దేశమంతటా సాధారణంగా స్కూల్స్ కు ఆదివారం నాడు సెలవు ఉంటుంది. లక్షద్వీప్ లో మాత్రం శుక్రవారం నాడు సెలవు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. దానికి ఇప్పుడు బ్రేక్ పడింది. ఇకపై లక్షద్వీప్ లో పాఠశాలల పిల్లలకు శుక్రవారం నాడు సెలవు ఉండదు. శుక్రవారాన్ని పనిదినంగా పరిగణిస్తూ లక్షద్వీప్ విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ ను ప్రకటించింది. ఇకపై అక్కడ ఆదివారం నాడు బళ్లకు సెలవు ఉంటుంది. మతపరమైన కారణాలతో అక్కడ ఏళ్లుగా శుక్రవారం సెలవును అమలు చేస్తున్నారు. స్థానిక ఎంపీ మొహమ్మద్ ఫైజల్ కూడా శుక్రవారం సెలవును డిమాండ్ చేస్తున్నారు. ఆరు దశాబ్దాలుగా శుక్రవారం నాడే సెలవు ఇవ్వడాన్ని గుర్తు చేశారు. ఆ సంప్రదాయాన్ని పాటించాల్సిందిగా డిమాండ్ చేశారు.
లౌకికవాదులు మాత్రం శుక్రవారం సెలవు రద్దుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మతపరమైన విధానాలను దృష్టిలో ఉంచుకుంటే, శుక్రవారం ముస్లింలకు, శనివారం హిందువులకు, ఆదివారం క్రైస్తవులకు సెలవు ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. సిక్కు, బౌద్ధం, జైనిజం, పార్సీ లాంటి ఇతర మతాల వారినీ పరిగణనలోకి తీసుకుంటే వారంలో అన్ని రోజులూ సెలవులు ప్రకటించాల్సి వస్తుందని అంటున్నారు. దేశవ్యాప్తంగా ఒకే విధానం అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం వివిధ అంశాల్లో ‘ఒకే దేశం – ఒకే జాతి’ విధానాన్ని బీజేపీ అవలంబిస్తోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆదివారం నాడు సెలవును అమలు చేయడాన్ని ఆ పార్టీ సమర్థిస్తోంది. ఒక్కో మతాన్ని సంతృప్తిపరిచే విధానం అవలంబిస్తే...వారంలో అన్ని రోజులూ సెలవులు ప్రకటించాల్సి వస్తుందని, లేదంటే...ఒక్కో వర్గం విద్యార్థులకు ఒక్కో రోజు సెలవు ప్రకటిస్తే...వారు తరగతులు కోల్పోయే అవకాశం ఉందన్న భావన వ్యక్తమవుతోంది. మొత్తం మీద వన్ నేషన్- వన్ హాలీడే దిశగా దేశం పయనిస్తోంది.