సౌదీ అరేబియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సున్నీ ఇస్లామిక్ సంస్థ తబ్లిగీ జమాత్ పై నిషేధం విధించింది. దానిని ఉగ్రవాదానికి ద్వారంగా అభివర్ణించింది. ఈ మేరకు సౌదీ ఇస్లామిక్ వ్యవహార మంత్రిత్వ శాఖ ట్విటర్ లో ఒక ప్రకటన చేసింది. వచ్చే శుక్రవారం ప్రార్థనల కోసం మసీదులకు తరలివచ్చే ప్రజలకు తబ్లిగీ జమాత్ కు వ్యతిరేకంగా వారిని హెచ్చరించడంతో పాటు అప్రమత్తం చేయాలని మత ప్రబోధకులకు సూచించింది. అందులో తబ్లిగీలు చేసిన ప్రధాన తప్పిదాలను వివరించాలని కూడా ఇస్లామిక్ మత ప్రబోధకులకు ప్రభుత్వం సూచన చేసింది. వాటిలో ప్రధానమైనవి... ప్రజలను తప్పుదారి పట్టించడం. ఇది యంకరమైన పరిణామంగా ప్రభుత్వం అభివర్ణించింది. తబ్లిగీలు దీనిని మరోరకంగా ప్రచారం చేసుకున్నా భవిష్యత్ లో ఉగ్రవాదానికి ఇది ఒక ద్వారంగా రూపుమారే అవకాశం ఉందని మత ప్రబోధకులకు తెలిపింది. అదే సమయంలో విభజన గ్రూపులతో తబ్లిగీల సత్సంబంధాలను కూడా ప్రభుత్వం ఎత్తి చూపింది. దానికి ఉదాహరణగా దేశంలో ఇప్పటికే నిషేధానికి గురైన దవాహ్ గ్రూప్ తో తబ్లిగీలు జట్టుకట్టడాన్ని గుర్తు చేసింది. ఇది అత్యంత ప్రమాదకరం అని ప్రజలకు వివరించాలని ఇస్లామిక్ మంత్రిత్వ శాఖ సూచించింది.
అసలు ఎవరు ఈ తబ్లిగీలు
తబ్లిగీ జమాత్ అంటే ప్రబోధకుల సమాజాం అని అర్థం. ఇది ఒక సున్నీ ఇస్లామిక్ మిషనరీ ఉద్యమం. 1926లో సూఫీ మహ్మద్ ఇలియాస్ అల్-కంధ్లావి దీనిని స్థాపించారు. భారత్ లోని మేవాట్ ప్రాంతంలో ఇది పురుడుపోసుకుంది. తొలుత దియోబంది ఉద్యమంగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. తర్వాత క్రమంలో క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యానికి గురవుతున్న ఇస్లామిక్ సంప్రదాయాలకు తిరిగి ఆచరణలోకి తీసుకురావడాన్ని లక్ష్యంగా ఎంచుకుంది. దానిని ఇస్లామిక్ సంస్కరణలుగా అభివర్ణించింది. అందుకు ఆరు సూత్రాలను పేర్కొంది. కలీమా(విశ్వాసం ప్రకటించడం), సలాహ్ (ప్రార్థన), లమ్-ఒ-జికర్ (చదవడం), ఇక్రామ్ - ఎ- ముస్లిం( ముస్లింలను గౌరవించడం), ఇక్లాస్ -ఎ- నియత్ (సిన్సియారిటీ), దావత్ -ఓ-తబ్లీగ్ (మత మార్పిడులు) లను ఉద్భోదించింది. తబ్లిగీల ప్రధాన ఉద్దేశం మహ్మద్ ప్రవక్త ప్రబోధించిన మతపరమైన సంప్రదాయలను తిరిగి విస్త`తంగా ఆచరణలోకి తీసుకురావడం. వ్యక్తిగత ప్రవర్తన, దుస్తుల ధారణ ఏ విధంగా ఉండాలి తదితర శాలను బోధిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 350 నుంచి 400 మిలియన్ల మందిని తమ అనుచరులుగా చేర్చకుకోవాలన్నది తబ్లిగీ జమాత్ లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా దక్షిణాసియాపై ద`ష్టి సారించింది. ప్రస్తుతం 150 దేశాల్లో తబ్లిగీల శాఖలు ఉన్నాయి. దానిని 200కు చేర్చాలని పట్టుదలతో ఉంది.
చర్చనీయాంశమైన తబ్లిగీలు
భారత్ లో తబ్లిగీ జమాత్ ఇస్లామిక్ సంస్థ గురించి చెప్పాలంటే కొవిడ్ మహమ్మారి ఆవిర్భవించిన తొలి రోజులు గుర్తుకు వస్తాయి. ఢిల్లీలోని మర్కజ్ నిజాముద్దీన్ లో కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించి వేలాది మందితో మత సమ్మేళనం నిర్వహించడం, విదేశాల నుంచి తరలివచ్చిన వారిలో కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడడంతో భారత్ లో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది.