సాధారణంగా క్రైస్తవ దేశాల్లో మాత్రమే ఆదివారం సెలవు ఉంటుంది. ముస్లిం దేశాల్లో శుక్రవారం సెలవు ఉంటుంది. మరి హిందూ ఆధిక్యం గల భారతదేశంలో శనివారాన్ని సెలవుదినంగా ఎందుకు ప్రకటించలేదు...ఆదివారాన్ని ఎందుకు సెలవు దినంగా ప్రకటించారన్న సందేహం పలువురికి రావడం సహజం. నిజానికి ఆదివారం సెలవు దినం కావడం వెనుక పెద్దకథనే ఉంది.
భారతదేశంలో 1843 నుంచి కూడా బ్రిటిషర్లు ఆదివారం నాడు సెలవు తీసుకోవడం ఆనవాయితీగా ఉంది. అందుకు మతపరమైన కారణం కూడా ఉంది. ‘‘ఆరు రోజులు వరుసగా సృష్టి కార్యక్రమం చేసిన దేవుడు ఏడవరోజైన ఆదివారం నాడు విశ్రాంతి తీసుకున్నాడు’’ అని వారు విశ్వసిస్తారు. అందుకు అనుగుణంగా ఆదివారం నాడు క్రైస్తవులు సైతం విశ్రాంతి తీసుకుంటారు. క్రైస్తవులు ఆదివారం సెలవు తీసుకోవడం సరే....మరి భారత్ లో హిందువులు కూడా ఆదివారం నాడు ఎందుకు సెలవు తీసుకుంటున్నారు ? దీనికి మూలాలు మిల్లు కార్మికుల పోరాటంలో ఉన్నాయి.
ఆదివారం సెలవు కోసం మిల్లు కార్మికుల పోరాటం
భారత్ బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు మిల్లు కార్మికులు మిగితా అన్ని రోజులతో పాటుగా ఆదివారం కూడా పని చేయాల్సి వచ్చేది. అదే సమయంలో బ్రిటిష్ క్రైస్తవ అధికారులు, సిబ్బంది మాత్రం ఆదివారం సెలవు తీసుకునే వారు. చర్చికి వెళ్లి వచ్చిన తరువాత ఏ పనీ చేసే వారు కాదు. అలాంటి సమయంలో నారాయణ్ మేఘాజీ లోక్ హాండే అనే కార్మిక నాయకుడు భారతీయ హిందువులకు సైతం వారంలో ఒక రోజు సెలవు కావాలని డిమాండ్ చేశారు. వారంలో అన్ని రోజులూ పని చేయడం కష్టమని వాదించారు. ఆదివారం తాము ‘ఖండోబా’ (శివుడి అవతారం) దేవుడిని పూజిస్తాం కాబట్టి, ఆ రోజును సెలవుగా ప్రకటించాలని కోరారు. అందుకు బ్రిటిష్ అధికారులు తిరస్కరించారు. అయినా కూడా నారాయణ్ తన పోరాటం కొనసాగించారు. ఏడేళ్ల పోరాటం తరువాత 1890 జూన్ 10న ఆదివారం ను సెలవుదినంగా ఇచ్చేందుకు బ్రిటిష్ అధికారులు అంగీకరించారు. అలా బ్రిటిష్ పాలన నుంచి ఆదివారం సెలవుదినంగా పాటించడం ఆనవాయితీగా వస్తోంది.
ఖండోబా పూజల కోసం ఆదివారం సెలవు
దక్కన్ ప్రాంతంలో...మరీ ముఖ్యంగా మహారాష్ట్ర ప్రాంతాల్లో ఆదివారం నాడు ఖండోబా పూజలు ఘనంగా జరుగుతాయి. వేద సాహిత్యం ప్రకారం కూడా సూర్యుడు హిందువులకు ప్రధాన ఆరాధ్యదైవంగా ఉన్నాడు. ఆదివారం రోజున సూర్యదేవుడికి దేశవ్యాప్తంగా విశేష పూజలు జరుగుతాయి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మాత్రం ఆదివారం సెలవు అంటూ ప్రత్యేక ప్రకటన ఏదీ అధికారికంగా వెలువడిన దాఖలాలు కనిపించడం లేదు. హిందూ కాలమానం ప్రకారం ఆదివారం నుంచే వారం ప్రారంభమవుతుంది. మొత్తం మీద ఖండోబా పూజల కోసం ఆదివారం రోజును బ్రిటిష్ అధికారులు సెలవుదినంగా ప్రకటించాల్సి వచ్చింది.