పాఠశాల విద్యా ప్రణాళికలో నాలుగు వేదాలకు చోటు కల్పించాలని పార్లమెంటరీ సభ్యుల సలహా సంఘం సిఫారసు చేసింది. నలందా, విక్రమశిల, తక్షశిల విశ్వవిద్యాలయాలలో విద్యా ప్రణాళికలు, బోధన పద్ధతులను అధ్యయనం చేసి ఉత్తమ పద్ధతులను అనుసరించాలని కోరింది. అన్నిటికన్నా ముఖ్యంగా, చరిత్రను బోధించే పుస్తకాలలోని అంశాలను నిరంతరం మార్పుచేర్పులు చేస్తూ ఉండడం చాలా అవసరమని సభ్యులు తెలిపారు.
వేదాల్లో ఎన్నో వైజ్ఞానిక విషయాలు
మన పూర్వీకుల నుంచి వస్తున్న నాలుగు వేదాలు – రుగ్వేదం, యజర్వేదం, సామ వేదం, అధర్వణ వేదం –, భగవద్గీత వంటి గ్రంథాలు - ఎన్నో వైజ్ఞానిక విషయాలను వివరిస్తున్నాయని, వీటి ప్రాముఖ్యాన్ని గుర్తించి పాఠ్య ప్రణాళికలలో చేర్చి తరువాతి తరాలకు బోధించాలని వారు సూచించారు. ఆగమ శాస్త్రం కూడా చాలా విషయాలను తెలియజేస్తున్నది. ఇంకా జైన మత ప్రముఖుడు మహావీరుని బోధనల్లో యువతకు ఉపయోగకరమైన అంశాలు చాలా ఉన్నాయని ప్యానెల్ అభిప్రాయపడింది. విద్య, మహిళలు, చిన్నారు, యువత, ఇంకా క్రీడాంశాలపై అధ్యయనం చేసేందుకు వినయ్ సహస్రబుద్ధి నేతృత్వంలో ఈ ప్యానెల్ ఏర్పాటైంది.‘పాఠశాల పాఠ్య పుస్తకాల రూపకల్పన విధానాలు, వాటిలో సంస్కరణల ఆవశ్యకత’ అన్న శీర్షికతో ప్యానెల్ తన నివేదికను సమర్పించింది. దీనిని ప్రభుత్వం రాజ్యసభకు నివేదించింది.
అప్ డేట్ చేయడం చాలా అవసరం
మన చరిత్ర పుస్తకాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయడం చాలా అవసరం. ముఖ్యంగా దేశ స్వాతంత్ర్యం అనంతర కాలం (1947 తరువాతి) పరిణామాలకు చరిత్రలో సముచిత స్థానం ఇవ్వడం అవసరం. అందుకు వీలుగా జాతీయ స్థాయిలో పాఠ్యాంశాల (కరికులం) రివ్యూ ప్రణాళిక రూపొందించాలని ప్యానెల్ అభిప్రాయపడింది. వివిధ కాలాలలోని సంఘటనలు, ప్రధానమైన సంఘటనలకు చరిత్ర పుస్తకాలలో చోటు కల్పించే విషయంలో NCERT(నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చి అండ్ ట్రైనింగ్) సరైన సూచనలు అందిస్తూ బాధ్యతతో వ్యవహరించాలని ప్యానెల్ సూచించింది. కారణం కూడా వివరించింది. ఎన్ సీ ఈ ఆర్ టీ రూపొందించిన చరిత్ర పుస్తకాలలో మనదేశంలోని కొన్ని గొప్ప గొప్ప రాజవంశాల ప్రస్తావవన లేదని, అలాంటి వాటిలో విక్రమాదిత్య, చోళ రాజులు, చాళుక్యులు, విజయనగర పాలకులు, గోండ్వానా పాలకులు, అస్సాంలోని అహోమ్స్ లేదా తిరువనంతపురం (ట్రావెన్ కోర్) రాజ్యాల వివరాలు లేవని ఉదహరించింది. ఈ సందర్భంలోనే పురాతన గ్రంథాలలోని ఆనాటి దేశకాలమాన పరిస్థితులను, ఆనాటి విజ్ఞాన సర్వస్వాన్ని ముందు తరాల వారికి తెలియడం చాలా అవసరమని తెలిపింది.
ఫిలాసఫీ, సైన్స్, గణిత సాస్త్రం, ఆయుర్వేదం, వైద్య రంగం , నాచురల్ సైన్సెస్, పాలిటిక్స్, ఎకనామిక్స్, భాషా శాస్త్రం, కళలు ఇలా అన్ని అంశాలపై మన ప్రాచీన విజ్ఞానాన్ని విస్మరించకుండా బోధించాలని ప్యానెల్ కోరింది. ఆధునిక విజ్ఞానంతో సంప్రదాయక పరిజ్ఞానాన్ని కూడా మేళవించి బోధించాలని సూచించింది.