Courtesy: twitter.com/zdig1
చైనా టెన్నిస్ స్టార్ పెంగ్ షువాయి సంచలన ప్రకటన చేసింది. తానెప్పుడు ఎవరికి వ్యతిరేకంగా లైంగిక వేధింపుల ఆరోపణలు చేయలేదని పేర్కొంటూ అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ మేరకు ఓ సింగపూర్ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అనేక విషయాలు వెల్లడించింది.‘ఇక్కడ నేను ఒక విషయం నొక్కి మరీ స్పష్టం చేయదలచుకున్నాను. నన్ను ఎవరూ లైంగికంగా ఒత్తిడి చేసినట్లు ఎప్పుడూ రాయలేదు,చెప్పలేదు’అని పెంగ్ చెప్పిన వీడియో క్లిప్ ను సింగపూర్ మీడియా ఔట్ లెట్ కు చెందిన లియాన్హె జావోబావో పోస్టు చేసింది.
వీబోలో వచ్చిన తన పోస్టుపై చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, ఇక ఇంతకుమించి పొడిగించదలచుకునే ఉద్దేశం లేదని,తాను జాంగ్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదని పెంగ్ స్పష్టం చేసింది. అయితే తన వీబో ఖాతాలో ప్రముఖుడిపై చేసిన ఆరోపణలు,అవి వెంటనే ఖాతా నుంచి మాయం కావడాన్ని ఒక ప్రైవేటు వ్యవహారంగా అభివర్ణించింది. తానిప్పుడూ బీజింగ్ లోనే నివసిస్తున్నారని,తనపై ఎవరి నిఘా కూడా లేదని పెంగ్ చెప్పారు. షాంఘైలో జరిగిన బాస్కెట్ బాల్ ఈవెంట్ ను కాసేపు కూర్చొని పెంగ్ వీక్షించింది. ఈ సందర్భంగానే తనను పలకరించిన సింగపూర్ కు చెందిన ప్రముఖ మీడియా సంస్థతో ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది.
పెంగ్ ను చూడడం ఆనందంగా ఉంది...
కొద్ది రోజుల పాటు పెంగ్ జాడ తెలియక నిరసన వ్యక్తం చేయడమే కాకుండా అవసరమైతే టోర్నీలను బహిష్కరిస్తామని మహిళల టెన్నిస్ అసోసియేషన్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వీడియో క్లిప్పింగ్ లో పెంగ్ దర్శనమివ్వడంతో మహిళల టెన్నిస్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ పెంగ్ కనిపించడం సంతోషంగా ఉందని అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. టోర్నీలను బహిష్కరిస్తామని తాము ప్రకటన చేసిన కారణం ఉందని,క్రీడలను రాజకీయం చేయడం నచ్చకే అలా చేయాల్సి వచ్చిందని అసోసియేషన్ వివరణ ఇచ్చింది.
గతంలో పెంగ్ పెట్టిన పోస్టు ఏంటీ..?
గతంలో పెంగ్ తనపై చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు అత్యంత సన్నిహితుడైన సీనియర్ అధికారి జాంగ్ గావోలి లైంగికంగా వేధించాడని సామాజిక మాధ్యమం వీబోలో పోస్టు పెట్టి ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపారు. ఆ పోస్టు పెట్టిన తర్వాత కొన్ని మాసాల పాటు కనిపించకుండా పోయారు. ఆమె జాడపై ప్రపంచమంతటా ఆందోళన వెల్లువెత్తిన కొద్ది రోజుల్లోనే పెంగ్ కనిపించడంతో అభిమానుల్లో ఆగ్రహం చల్లారింది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే అంటే ఆదివారంనాడు తాజా ప్రకటనతో పెంగ్ మరోసారి ప్రపంచం ముందుకు వచ్చారు. ఇవన్నీ చూస్తుంటే చైనా ప్రభుత్వం వెనుకుండే ఇదంతా ఒక పక్కా ప్రణాళిక ప్రకారం చేయిస్తోందని అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రభుత్వంపై పడిన మరకను తుడిచేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నంగా పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.