మన భారతావనిలో ఆధ్యాత్మికత వెల్లివిరిసే అపూర్వ ఆలయాలకు లెక్కలేదు. ఆ ఆలయాల కథనాలు కూడా వేటికవి ప్రత్యేకమే... తెలుసుకున్న కొద్దీ ఆశ్చర్యంగానూ..చూసినకొద్దీ అద్భుతంగానూ కనిపిస్తాయి. అలాంటి ఆలయాలలో ఒకటి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆలయం.శివుడు లింగరూపుడు..మనంకూడా అలాగే కొలుస్తాం. విగ్రహరూపంలో ఉన్న శివాలయాలు మనకు ఎక్కువగా కనిపించవు. అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఆలయంలో శివుడు లింగాకారంలో కనిపించడు...అంతేకాదు తలక్రిందులుగా తపస్సు చేస్తున్నట్లు ఉంటాడు. ఒకే రాతిపై పార్వతీదేవి శివుడు ఇద్దరు మనకు దర్శనం ఇస్తారు. పైగా పార్వతీదేవి తో చిన్నపిల్లాడైన కుమారస్వామి తల్లి ఒడిలో ఉంటాడు. ఇలా మనకి వేరెక్కడ కానరాదు. మరి ఆ ఆలయం ఎక్కడ ఉందో..ఆలయ విశేషాలు ఏంటో చదివేసేయండి!
ఎక్కడ ఉంది!
ఆంధ్రప్రదేశ్ లోని పంచారామ క్షేత్రాలు కొలువై ఉన్న భీమవరానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది యనమదుర్రు గ్రామం. ఆగ్రామంలోనే కొలువై ఉన్నాడు శ్రీ శక్తీశ్వరస్వామి.
స్థలపురాణం
పూర్వం ఈ ప్రాంతం పేరు యమునాపురం.ఇక్కడ శంబరుడనే రాక్షసుడుండేవాడు.ఆ రాక్షసుడు అక్కడ ఉండే మునులను హింసించేవాడు. ఆ మునులు ఆ రాక్షసుడి బాధలు పడలేక యమధర్మరాజు దగ్గరకెళ్ళి వాడినుంచి విముక్తి కలిగించమని మొరబెట్టుకున్నారు. యముడు ఆ మునులకోసం ఆ రాక్షసుడితో తలపడి, అతని చేతిలో చాలా సార్లు ఓడిపోయాడు. రాక్షసుడిని జయించడానికి శివునికోసం తపస్సు చేశాడు.శివుడు ఆ సమయంలో యోగనిష్టలో వుండటంతో ప్రత్యక్షంకాలేదు.పార్వతీదేవి యముని తపస్సుకి మెచ్చి, ప్రత్యక్షమై, తనలోని శక్తి అంశను యమునికిచ్చి శంబరుని వధించేటట్లు చేస్తుంది.తన విజయానికి చిహ్నంగా ఆ ప్రాంతానికి యమపురి అని నామకరణం చేశాడు యమధర్మరాజు. అమ్మవారు తనపై చూపించిన కరుణకు యముడు ఉప్పొంగిపోయి,భవిష్యత్ లో ఈ ప్రాంతంలో రాక్షసులు సంచరించటానికి వీలులేకుండా పార్వతీ పరమేశ్వరులను పుత్ర సమేతంగా అక్కడ వెలియమని కోరాడు.యముని కోరికమేరకు బాలింతరాలైన పార్వతీదేవి తన మూడు నెలల పసిబిడ్డతో,యోగనిష్టలో వున్న ఈశ్వరుడితో ఇక్కడ సాక్షాత్కరించింది. దీనికి ఆధారంగా ఈ జిల్లాలో నరసాపురం తాలూకాలోని శంబరీవి అనే ద్వీపాన్ని చెప్తారు.ఈ శంబరుడు శ్రీరామచంద్రుడు పరిపాలించిన త్రేతాయుగంనాటివాడు.అందుకనే ఈ ఆలయం త్రేతాయుగంనాటిదిగా ప్రసిధ్ధికెక్కింది.
ఆలయ విశేషాలు
ఆలయానికి ఎదురుగా శక్తికుండము అనే మంచినీటి సరస్సు వుంది.స్వామివారి అభిషేకానికి, నైవేద్యానికీ ఈ నీటినే వినియోగిస్తారు.ఈ శక్తికుండములోని నీరు మామూలు నీరు కాదు.కాశీలోని గంగానదిలోని ఒక పాయ అందర్వాహినిగా వచ్చి ఇక్కడ ప్రవహిస్తోందని అందుకని ఇది గంగాజలంతో సమానమని అంటారు. దక్షిణకాశీగా పిలవబడే ఈ క్షేత్రానికి పాలకుడు కుమారస్వామి. ఈ ఆలయానికి, చెరువుకు కాపలాగా రెండు నాగుపాములు ఇటీవలి కాలందాకా ఉండేవి, ఉదయం బ్రహ్మ ముహూర్తంలో ఈ నాగుపాములు చెరువుచుట్టూ మూడుసార్లు తిరిగి, స్వామి దర్శనం చేసుకుని తిరిగి చెరువులోకెళ్ళిపోవటం చూసినవారున్నారు.ఇప్పుడు కూడా ఆ ప్రాంగణంలో రెండు నాగు పాము పిల్లలు తిరుగుతుంటాయి.ఇవి ఒక్కొక్కసారి స్వామి విగ్రహాన్ని చుట్టుకుని వుంటాయట.పంచారామాలకన్నా పురాతనమైనదని చెప్పబడే ఈ ఆలయంగురించీ, శక్తీశ్వరుని గురించీ, మహాకవి కాళిదాసు తన మహాకావ్యం కుమార సంభవంలో 68శ్లోకాలలో స్తుతించాడు.భోజరాజు ఇక్కడికి వచ్చి పూజలు సల్పినట్లూ, మహాకవి కాళిదాసు పలుమార్లు ఇక్కడికి వచ్చి శక్తిని పూజించినట్లు కూడా ఆ గ్రంధంలో స్పష్టంగా ఉంది..శ్రీనాధ మహాకవి వ్రాసిన కాశీఖండం కావ్యంలోకూడా ఈ ఆలయం గురించి రాసి ఉంది.ఈ ఆలయంలోని శక్తికుండంలో స్నానం చేసి, స్వామివారిని దర్శనం చేసుకుంటే అపమఈత్యు భయం, వ్యాధులు తొలుగుతాయని భక్తుల విశ్వాసం.