ప్రకాశం జిల్లాఒంగోలులో వైసీపీ నేత సుబ్బారావు గుప్తాపై సొంత పార్టీ నేతలే దాడి చేశారు. తనపై కొందరు దాడి చేస్తారని ముందే ఊహించిన సుబ్బారావు గుప్తా..ఓ లాడ్జిలో ప్రాణ భయంతో తలదాచుకున్నాడు. అయినప్పటికీ సుబ్బారావు ఆచూకీ తెలుసుకుని మరీ ఆయనను చితక్కొట్టారు. దాడి చేస్తున్న దృశ్యాలను వీడియో తీసి మరీ వార్నింగ్ ఇచ్చారు. ఈ దాడి సుభానీ గ్యాంగ్ ఆధ్వర్యంలో జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవలే మంత్రి బాలినేనిపై అనుచిత వ్యాఖ్యలు చేశావని క్షమాపణలు చెప్పాలని హెచ్చరించారు. మోకాళ్లపై కూర్చోబెట్టి క్షమాపణలు చెప్పించారు.
అసలేం జరిగిందంటే
ఇటీవలే మంత్రి బాలినేని పుట్టిన రోజు వేడుకల్లో సుబ్బారావు గుప్తా పాల్గొన్నాడు. బాలినేనిని అమితంగా ఇష్టపడే సుబ్బారావు తన నేతపై అభిమానం చాటుకున్నాడు. వైసీపీ పార్టీకి భవిష్యత్తులో చాలా నష్టం జరగనుందని పేర్కొన్నాడు. కొందరు నాయకులు చేస్తున్న కామెంట్ల వల్ల పార్టీకి తీరని నష్టం వాటిల్లనుందని అన్నాడు.
అంబటి రాంబాబు, కొనాలి నాని, ఎమ్మెల్యే వంశీ వంటి వాళ్లు చేస్తున్న కామెంట్ల వల్ల పార్టీకి తీరని నష్టం జరగనుందని తెలిపాడు. వచ్చే ఎన్నికల్లో ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే వైసీపీ లీడర్లు కర్రలు పట్టుకుని పరిగెత్తిస్తారని సంచలన కామెంట్లు చేశాడు. సుబ్బారావు చేసిన ఈ కామెంట్లు పలు ప్రసార మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఈ అంశం కొందరు వైసీపీ నాయకులకు కోపం తెప్పించింది. సుబ్బారావు గుప్తాను చితక్కొట్టారు.
సుబ్బారావుకు మతి స్థిమితం లేదు
సుబ్బారావు గుప్తాకు మతి స్థిమితం లేదని మంత్రి బాలినేని అన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా అతడు చేసిన వ్యాఖ్యలు కొందరికి ఆగ్రహం తెప్పించాయని..వారంతా దాడి చేస్తారని ఊహించి వారిని వారించానని కూడా బాలినేని తెలిపారు.