జుట్టు రాలిపోవడాన్ని ఆండ్రోజెనటిక్ అలోపిసియా అంటారు. దీని కారణంగా ఆడవారు లేదా మగవారిలో జుట్టు రాలిపోయి బట్ట తల వస్తుంది. దీనికి కారణాలను ఇటీవలి దశాబ్దాలలోనే గుర్తించగలిగారు. చాలా కాలం పాటు స్త్రీలలో పురుష హార్మోన్లు ఎక్కువగా ఉండడం, టెస్టోటెరోన్ మోతాదు అధికంగా ఉంటే ఈ సమస్య వస్తుందని అనుకునేవారు. నిజానికి ఈ లక్షణాలు మహిళల్లో కూడా సహజమే కూడా. టెస్టోటెరోన్ ప్రభావం మాత్రమే కాకుండా డౌహైడ్రొటెస్టోటెరోన్ (డి హెచ్చ్ టి) అనేది చాలా కీలకమైన కారణమని గుర్తించారు.
డి.హెచ్.టీ అనేది పురుష హార్మోన్ టెస్టోటెరోన్ నుంచి వెలువడేదే. 5-అల్ఫా అనే ఎంజైమ్ వ్యర్థాలు తోడైనప్పుడు డి.హెచ్.టి తయారవుతుంది. ఇది మన తలపై ఉండే జుట్టు కుదుళ్లకు హాని కలిగిస్తుంది. సులభంగా అర్థమయేలా చెప్పాలంటే కొన్ని సందర్భాలలో ఆ జుట్టు కుదుళ్లు నాశనం చేసేందుకు డి హెచ్ టి కారణమవుతుంది. ఫలితంగా జుట్టు రాలిపోవడం అనే సమస్య ఎదురవుతుంది. అందుకే ఇప్పుడు తప్పు డి హెచ్ టీ దే కానీ టెస్టోటెరోన్ ది కాదని నిర్ధారణకు వచ్చారు. ఇది కుదుళ్లను బలహీనం చేస్తుంది. ఫలితంగా ఆరోగ్యవంతమైన జుట్టు నిలవలేదు.దీని ప్రభావం స్త్రీలపై మాత్రమే కాదు. పురుషులపై కూడా ఉంటుంది. సాధారణంగా ఈ టెస్టోటెరోన్ అన్నది స్త్రీలలో కూడా కొద్ది మోతాదులో ఉంటుంది. అది పూర్తిగా తగ్గిపోయిన సందర్భాలలో సైతం డి హెచ్ టీ ఉత్పత్తి జరుగుతుంది. జుట్టు రాలిపోయేందుకు కారణం అవుతుంది.
వైద్య పరీక్షల్లో డి.హెచ్.టీ సాధారణ స్థాయిలోనే ఉన్నట్లు కనిపించినా అవి సమస్యను తెచ్చపెట్టడానికి చాలు. అవి పెరగకపోయినా సమస్యే. ఎందుకంటే శరీరపు కెమిస్ట్రీ మరీ సున్నితమైనదయితే (ఓవర్ సెన్సిటివ్) సాధారణ పరిమితి కూడా హానికరమే. హార్మోన్లన్నీ సరిగానే ఉన్నా ఈ సమస్య రావచ్చు.హార్మోన్లు అన్నీ సరైన పాళ్లలో ఉన్నప్పుడే అవి ప్రభావవంతంగా ఉంటాయి. ఆండ్రోజిన్స్ (పురుష హార్మోన్లు) అతిగా పెరిగిపోయినప్పుడు మాత్రమే సమస్య అనుకోరాదు. వాటికి వ్యతిరేకమైన స్త్రీ హార్మోన్లు తక్కువ స్థాయికి చేరినా, ఆండ్రోజిన్స్ అంటే డి హెచ్ టీ పెరగవచ్చు. ఇలాంటి తేడాలు కూడా జుట్టు రాలిపోయేందుకు కారణం కావచ్చు. అదే విధంగా థైరాయిడ్ హార్మోన్లు సమతూకంలో లేకపోయినా, ప్రెగ్నెన్సీ సమయంలోనూ, కొన్ని వ్యాధులు వచ్చినప్పుడు వాడే మందుల వల్ల కూడా ఇలా జరగవచ్చు.
మన శరీరంలో హార్మోన్ల స్థాయి స్థిరంగా ఉండదు. కొంత మంది మగవారిలో 30 ఏళ్లు వచ్చిన తరువాత వాటిలో 10 శాతం వరకు తేడా వస్తుంటుంది. ఇక మహిళలకైతే మోనోపాజ్ దశ చేరే సమయంలో ఇలాంటి మార్పులు వస్తాయి. ఎన్ని రకాలుగా చికిత్స చేసినా ముందు నెమ్మదించినట్లు కనిపించినా మళ్లీ పెరగడం మాత్రం తప్పదు.