరా రకరకాల కాలుష్యాలు, మలినాలు ఉంటాయి. వాటి నుంచి రక్షణ కల్పించే కవచాలను మనం పిల్లలకు అందించగలగాలి. అందుకు సంస్కృతి, సంప్రదాయాలు తోడ్పడుతాయి. చదువు ముఖ్యమే. దాని కంటే కూడా వ్యక్తిత్వ నిర్మాణం మరింత ముఖ్యం. పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకూ పరిసరాల ప్రభావం ఎలా ఉంటున్నదో గమనిస్తూ ఉండాలి. దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. పిల్లలు వారి పనులు వారు చేసుకునేలా శిక్షణ ఇవ్వాలి. వారిలో మానవత్వ విలువలు నెలకొనేలా చూడాలి.  

ప్రశ్న: మీ పిల్లల చదువు విషయంలో మీరు బాగా శ్రద్ధ తీసుకున్నట్లుగా ఉంది....ఇద్దరు పిల్లలకూ హోమ్ స్కూలింగ్ తో ఐఐటిలో సీట్లు రావడం అంటే మాటలు కాదు....మొత్తం చదువు ఇంట్లోనే ఎలా సాగింది?     

మాధవీలత: పిల్లల జీవితంలో చదువు ఒక భాగం మాత్రమే కాదు. అదే సర్వస్వం కాదు. వారి మెదడుకు సరైన శిక్షణ ఇవ్వడం ముఖ్యం. నేను పిల్లలతో కలసి ఎక్కాలు చెప్పేదాన్ని. ప్రపంచపటం చూపించి దేశాలు గుర్తుపట్టమనే దాన్ని. రాజధానుల పేర్లు చెప్పమనే దాన్ని. రసాయన శాస్త్రంలో ఆవర్తన పట్టిక (పిరియాడిక్ టేబుల్) ను బాగా పెద్ద ప్రింట్ తీయించి ఇంట్లో గోడపై అతికించాం. దాన్ని చూస్తూ అందులోని వాటితో ఆడుకునే వాళ్లం. ఇంట్లో విద్యాత్మక వాతావరణం ఏర్పరిచాం. ఆ వాతావరణాన్ని బట్టే పిల్లల్లో అభిరుచులు ఏర్పడుతాయి. మా వారు విశ్వనాథం ఐఐటి గ్రాడ్యుయేట్. చదువు ఒత్తిడి ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు. అలాంటి ఒత్తిళ్లు లేని విధంగా చదివించాలనుకున్నాం. అందుకే హోం స్కూలింగ్ ....అంటే ఇంట్లో నేనే మా పిల్లలకు గురువుగా మారాను. నేను కొంతకాలం పాటు నేను టీచర్ గా కూడా పని చేశా. ఆ అనుభవం కూడా కలసి వచ్చింది. పిల్లలకు తొమ్మిదేళ్లు వచ్చే వరకూ భారతం, భాగవతం, పురాణాలు చెప్పాం. సైన్స్, మ్యాథ్స్ అంశాలను ప్రాక్టికల్ గా నేర్పించేవాళ్లం. మా పెద్దమ్మాయి తొమ్మిదో ఏట పాఠ్య పుస్తకం మొదటిసారిగా పట్టుకుంది. పన్నెండేళ్లకే పదో తరగతి పూర్తి చేసింది. 15 ఏళ్లకే ఐఐటీలో సీటు సాధించింది. ఇటీవలే బాబు కూడా ఐఐటీలో చేరాడు.  

ప్రశ్న : మీ చదువు....హాబీలు...     

మాధవీలత: నేను డిగ్రీ చదివే రోజుల్లో సివిల్స్ రాయాలనే కోరిక ఉండేది. ఎన్ సిసి నుంచి రిపబ్లిక్ డే పరేడ్ లో కూడా పాల్గొన్నాను. నాట్యం అంటే ఇష్టం. ఎనిమిదేళ్ల వయస్సు లోనే ప్రముఖ డాన్సర్ స్వప్నసుందరి ఆధ్వర్యంలో ప్రదర్శన కూడా ఇచ్చాను. పెళ్లికి ముందే నాట్యప్రదర్శనలు ఆపేశా. పెళ్లయిన తరువాత పిల్లలే నా ప్రపంచం అయిపోయారు. నా పిల్లలు మాత్రమే కాదు...ఇప్పుడు నేను సమాజంలోని యావత్ పిల్లల గురించి కూడా ఆలోచిస్తున్నాను. ఇప్పటికే రెండు ఫౌండేషన్ల ద్వారా వివిధ రకాల సామాజిక కార్యకలాపాలు కూడా నిర్వ హిస్తున్నాం. 

ప్రశ్న: మీ పిల్లలు మీ సొంతం సరే...ఇతరుల పిల్లల గురించి కూడా మీరెందుకు ఇంత తపన పడుతున్నారు ?     

మాధవీలత: పిల్లలు పిల్లలే. ఒక తల్లి తన పిల్లలు మాత్రమే కాదు...పిల్లలంతా బాగుండాలనే కోరుకుంటుంది.    కాలప్రవాహంతో పోలిస్తే...మన జీవితం అందులో ఒక్క క్షణం కూడా ఉండదు. కాలంతో పాటు జీవితం కూడా పరుగెడుతూ ఉంటుంది.    పిల్లలతో కలసి చేసే జీవన ప్రయాణం ఓ అద్బుతం. అది సజావుగా జరగాలి. అర్థవంతంగా ఉండాలి. ఫలప్రదం కావాలి. జ్ఞాపకాల పెట్టెలా ఉండాలి. పెట్టె తెరిస్తే చాలు....మధుర క్షణాలు గుర్తుకురావాలి. ఇవి నా ఒక్కరికే కాదు...అందరికీ అందాలి. అందుకే సమాజంలో ఓ మార్పు తీసుకువద్దామని సంకల్పించాను. అందుకు తప్పకుండా ప్రయత్నిస్తాను.    2021-12-01  Health Desk