ప్రతి ఏటా డిసెంబర్ 16వ తేదీని భారతదేశం విజయ్ దివస్ గా జరుపుకుంటుంది. సరిగ్గా 49 సంవత్సరాల క్రితం..అంటే 1971 సంవత్సరంలో దాయాది దేశం పాకిస్థాన్(అప్పుడు పశ్చిమ పాకిస్థాన్ ) తో జరిగిన భీకర యద్ధంలో భారత్ విజయం సాధించిన నేపథ్యంలో దానికి గుర్తుగా ఆ రోజును భారత్ సెలెబ్రేట్ చేసుకూంటూ వస్తోంది. ఈ యుద్ధంతో తూర్పు పాకిస్థాన్ కు అంటే ప్రస్తుత బంగ్లాదేశ్ కు పాకిస్థాన్ నుంచి భారత్ విముక్తి కల్పించింది. బంగ్లాదేశ్ అవతరణకు సంపూర్ణంగా సహకరించింది. డిసెంబర్ 3, 1971న మొదలైన యుద్ధం 13 రోజుల పాటు సాగింది. డిసెంబర్ 16న పాకిస్థాన్ బలగాలకు నాయకత్వం వహిస్తున్న జనరల్ నియాజీ తన 93వేల మంది సైనికులతో భారత్ కు లొంగిపోయారు. బంగ్లాదేశ్ లో దీనిని ‘బిజోయ్ దిబోస్’గా జరుపుకుంటారు. ఈ రోజును పాకిస్థాన్ నుంచి స్వాతంత్ర్యం సంపాదించుకున్న రోజుగా బంగ్లాదేశీయులు అధికారికంగా నిర్వహిస్తారు.
1971 ఇండో-పాక్ యుద్ధం గురించిన కొన్ని ముఖ్యమైన విషయాలు...
- తూర్పు పాకిస్థాన్ లో వెలువడిన ఎన్నికల ఫలితాలను లెక్క చేయకుండా పశ్చిమ పాకిస్థాన్ అక్కడి ప్రజలపై అణచివేతలకు పాల్పడడమే కాకుండా తప్పుగా ప్రవర్తించడం మొదలు పెట్టింది. ఇది బంగ్లాదేశీయుల్లో స్వాతంత్ర్య కాంక్షను రగిలించింది.
- 1971, మార్చి 26న తూర్పు పాకిస్థాన్ వేర్పాటువాద ఉద్యమాన్ని ప్రకటించుకుంది. దానికి అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. తూర్పు పాకిస్థాన్ వాసులకు అండగా ఉంటామని, వారి స్వాతంత్ర్య పోరాటానికి అండగా నిలుస్తామని తెలిపారు.
- దీంతో తూర్పు పాకిస్థాన్ లో పశ్చిమ పాకిస్థాన్ బలగాలు నరమేథాన్ని మొదలు పెట్టాయి. ముఖ్యంగా అక్కడి బెంగాళీలు, హిందువులపై దమనకాండను సాగించాయి. ఈ అంశాల మీడియా ద్వారా బయటి ప్రపంచానికి పొక్కాయి. ఈ నరమేథంతో 10 మిలియన్ల ప్రజలు అంటే దాదాపు కోటి మంది పొరుగున ఉన్న భారతదేశానికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వలస వచ్చారు. దానికి భారత్ కు మానవతా సాయం అందిస్తూ వారికి సరిహద్దులు తెరిచింది. దాంతో పశ్చిమ పాకిస్థాన్ బలగాల నుంచి ప్రాణాలు కాపడుకోవడానికి తూర్పు పాక్ నుంచి పెద్ద ఎత్తున శరణార్థులు తరలివచ్చారు.
- జరుగుతున్న పరిణామాలతో రగిలిపోయిన భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు డిసెంబర్ 4-5 తేదీల్లో ఇండియాకు చెందిన పశ్చిమ నౌకాదళం పాకిస్థాన్ కు చెందిన కరాచీ పోర్టుపై మెరుపుదాడికి దిగింది. తీవ్ర నష్టం చేకూర్చింది. దానికి ఆపరేషన్ ‘ట్రైడెంట్’గా పేరు పెట్టారు.
- పశ్చిమ దిశన పాక్ కూడా సేనలను పెద్ద ఎత్తున మోహరించింది. దానిని భారత బలగాలు సమర్థవంతంగా తప్పికొట్టాయి. వేలాది కిలోమీటర్ల దూరానికి విజయవంతంగా పాక్ బలగాలను వారి భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ తరిమికొట్టాయి. అంటే ప్రస్తుత పాకిస్థాన్ లోని వేలాది కిలో మీటర్ల భూభాగాన్ని భారత బలగాలు ఒక రకంగా ఆక్రమించాయి.
- ఈ యుద్ధంలో 8వేల మంది పాక్ సైనికులు మరణించగా, 25వేల మంది గాయాలపాలయ్యారు. భారత్ కు చెందిన 3వేల మంది సైనికులు వీర మరణం పొందారు. 12వేల మంది క్షతగాత్రులయ్యారు.
- బంగ్లాదేశ్ లోని పాక్ సైన్యానికి మద్దతుగా నిలిచిన పాకిస్తానీ ఇస్లామిస్ట్ మిలిషియా సభ్యలు జరిపిన దమనకాండలో 3లక్షల మంది అమయాక పౌరులు చనిపోయారు.
- 2లక్షల నుంచి 4లక్షల మంది యువతులు, మహిళలపై రజాకార్లు అత్యాచారాలకు ఒడిగట్టారు.
- తూర్పు ప్రాంతంలో తూర్పు పాకిస్థాన్ కు చెందిన ముక్తి వాహిని అనే గెరిల్లాలు భారత్ కు తోడుగా ఈ యుద్ధంలో పాలుపంచుకున్నాయి. వారికి భారత్ కూడా ఆయుధాలు, శిక్షణ ఇప్పించి యుద్ధ రంగంలో వారిని పోరాటానికి తీర్చిదిద్దింది. యుద్ధంలో భాగస్వాములు అయ్యేలా తోడ్పడింది.
- సుమారు 93వేల మంది బలగాలతో అప్పటి పాక్ సైనిక చీఫ్ జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీ భారత్ కు లొంగిపోయారు. దీంతో యుద్ధం పరిసమాప్తమైంది. 1972లో భారత్-పాక్ నడుమ షిమ్లా ఓడంబడిక జరిగింది.
బంగ్లా స్వాతంత్ర్య స్వర్ణోత్సవాలకు రాష్ర్టపతి కోవింద్..
బంగ్లాదేశ్ స్వాతంత్ర్య స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నవేళ భారత రాష్ర్టపతి రాంనాథ్ కోవింద్ దంపతులు అక్కడ పర్యటిస్తున్నారు. బంగ్లాదేశ్ అధికారిక ఆహ్వానం మేరకు బుధవారంనాడు బంగ్లాదేశ్ చేరుకున్న ఆయనకు ఆ దేశ అధ్యక్షుడు అబ్దల్ హమీద్ దంపతులు ఎర్రతివాచీ స్వాగతం పలికారు. 21 గన్ సెల్యూట్ తో రాష్ర్టపతిని బంగ్లాదేశ్ గౌరవించింది. ఆ దేశానికి చెందిన త్రివిధ దళాలు రాష్ర్టపతికి ఘనస్వాగతం పలికాయి. గురువారంనాడు జరగనున్న బంగ్లాదేశ్ స్వాతంత్ర్య సర్ణోత్సవ వేడుకల్లో కోవింద్ దంపతులు పాల్గొని, ఆ దేశాధ్యక్షుడు అబ్దుల్ హమీద్ తో దౌత్య పరమైన చర్చలు జరుపుతారు.