కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఓ వివాదానికి కేంద్రబిందువుగా మారారు. తాజాగా ఆయన మీద కేసు నమోదు చేయాలని లక్నోలోని ఓ న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. ఆయన తన పుస్తకంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను కొన్ని రోజుల కిందట ఉత్తరాఖండ్ లోని నైనిటాల్లో సల్మాన్ ఖుర్షీద్ నివాసంపై దాడి జరిగింది. దాడి చేసిన దుండగులు ఇంటికి నిప్పుపెట్టారు. రాళ్లు విసిరారు. ‘ఈ ఘటనకు ఎవరైతే పాల్పడ్డారో.. అలాంటి స్నేహితులతో చర్చల కోసం ఈ ఇంటి తలుపులు తెరవాలని ఆశించా.. ఇది హిందూయిజం కాదని నేను చెప్పింది తప్పంటారా?.. కాబట్టి ఇప్పుడు ఇదే అంశంపై చర్చ.. సిగ్గు అనేది చాలా పనికిమాలిన పదం.. అంతే కాదు ఏకీభవించడం నుంచి వ్యతిరేకించడం మాట పక్కనబెడితే కూర్చుని మాట్లాడుకుంటామని ఇప్పటికీ ఆశిస్తున్నాను’ ’ అంటూ రాసుకొచ్చారు.
ఖుర్షిద్ నివాసం పై దాడిని ఖండిస్తున్నాం….
ఈ ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ స్పందించారు. ‘ఇది అవమానకరం.. అంతర్జాతీయ వేదికలపై భారత్ గర్వపడేలా చేసిన రాజనీతిజ్ఞుడు.. ఎల్లప్పుడూ మితవాద, మధ్యమవాద, సమగ్ర దృష్టిని ఆయన వ్యక్తీకరించారు.. ఇది మన రాజకీయాలలో పెరుగుతున్న అసహనం స్థాయిలను అధికారంలో ఉన్నవారు ఖండించాలి’ అని ఆయన ట్వీట్ చేశారు. మరో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సైతం దీనిని తీవ్రంగా ఖండించారు. ‘సల్మాన్ ఖుర్షీద్ నివాసంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.. ఇటువంటి మూర్ఖులు పుస్తకంలో ఏముందో తెలుసుకోలేరు’ అని అన్నారు. ఖుర్షీద్ ఇంటిపై దాడి వ్యవహారంపై కుమావన్ డీఐజీ నీలేష్ ఆనంద్ వివరణ ఇస్తూ.. ఈ ఘటనలో రాకేశ్ కపిల్ అనే వ్యక్తి సహా 20 మందిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అయోధ్యపై సల్మాన్ ఖుర్షీద్ రాసిన “సన్ రైజ్ ఓవర్ అయోధ్య: నేషన్ హుడ్ ఇన్ అవర్ టైమ్స్” పుస్తకంపై వివాదం మొదలైంది. ఈ పుస్తకంలో “ప్రస్తుతం ఉన్న హిందుత్వకు గతంలో ఉన్న హిందుత్వకు చాలా తేడా ఉందన్నారు” సల్మాన్ ఖుర్షీద్.
ఇవీ వివాదాస్పద వ్యాఖ్యలు
ఐసీస్, బోకో హరామ్ వంటి ఇస్లామిక్ జిహాదీ గ్రూపులకు.. ఇప్పటి హిందుత్వకు తేడా లేదని సల్మాన్ ఖుర్షీద్ తన పుస్తకంలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలే వివాదానికి దారి తీశాయి. సల్మాన్ ఖుర్షీద్ పుస్తకంపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పుస్తకం దేశంలో మతపరమైన విశ్వాసాలను దెబ్బతీస్తోందని మండిపపడ్డారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సల్మాన్ ఖుర్షీద్‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వచ్చే ఏడాది జరగనున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా అయోధ్యపై సల్మాన్ ఖుర్షీద్ రాసిన పుస్తకాన్ని నిషేధించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. అయితే అయోధ్యపై తన పుస్తకాన్ని మరోసారి సమర్ధించారు సల్మాన్ ఖుర్షీద్. తాజా పరిస్థితులనే తన పుస్తకంలో ప్రస్తావించినట్టు స్పష్టం చేశారు.
అసలైన హిందూయిజాన్ని కాపాడుకోవాలి
‘‘రుషులు, సన్యాసులు ప్రబోధించిన సంప్రదాయ హిందూయిజాన్ని, హిందుత్వకు చెందిన బలిష్ఠమైన వెర్షన్ పక్కకు నెట్టేసింది. ఇది ఐసీస్, బోకో హరామ్ వంటి జిహాదిస్ట్ ఇస్లాం గ్రూపులను పోలిన ప్రామాణిక రాజకీయ రూపమే తప్ప మరొకటి కాదు’’ అని నా తాజా పుస్తకంలో రాసిన వాక్యం నా ఇంటిపైకి హిందుత్వ శక్తుల దాడి వరకు తీసుకొచ్చింది. చాలాకాలంగా హిందుత్వ శక్తులకు మనల్ని పక్కకు నెట్టేసే స్వాతంత్య్రం ఇస్తూ వచ్చాం. సత్యంపై వారికే గుత్తాధిపత్యం ఉందనే భావన కలిగించాం. ఇప్పటికైనా మనం స్పష్టమైన వైఖరిని తీసుకోవాలి. మానవత్వాన్ని తోసిపుచ్చి, రెండు ముఖ్యమైన మతాల మధ్య శాశ్వత విభజనను కోరుకుంటున్న శక్తుల నుంచి మనం అసలైన హిందూయిజాన్ని కాపాడుకోవాలి’’ అని సల్మాన్ ఖుర్షీద్ పేర్కొన్నారు.
ఒక్క వాక్యంపైనే విరుచుకుపడ్డారు
‘‘నా తాజా పుస్తకం ‘సన్‌రైజ్ ఓవర్ అయోధ్య: నేషన్‌హుడ్ ఇన్ అవర్ టైమ్స్’ 300 పేజీలతో రూపొందింది. అయోధ్యపై తీర్పులో న్యాయపరమైన ఔచిత్యంపై నా సహ న్యాయవాదులు చాలామంది సందేహం వ్యక్తపరుస్తున్నప్పటికీ, నా ఈ పుస్తకంలో ఆ తీర్పును బలపర్చడానికే ప్రయత్నించాను. హిందూయిజం తాత్వికతను గుర్తించడమే కాకుండా ప్రశంసిస్తూ వచ్చాను. సనాతన ధర్మానికి సంబంధించిన మానవీయ కోణాలను ఎత్తి చూపాను. హిందువులు, ముస్లింల మధ్య మత సామరస్యాన్ని ప్రోత్సహించడం, విచారకరమైన గతాన్ని మూసివేసి పరస్పర భాగస్వామ్యంతో కూడిన భవిష్యత్తుకు ఒక మంచి అవకాశంగా అయోధ్య తీర్పును ఎత్తిపట్టడమే నా తాజా పుస్తకం లక్ష్యం. విచారకరంగా, నా ఈ ప్రయత్నాన్ని జాతీయ మీడియా కానీ, అధికార పార్టీ సభ్యులు కానీ గమనించకపోగా, నా పుస్తకంలోని 6వ అధ్యాయంలో హిందూయిజానికి, హిందుత్వకు మధ్య వ్యత్యాసం గురించి పేర్కొన్న ఒక వాక్యంపై విరుచుకుపడ్డారు. అదేమిటంటే ‘రుషులు, సన్యాసులు ప్రబోధించిన సాంప్రదాయ హిందూయిజాన్ని హిందుత్వకు చెందిన బలిష్టమైన వెర్షన్ పక్కకు నెట్టేసింది.ఇది ఐసీస్, బోకో హరామ్ వంటి జిహాదిస్ట్ ఇస్లాం గ్రూపులను పోలిన రాజకీయ రూపమే’’ అని అన్నారు.
సారూప్యలక్షణాలనే చెప్పాను….
‘‘హిందుత్వ స్వభావాన్ని ప్రశ్నించడం, అంతకు మించి దాన్ని బోకో హరామ్, ఐసిస్‌తో పోల్చి వర్ణించడం వల్ల నా పుస్తకంపై ఇంత ఆగ్రహం ప్రదర్శించినట్లు కనిపిస్తోంది. అయితే ఈ సంస్థల మధ్య ఉన్న సారూప్య లక్షణాలను చెప్పడానికే ఆ వాక్యాన్ని వాడాను తప్ప ఇవన్నీ సమానమని నేను పేర్కొనలేదు. మతాన్ని వక్రీకరిస్తూ, మానవత్వాన్ని గాయపర్చే ఒక అపక్రమ రూపానికి ఇవి సాధారణ నమూనాలు అని మాత్రమే చెప్పానని నేను ఇచ్చిన వివరణను ఎవరూ పట్టించుకోలేదు అన్నారు సల్మాన్ ఖుర్షీద్. ఒక గొప్ప మతాన్ని రాజకీయంగా దుర్వినియోగపరుస్తుండటాన్ని నేను ఆమోదించడం లేదు. అందుకే కాబోలు.. శంకరాచార్య పట్ల నా ఆరాధనా భావం, సనాతన ధర్మపై నా ప్రశంస, అయోధ్య తీర్పును నేను ఎత్తిపడుతూ అందరూ సమన్వయంతో సర్దుబాటు కావాలనీ, రాముడు... ఇమామ్ ఇ హింద్ పాత్ర పోషించాలనీ నేను చెప్పిన మాటలన్నీ వృథా అయిపోయాయి. ఆసక్తికరంగా, నా సీనియర్ సహచరుడు గులామ్ నబి అజాద్ ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశారు’’ అన్నారు సల్మాన్.
రాజకీయ నాయకులను వివాదాలు ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. వారు మౌఖికంగానో, రాతల ద్వారా చేసే వ్యాఖ్యలే ఇందుకు కారణమవుతుంటాయి. ముఖ్యంగా ఆ వ్యాఖ్యలు ఏదైనా మతానికి సంబంధించినవి అయితే, ఆ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి వేరే మతానికి చెందిన నాయకుడైతే వెంటనే అగ్గి రగులుకుంటుంది. భౌతిక దాడులు జరుగుతాయి. హింస ప్రజ్వరిల్లుతుంది. కోర్టు కేసులు కూడా నమోదవుతాయి. మీడియాలో ఇది పెద్ద చర్చనీయాంశమవుతోంది. సామాజిక మాధ్యమాల్లో వివాదానికి ఆజ్యం పోసే పోస్టులు వెల్లువెత్తుతుంటాయి. ప్రధానంగా మన దేశంలో ఇలాంటి వివాదాలు తరచుగా తెరమీదికి వస్తుంటాయి. ప్రస్తుతం అలాంటి వివాదం దేశంలో నడుస్తోంది.