collapse
...
Home / అంతర్జాతీయం / క్రిస్మస్ ఆంక్షల దిశగా ప్రపంచం - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu | News T...

క్రిస్మస్ ఆంక్షల దిశగా ప్రపంచం

2021-12-21  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

christmas tree (2) (1) (1)
 

కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఐరోపా దేశాలను బెంబేలెత్తిస్తోంది. బ్రిటన్ లోనైతే కల్లోలాన్ని రేపుతోంది. ముఖ్యంగా ఐరోపాలో మెజారిటీ దేశాల ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే క్రిస్టమస్ పర్వదినం ముంగిట ఒమిక్రాన్ఆ విజృంభించడం ఆయా దేశాలను కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ కొత్తవేరియంట్ 91 దేశాలకు వ్యాపించింది. బ్రిటన్ లో ప్రతి రోజు 12వేలకుపైగా కేసులు నమోదు అవుతున్నాయి. 12మంది మరణించారు. ఇప్పటికే బ్రిటన్ లో 35 వేలకుపైగా ఒమిక్రాన్ పాజిటివ్ లు ఉన్నాయి.  
కఠిన ఆంక్షల దిశగా బ్రిటన్ ...  
రోజుకు వేలాది ఒమిక్రాన్ కేసులు, పదుల సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటుండంతో బ్రిటన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. క్రిస్మస్ వేడుకలకు రోజులు దగ్గరపడుతుండడం, జన సమూహాలు పెరిగి వైరస్ మరింత వ్యాపించే ప్రమాదం పొంచి ఉందన్న సూచనల మేరకు బోరిస్ ప్రభుత్వం ఆంక్షలు అమలు చేస్తోంది. డెల్టా రకం కన్నా ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్‌ను కట్టడి చేసేందుకు బ్రిటన్ ఈ నెల 8న పలు ఆంక్షలను ప్రకటించింది.
ప్రజలు ఇంటివద్దనుంచే పని చేయాలని ఆదేశించడంతో పాటుగా మాస్కులు ధరించడం, వ్యాక్సిన్ పాస్‌లు ఉపయోగించడం వంటి నిబంధనలను అమలు చేయాలని  యుకె ఆదేశించింది.  వ్యాపారాలు జోరుగా సాగే క్రిస్మస్ సమయంలో ఇప్పటికే సిబ్బంది గైరుహాజరుతో వ్యాపార సంస్థలు వెలవెలబోతున్నాయి. ఇలాంటి తరుణంలో కఠిన ఆంక్షలకు జాన్సన్ మంత్రివర్గంలో చాలా మంది మంత్రులు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారులు మాత్రం వైరస్‌ను కట్టడి చేయాలంటే కఠిన ఆంక్షలు తప్పవని హెచ్చరిస్తున్నారు. క్రిస్మస్‌కు ముందే కఠిన ఆంక్షలను విధించే అవకాశాలను ఉపప్రధాని డొమెనిక్ రాబ్ కొట్టివేయకపోవడం గమనార్హం.
నెదర్లాండ్స్ లో నలుగురు లోపే అతిథులు..  
నెదర్లాండ్స్ లో రోజుకు 15 వేల ఒమిక్రాన్ కేసులు వెలుగుచూస్తున్నాయి. దేశ ప్రధాని మార్క్ రూట్ కఠిన లాక్ డౌన్ ప్రకటించారు. క్రిస్మస్ పర్వదినాల సందర్భంగా ఆంక్షలు అమల్లో ఉంటాయని, ప్రజలు సహకరించాలని కోరారు. రెస్టారెంట్లు, సినిమా హాళ్లు తదితర బహిరంగ ప్రదేశాలను  జనవరి 14 వరకు మూసివేయాలని ఆదేశించారు. క్రిస్మస్ సందర్భంగా ఇళ్లలోకి ఇద్దరు నుంచి నలుగురుకు మించి అతిథులను అనుమతించవద్దని సూచించారు. కల్చరల్ ఇనిస్టిట్యూట్ లను కూడా మూసివేయాలని, అంతా సహకరించాలని రూట్ కోరారు. 
జర్మనీ, ఫ్రాన్స్  ఒకే బాటలో....  
ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా తమ దేశంలో ఐదో వేవ్ వస్తుందని జర్మనీ భయకంపితమవుతోంది. క్రిస్మస్ వేడుకలకు పొరుగు దేశాల నుంచి పెద్ద ఎత్తున టూరిస్టులు వచ్చే అవకాశాలున్నందున ప్రయాణికులపై ఆంక్షల దిశగా కదులుతోంది. యుకె నుంచి వచ్చే వారిని నిషేధించింది. వ్యాక్సినేషన్ తో సంబంధం లేకుండా బ్రిటన్ జాతీయులపై కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని జర్మనీ ఆరోగ్యశాఖ మంత్రి కార్ల్ లాటెర్బాచ్ విచారం వ్యక్తం చేశారు. ఫ్రాన్స్ కూడా జర్మనీ బాటలోనే నడుస్తోంది. పర్యాటకులపై నిషేధం ప్రకటించింది. బ్రిటన్ జాతీయులు రావొద్దని స్పష్టం చేసింది. 
స్పెయిన్ లో కేసులు పెరుగుతున్నా...  
స్పెయిన్ లో కరోనా అత్యంత హై రిస్క్ దశలో ఉంది. అయితే లాక్ డౌన్ పై ఆ దేశం ఇప్పటికీ ఊగిసలాడుతోంది. ఇప్పటికే తీవ్రంగా నష్టపోయామని, మరిన్ని ఆంక్షలు విధిస్తే ఆర్థికంగా కుంగిపోతామని స్పెయిన్ భయపడుతోంది. 
ఆస్ర్టియా ఆచితూచి...  
ఐరోపా దేశాల్లో ఆస్ర్టియా కొవిడ్ విషయంలో మెరుగైన దశలో ఉంది. ముందు జాగ్రత్త చర్యగా గత నెలలో లాక్ డౌన్ విధించి ఒమిక్రాన్ వ్యాప్తిని అడ్డుకున్న ఈ దేశం ఇప్పుడిప్పుడే పరిమిత సంఖ్యలో విదేశీయులను అనుమతిస్తుంది. క్రిస్మస్ సందర్భంగా తమ అత్యంత ఇష్టమైన వారిని కలుసుకోవడం చాలా ముఖ్యమని, అలాంటి అద్భుత క్షణాలను దూరం చేయకుండా ఉండేందుకు ప్రజల కోసం ముందు నుంచి జాగ్రత్త చర్యలు తీసుకున్నామని ఆస్ర్టియా ఆరోగ్యశాఖ మంత్రి ఊల్ఫ్ గాంగ్ తెలిపారు.  
ఇజ్రాయెల్ లో  ఐదో వేవ్...  
కొవిడ్ కేసులు ఇజ్రాయెల్ ను వణికిస్తున్నాయి. ఈ దేశంలో కొవిడ్ ఐదో దశను ప్రకటించారు.  ఒక్క రోజే ఇజ్రాయెల్ లో 1,004 కొత్త కొవిడ్ పాజిటివ్ లు వెలుగుచూశాయి. రెండు మాసాల తర్వాత ఇంత పెద్ద మొత్తంలో కేసులు వెలుగుచూడడం ఇదే మొదటిసారి దీంతో ఆ దేశంలో కరోనా కేసుల సంఖ్య 1.35కోట్లు దాటిపోయింది.  
వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు వాయిదా....  
కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ రెచ్చిపోతున్న నేపథ్యంలో  ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు వాయిదా పడింది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో నెలకొన్న అనిశ్చితి వల్ల వాయిదా వేస్తున్నట్టు డబ్ల్యుఇఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. షెడ్యూల్ ప్రకారం స్విట్జర్లాండ్ నగరం దావోస్ పర్వతప్రాంతం క్లోస్టర్స్‌లోని రిసార్ట్‌లో జనవరి 17-21 మధ్య సదస్సు జరగాల్సి ఉంది.  ప్రతి ఏటా జరిగే డబ్లూఇఎఫ్ సదస్సుకు ప్రపంచంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, దేశాల అధినేతలు హాజరు కానుండటం తెలిసిందే. కొవిడ్ ఉధృతి తగ్గితే 2022 వేసవి ప్రారంభంలో నిర్వహించే యోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. నిపుణుల సలహామేరకు భౌతిక హాజరుతో సదస్సు నిర్వహించడం తీవ్ర ఇబ్బందులతో కూడినదని భావించిన స్విస్ ప్రభుత్వం సూచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు డబ్ల్యుఇఎఫ్  పేర్కొన్నది.  
 2021-12-21  News Desk