Courtesy: twitter.com/chesscom
ఒక చిన్న ఆటలో ఒకసారి గెలిస్తే ఆనందం.. మరోసారి గెలిస్తే సంతోషం ముచ్చటగా మూడోసారి గెలిస్తే అది ఎంతో ఎంతెంతో గర్వించాల్సిన సందర్భం. కానీ ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఏకంగా ఐదుసార్లు ప్రపంచ విజేతగా నిలవటమంటే అది మామూలు విషయం కాదు. అది కూడా బుర్రలు బద్ధలు కొట్టుకునే 64 గళ్ల ఆటైన చదరంగంలో. కానీ ఈ చెస్ ఆటలో కేవలం ఎనిమిదేండ్ల వ్యవధిలో ఐదు సార్లు ప్రపంచ టైటిల్‌ను ముద్దాడిన ఆ యువకుడు న భూతో... అనే విధంగా తన చరిత్రను తానే స్వర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ఎనిమిదేండ్ల క్రితం మన చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌ను ఓడించి... ఔరా అనిపించుకున్న ఆ చదరంగపు వీరుడు, నేటి మేరు నగధీరుడు కార్ల్ సన్. ప్రస్తుత చాంపియన్‌షిప్‌లో రష్యా గ్రాండ్ మాస్టర్ ఇయాన్ నెపోమ్నియాను ఓడించి టైటిల్‌ను ఎగరేసుకుపోయాడు.
చెస్ కెరటం
31 ఏండ్ల కార్ల్ సన్... 2013లో మద్రాసులో జరిగిన వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్‌లో విశ్వనాథన్ ఆనంద్‌ను ఓడించి, తొలిసారి టైటిల్‌ను గెలిచాడు. ఆ తర్వాతేడాది కూడా ఆనంద్‌నే ఓడించి రెండోసారి టైటిల్‌ను ముద్దాడాడు. 2016లో కర్నాకిన్ను, 2018లో కరువానాను ఓడించి మొత్తం నాలుగు టైటిళ్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ఐదోసారి టైటిల్‌ను గెలిచి ప్రపంచ చెస్ మేధావులతో ఔరా.. అనిపించుకున్నారు. చదరంగపు క్రీడాలోకంలో సాటి, మేటి క్రీడాకారులతో శభాష్ అనిపించుకున్న ఈ చెస్ కెరటం... భావి తరాలకు, ముఖ్యంగా యువతకు స్ఫూర్తి అనటంలో ఎలాంటి సందేహమూ లేదు. భారత్ లాంటి యువత ఎక్కువ ఉన్న దేశాల్లో చెస్‌లాంటి మేధోపరమైన ఆటకు ఆదరణ కరువవుతున్న వేళ... ఇతర క్రీడలకు ధీటుగా దీన్ని తయారు చేయాల్సిన అవసరముంది. అందుకోసం ప్రభుత్వాలు అటు మాజీ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ జీవితాన్ని, ఇటు కార్ల్సన్ విజయాలను పాఠశాలలు, కళాశాలల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి. తద్వారా యవతీ యువకుల్లో చెస్ పట్ల ఆసక్తిని రగిలించాలని కోరుకుందాం.