రోజురోజుకు పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు భారతదేశంలో కొవిడ్ మూడోదశకు సంకేతాలేనని వరుస అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. డిసెంబర్ మధ్యలో ఆరంభమై, వచ్చే ఏడాది ఫిబ్రవరి మధ్యనాటికి పతాక స్థాయికి చేరుకుంటుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఐఐటి కాన్పూర్ పరిశోధకుల నాయకత్వంలో ఒక అధ్యయనం నిర్వహించారు. ఇందుకోసం అంకగణితాన్ని ఆధారంగా చేసుకున్నారు. కొవిడ్ పారామీటర్ల అంచనాకు ఆల్గారిథమ్ ను ఆసరాగా చేసుకున్నారు. ఇప్పటికే మూడో దశను ఎదుర్కొంటున్న వివిధ దేశాల పరిస్థితులను కూడా ఇందులో అధ్యయనం చేసి తమ పరిశోధన ఫలితాలను ప్రకటిస్తున్నట్లు కాన్పూర్ ఐఐటి గణిత విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ శుభ్రశంకర్ ధర్ వెల్లడించారు. ఇక ఐఐటి హైదరాబాద్, ఐఐటి కాన్పూర్ ఐఐటిల సంయుక్త అధ్యయనం తర్వాత ‘సూత్ర’ మోడల్ ను ప్రకటించింది. రోజువారీ ఒమిక్రాన్ కేసులు ఆరంభంలో పెరిగి, డెల్టా వేరియంట్ ను డామినేట్ చేస్తుందని ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్ ఎం.విద్యాసాగర్, ఐఐటి కాన్పూర్ మనీంద్ర అగర్వాల్ అంచనా.
ఒమిక్రాన్ కేసులు 238... కొవిడ్ కేసులు 7,4957,495
గురువారంనాడు ఉదయం కల్లా భారత్ లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 238కి చేరుకుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటన చేసింది. 65 కేసులతో మహారాష్ర్ట మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత 57 ఒమిక్రాన్ కేసులతో ఢిల్లీ రెండో స్థానం, ఆ తర్వాత తెలంగాణ, గుజరాత్, రాజస్థాన్, కర్నాటక రాష్ర్టాల్లో రోజురోజుకు పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు కలవరపెడుతున్నాయి. హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ర్టాలలో బుధవారంనాడు తొలి కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు గత 24 గంటల్లో భారత్ లో కొవిడ్ పాజిటివ్ కేసులు 7,495 కేసులు నమోదు అయ్యాయి. తద్వారా భారత్ లో మొత్తం కేసుల సంఖ్య 3,47,65,976 కు చేరుకుంది. యాక్టివ్ కేసులు 78,190. 24 గంటల్లో దేశ మంతటా కలిపి 318 మంది కొవిడ్ తో చికిత్స తీసుకుంటూ మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా సంబంధిత మొత్తం మరణాల సంఖ్య దేశంలో 4,78,325కు చేరుకుంది. మంగళవారంనాటి మరణాలతో పోల్చి చూసుకుంటే బుధవారంనాడు 132 మంది అధికంగా చనిపోయారు.
తెలంగాణలో 38 కి చేరిన కొత్త వేరియంట్ కేసులు..
తెలంగాణ రాష్ర్టంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గురువారంనాడు మరో 14 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 38కి చేరింది. రిస్క్ దేశాల నుంచి 259 మంది శంషాబాద్ లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారందరికీ కొవిడ్ ఆర్టిపిసిఆర్ పరీక్షలు నిర్వహించగా, అందులో నలుగురికి పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించారు. ఇప్పటివరకు ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన 9,381 మంది ప్రయాణికులకు రాష్ట్రానికి రాగా, వారిలో 63 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. వారందరి శాంపిల్స్‌ని అధికారులు జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించారు.
నేడు ప్రధానమంత్రి సమీక్ష
దేశంలో ఒమిక్రాన్ క్రమంగా విస్తరిస్తున్న నేపథ్యంలో గురువారంనాడు ప్రధాని నరేంద్రమోడీ తాజా పరిస్థితిపై సమీక్షించనున్నారని అధికారవర్గాలు తెలిపాయి. కరోనా మహమ్మారి ఉనికిలోకి వచ్చిన దగ్గరి నుంచి ప్రధాని ఇప్పటికే పలుమార్లు ఆరోగ్యశాఖ అధికారులు,ముఖ్యమంత్రులు, నిపుణులతో సమీక్షలు నిర్వహించారు. చివరిసారిగా అధికారులతో నవంబర్ చివరి వారంలో సమీక్షించారు. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఇప్పటికే 200 దాటింది. 15 రాష్ట్రాలకు ఇది విస్తరించింది. డెల్టా వేరియంట్‌కన్నా మూడురెట్లు అధికంగా ఇది వ్యాప్తి చెందుతున్నదన్న నిపుణుల విశ్లేషణతో కేంద్రం అప్రమత్తమైంది. వ్యాప్తిని అడ్డుకునేందుకు నియంత్రణ చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు సూచించింది. ఎప్పటికపుడు పరిస్థితిని సమీక్షించేందుకు వార్‌రూంలను ఏర్పాటు చేయాలని తెలిపిన విషయం తెలిసిందే.