కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు గడుస్తున్న ఏడాదికి ఘనంగా ముగింపు పలకడమేకాకుండా నూతన ఏడాదికి అంతే ఘనంగా స్వాగతం పలకాలని ఉవ్విళ్లూరుతుంటాం. దానికి మందు పార్టీలను వేదికగా చేసుకోవడం ఈ రోజుల్లో ఫ్యాషనైపోయింది. ముఖ్యంగా యువత, మధ్య వయస్కులు డిసెంబర్ మాసం చివరి రోజున అర్ధరాత్రి వరకు సన్నిహితులు, మిత్రులతో కలిసి మద్యం మత్తులో మునిగితేలుతుంటారు. దానిని ప్రభుత్వాలు క్యాష్ చేసుకోవడమే కాకుండా ఖజానాకు కిక్కు ఇచ్చేందుకు సమాయత్తం అవుతున్నాయి. ఈ సారి కొత్త ఏడాది సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కూడా మద్యం ప్రియుల నుంచి వీలైనంత పెద్ద మొత్తంలో సమకూరుతుందని భావిస్తోంది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో రూ.1000కోట్లు వసూలు అవుతుందని విశ్వాసంతో ఉంది. గత ఏడాది అంటే 2000 సంవత్సరం డిసెబంబర్ చివరి నాలుగు రోజుల్లో రూ.759 కోట్లు మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ సారి రాష్ర్ట ప్రభుత్వం మద్యం పాలసీలో భాగంగా 404 కొత్త షాపులకు అనుమతినిచ్చింది. కొత్తగా 159 బార్లు కూడా తెరుచుకునేందు పచ్చ జెండా ఊపింది. ఇది మరింత రాబడికి బాటలు పరుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా కొత్త పాలసీ ద్వారా ఎక్సైజ్ శాఖకు వార్షిక రాబడి కూడా పెరుతుందని, తద్వారా మద్యం అమ్మకాలు పెరిగి రూ.30,000కోట్లు ఆదాయం సమకూరేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అందులో భాగంగానే అదనపు మద్యం షాపులు, బార్లకు ప్రభుత్వం అనుమతిచ్చినట్లు తాజా చర్యలు స్పష్టం చేస్తున్నాయి.
ఇప్పటికే జిల్లాలకు పంపిణీ..
కొత్త సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని మద్యాన్ని ఇప్పటికే ఆయా జిల్లాలకు, పట్టణాలకు చేరవేశారు. 2019 డిసెంబర్ లో 2,216 షాపుల ద్వారా జరిగిన విక్రయాల ద్వారా ప్రభుత్వానికి రూ.2,046 కోట్ల రెవెన్యూ సమకూరింది. గతేడాది విజయదశమి పర్వదినం కూడా ప్రభుత్వానికి మద్యం కాసుల వర్షం కురిపించింది. పండుగ సందర్భంగా ఒక్క అక్టోబర్ మాసంలోనే రూ.2,623కోట్ల అమ్మకాలు సాగాయి. డిసెంబర్ మాసంలో అంటే కొత్త సంవత్సరం జోష్ లో అది 2,765కోట్లు జరిగింది. గతేడాది డిసెంబర్ లో 2.2లక్షల భారత తయారీ లిక్కర్ కేసులు సేల్ అయినట్లు లెక్కలు చెబుతున్నాయి. వాటిలో లక్ష కేసుల బీర్లు ఉండడం విశేషం.
ఆఫర్లతో కంపెనీలు రెడీ...
కొత్త ఏడాది నేపథ్యంలో ఈ నెలలో 34లక్షల కేసుల భారత తయారీ లిక్కర్ కేసులను ఉత్పత్తి చేసి సిద్ధంగా ఉంచారు. వాటిలో 27లక్షల కేసుల బీర్లు భారత్ లో తయారు చేసినవే. మిగతావి విదేశీ తయారీ. అమ్మకాల్లో ఈ సారి లక్ష్యాన్ని చేరుకుంటే విదేశీ టూర్ లు, విలువైన బహుమతులను ఆఫర్ చేశాయని ఓ లిక్కర్ స్టోర్ యజమాని చెప్పుకొచ్చారు. ఇక రాష్ర్ట ఎక్సైజ్ శాఖ కూడా కొత్త ఏడాది మద్యం అమ్మకాలపై గట్టి నమ్మకంతో ఉంది. ఈ సారి రూ.1000 నుంచి 1200 కోట్లు వ్యాపారం జరిగినా ఆశ్చర్య పోనక్కర్లేదని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.