జీ ఎంటర్టెయిన్మెంట్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ బుధవారం నాడు సోని పిక్చర్స్ నెట్వర్క్స్ఇండియాతో విలీనానికి ఆమోదం తెలిపింది. కొత్త కంపెనీలో సోనీకి 50.86 శాతం వాటా కలిగి ఉంటుంది. జీఈఈఎల్ ప్రమోటర్ల వాటా 3.99 శాతంగా కాగా జీఈఈఎల్ వాటాదారుల వాటా 45.15 శాతంగా ఉంటుంది. రెండు కంపెనీల విలీనం ఆవశ్యత గురించి ప్రస్తావిస్తూ.. టీవీ కంటెంట్ డెవలెప్మెంట్, ప్రాంతీయ బ్రాడ్‌కాస్టింగ్, అంతర్జాతీయ ఎంటర్టెయిన్మెంట్ శాటిలైట్ చానల్స్, సినిమాలు, మ్యూజిక్, డిజిటల్ బిజినెస్‌ను అభివృద్ది పరచవచ్చనేది ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రస్తుతం భారత్‌లో కేవలం అతి పెద్ద ఎంటర్టెయిన్మెంట్ నెట్వర్కుగా జీ ఎంటర్టెయిన్మెంట్ సేవలందిస్తోంది.
విలీనం తర్వాత సోనీ వద్ద 1.5 బిలియన్ డాలర్ల నగదు నిల్వలు ఖాతాలో ఉంటాయి. దీంతో వ్యాపారాన్ని మరింత విస్తరించవచ్చు. ముఖ్యంగా డిజిటల్లోకి మారిపోవడంతో పాటు ప్రస్తుతం క్రీడలపై క్రేజ్ బాగా పెరిగిపోతున్న నేపథ్యంలో టెలివిజన్ చానల్ హక్కులు కొనుగోలు చేయవచ్చు. దీంతో పాటు కొత్త కంపెనీని అభివృద్ది చేసుకోవడానికి అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకోవచ్చనేది రెండు కంపెనీల ఆలోచన.
రెండు కంపెనీల విలీనం తర్వాత సోనీ కూడా పునీత్ గోయెంకాను ఎండీ, సీఈవోగా నియమించడానికి అంగీకరించిందని జీ వెల్లడించింది. కొత్తగా ఏర్పడే కంపెనీలో బోర్డు సభ్యులను సోనీ గ్రూపు నియమిస్తుంది. ప్రస్తుతం సోని గ్రూపు ఎండీ, సీఈవో ఎన్పీ సింగ్ ఈ నియామకాలు చేపడుతున్నారు.
కాగా రెండు కంపెనీల విలీనం గురించి సెప్టెంబర్ 22న ప్రకటించారు. అటు తర్వాత జీ- సోనీలు 90 రోజుల్లోగా విలీనానికి కావాల్సిన ప్రక్రియ పూర్తిగా చేస్తుంది. కాగా 90 రోజుల కాలపరిమితి డిసెంబర్ 21తో ముగుస్తుంది.
ప్రస్తుతం ఈ రెండు కంపెనలకు విలీనం ఎందుకవసరం అంటే రెండు కంపెనీలు కలిసి తమ వ్యాపారాన్ని మరింత విస్తరించుకోవడానికి అవకాశం ఉంటుంది. నిపుణుల అంచనా ప్రకారం విలీనం తర్వాత ఏర్పడే కొత్త కంపెనీ ఎంటర్టెయిన్మెంట్ రంగంలో అతి పెద్ద కంపెనీగా అవతరిస్తుంది. ఈ నెట్వర్క్ ద్వారా ఇండియాలో 26 శాతం ప్రేక్షకులను తన ఖాతాలో వేసుకుంటుంది. ఈ ఆర్థిక సంవత్సర మొదటి త్రైమాసికంలో జీ-సోనీ రెండు కలిసి 51 శాతం వాటాను సాధించాయి. హిందీ ఎంటర్టెయిన్మెంట్ చానల్‌తో పాటు హిందీ సినిమాలు విభాగానికి వస్తే 63 శాతం వాటా దక్కించుకుంది. ఈ రెండు కంపెనీల విలీనం స్టార్ డిస్నీకి మధ్యకాలానికి లేదా దీర్ఘకాలానికి గట్టి పోటీ ఇస్తుందని నిపుణులు భావిస్తున్నారు.