భారత్ తో భవిష్యత్ సంబంధాలపై పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ విపరీత వ్యాఖ్యలు చేశారు. భారత్ లోని ప్రస్తుత నాయకత్వం అనుసరిస్తున్న మతపరమైన జాతీయవాదం కారణంగా ఆ దేశంతో అర్థవంతమైన చర్చలకు ఇప్పట్లో అవకాంశం లేదని స్పష్టం చేశారు. శుక్రవారంనాడు ఇస్లామాబాద్ లో జరిగిన‘శాంతియుత, సౌభ్రాత`త్వ దక్షిణాసియా-2021’ సదస్సులో ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించారు. దశాబ్దాలుగా అపరిష్క`తంగా ఉన్న కశ్మీర్ సమస్య పరిష్కారానికి పాక్ ఎన్నిసార్లు చొరవ తీసుకున్నా లాభం లేకుండా పోయిందని, ఈ నేపథ్యంలో రెండు దేశాలు పక్కపక్కన కూర్చోవడం సాధ్యం కాదన్నారు. ఒకపక్క పాకిస్థాన్ లో కొంత కాలంగా మైనారిటీల పట్ల ఆ దేశ ప్రజల్లో అసహనం పెరిగిపోయి, వరుస దాడులకు పాల్పడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటుండడంతో ఆర్థిక చర్యల టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఎటిఎఫ్) పాక్ ను ఇటీవల గ్రే లిస్ట్ లో పెట్టింది. అలాంటి తరుణంలో ఇమ్రాన్ ఖాన్ భారత్ ను ఉద్దేశించి చేసిన మతపరమైన జాతీయ వాదం వ్యాఖ్యలు ఆయనను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. దక్షిణాసియాలో శాంతికి కశ్మీరే కీలక అంశమని ఇమ్రాన్ పేర్కొన్నారు.
అమెరికా-చైనా నడుమ దౌత్య వారధి
చైనా-అమెరికాల నడుమ కొంతకాలంగా విభేదాలు తీవ్ర రూపం దాల్చాయని, వాటికి కారణమైన అనుమానాలను ప్రారదోలి రెండు దేశాల నడుమ సత్సంబంధాలకు దారి తీసేలా పాక్ అందుకు వారధిలా నిలవాలని కోరుకుంటోందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా పాక్ ఇలాంటి పాత్రనే పోషించాలని భావిస్తుందన్నారు. రెండు శక్తివంతమైన దేశాల నడుమ వైరుధ్యాలు తలెత్తితే మిగతా దేశాలపై ఆ ప్రభావం పడుతోందని, ఆ బాధను మిగతా దేశాలు అనుభవించాల్సి వస్తోందని, అలాంటి పరిస్థితి ఉండకూడదన్నారు. ఇప్పటికే ప్రచ్ఛన్న యుద్ధ ఛాయలు అలుముకున్నాయని, ఆ బ్లాక్స్ ను తొలగించేందుకు పాక్ శాయశక్తుల ప్రయత్నిస్తుందన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఈ నెల 9-10 తేదీల్లో నిర్వహించిన ప్రజాస్వామిక శిఖరాగ్ర సదస్సులో ఎందుకు పాల్గొన లేదన్న ప్రశ్నకు ఇమ్రాన్ ఖాన్ తన జవాబుతో సమర్థించుకున్నారు. అన్నివిపత్కర సమయాల్లో పాకిస్థాన్ కు చైనా ఆప్తమిత్రుడు కాబట్టే తమకు ఆహ్వానం అందలేదని చెప్పారు. పాక్ గ్రే లిస్ట్ లో ఉన్న కారణంగా ఆహ్వానం అందలేదన్నది ఇక్కడ ప్రస్తావనార్హం.
అమెరికా శిఖరాగ్ర సదస్సులో మోడీ
అమెరికా అధ్యక్షుడు ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజాస్వామిక శిఖరాగ్ర సదస్సులో శుక్రవారంనాడు వర్చువల్ గా ప్రసంగించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామిక విలువలకు బలం చేకూరేందుకు ఇతర భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేసేందుకు భారత్ సదా సిద్ధంగా ఉంటుందని మోడీ అన్నారు. ప్రజాస్వామ సమాజాలను పరిరక్షించేందుకు సాంకేతిక సంస్థలు తమ సేవలందించేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి భారతీయ నాగరికతలో భాగమని, అది మహోన్నతమైన లక్షణం కూడా అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాతినిధ్యం వహించడాన్ని గర్వంగా ఫీలవుతున్నానని మోడీ పేర్కొన్నారు. బైడెన్ నాయకత్వంలోని నిర్వహించిన ఈ సదస్సులో వంద మందికిపైగా నేతలు ప్రసంగించారు. అందులో ప్రధాని మోడీ ఒకరు కావడం విశేషం.