6tvnews

collapse
...
Home / లైఫ్ స్టైల్ / కళలు & సంస్కృతి / వన్నె తగ్గని ఆభరణం పుస్తకం

వన్నె తగ్గని ఆభరణం పుస్తకం

2021-12-29  Lifestyle Desk

book fair 2
 

అక్షరానికి అర్ధం క్షయం కానిది అంటే చావు లేనిది అని పెద్దలు చెబుతుంటారు. హైదరాబాద్ పుస్తక ప్రదర్శన చూసి నప్పుడు ఎవరికైనా ఇదే అభిప్రాయం కలుగుతుంది. అక్షరం అంటే పుస్తకం. దానికి మరణం లేదని నిరూపించింది హైదరాబాద్ బుక్ ఫెయిర్. ఇప్పటి తరంలో చదివే అలవాటు తగ్గిపోయిందనే విమర్శ తరచూ వింటూ ఉంటాం. కానీ ఇది నిజం కాదని పుస్తక ప్రదర్శన నిరూపించింది. పుస్తక ప్రదర్శనలో యువత ఎక్కువగా ఉండటం ఆశ్చర్యం కలిగించింది. కరోనా కారణంగా హైదరాబాదులో పుస్తకాల పండుగ లేక రెండేళ్లు కావడంతో ఈ ఏడాది జరిగిన పుస్తక ప్రదర్శనకు పుస్తక ప్రియులు పోటెత్తారనే చెప్పాలి.

ఈనాటి యువతరం ప్రత్యేకంగా పుస్తకాల షాపులకు వెళ్లి పుస్తకాలు కొనడం తగ్గి ఉండొచ్చు. ఎందుకంటే టెక్నాలజీ కారణంగా ఇప్పుడు చదువుకోవడానికి అనేక సాధనాలు అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి ఏదైనా చదువుకోవాలను కుంటున్నవారు ఆన్ లైన్ లో చదువుకుంటున్నారు. కానీ ఇలాంటి పుస్తక ప్రదర్శనలు నిర్వహించినప్పుడు మాత్రం యువతీ యువకులు ప్రధానంగా కాలేజీ విద్యార్థులు ఎక్కువమంది వస్తున్నారు. వీరంతా పుస్తకాల పురుగులు కాక పోవొచ్చు.

కానీ తమ స్నేహితుల్లోనో, బంధువుల్లోనో పుస్తకాల పురుగులు ఉంటే అలాంటి వారికి పుస్తకాలు కొని బహుమతులుగా ఇస్తున్నారు. అలాంటివారు పుస్తక ప్రదర్శనలో చాలా మంది కనిపించారు. అలాగే పుస్తక ప్రదర్శనకు రాలేని  తమ తాతయ్యల కోసం, బామ్మల కోసం, ఇతర పెద్దలకు, విదేశాల్లో ఉండే తమవారి కోసం, ఆత్మీయుల కోసం పుస్తకాలు కొనడానికి బుక్ ఫెయిర్ కు చాలామంది వచ్చారు. 34 వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఈ నెల 17 న ప్రారంభమైంది. ఈ నెల 28 న ముగిసింది. మొత్తం పదకొండు రోజులపాటు దీన్ని నిర్వహించారు.

ప్రతి ఏటా 320 స్టాళ్లతో బుక్ ఫెయిర్ నిర్వహించేవారు. కానీ ఈ ఏడాది ఓమైక్రాన్ ముప్పు వాటిల్లడంతో ప్రభుత్వ నిబం ధనల ప్రకారం 250 స్టాళ్లు మాత్రమే పెట్టారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ప్రచురణకర్తలు తమ స్టాళ్లు ఏర్పాటు చేశా రు. కొందరు రచయితలు సొంతంగా కూడా స్టాళ్లు ఏర్పాటు చేసుకున్నారు. సాధారణ పుస్తకాల స్టాల్స్ మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక పుస్తకాల స్టాల్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈ స్టాల్స్ కూడా యువతలో ఆసక్తి రేపుతున్నాయి. మీడియా (పత్రికలు, టెలివిజన్ చానళ్లు) కారణంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, ప్రవచన కర్తలకు ఆదరణ బాగా పెరిగింది.

టీవీలో ప్రవచనకర్తలు చెబుతున్న ప్రవచనాలను చాలా ప్రచురణ సంస్థలు పుస్తకాలుగా తెస్తున్నాయి. ఇలాంటి స్టాల్స్ కూడా బాగా ఆదరణ పొందుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. హిందూయిజానికి సంబంధించిన కొన్ని సంస్థలు ఇలాంటి స్టాల్స్ నిర్వహిస్తున్నాయి. వీటిల్లో సామవేదం షణ్ముఖశర్మ, చాగంటి కోటేశ్వరరావు పుస్తకాలు ఎక్కువగా అమ్ముడు పోతున్నాయి. అలాగే మహాభారతం, రామాయణం, అష్టాదశ పురాణాలు మొదలైన పుస్తకాలకు కూడా బాగా డిమాండు ఉంది. విద్యార్థులు, యువత వీటిని చదివి అర్ధం చేసుకోవడానికి వీలుగా సులభవచనంలో కూడా వీటిని ప్రచురించారు.

తెలుగు చదివి అర్ధం చేసుకోలేనివారికోసం ఇంగ్లిష్ లో కూడా ఇవి లభ్యమవుతున్నాయి. చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా కొన్ని స్టాల్స్ పుస్తక ప్రదర్శనలో ఉన్నాయి. ఇక్కడ కామిక్ బుక్స్, కథల పుస్తకాలు, పజిల్స్, ఆట వస్తువులు, పిల్లలకు విజ్ఞానాన్ని అందించే రకరకాల పుస్తకాలు, పరికరాలు ఈ స్టాల్స్ లో లభ్యమవుతున్నాయి. కొన్ని సంస్థలు దేశభక్తి పుస్తకాలు విక్రయించే స్టాల్స్ పెట్టాయి. వీటిల్లో భారత స్వాతంత్ర్య పోరాటాన్ని వివరించే పుస్తకాలు, జాతీయ నాయకుల జీవిత చరిత్రలు అమ్ముతున్నారు. వీటితోపాటు జాతీయ నాయకుల ఫోటోలు కూడా లభ్యమవుతున్నాయి.

తెలంగాణా సాహిత్య అకాడమీ, నేషనల్ బుక్ ట్రస్ట్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని తెలంగాణా జాగృతి స్టాల్ కూడా ఉంది. ఇక పార్లమెంటు సభ్యుడు, తెలంగాణలో పచ్చదనం కోసం కృషి చేస్తూ గ్రీన్ ఇండియా సంస్థను ఏర్పాటు చేసిన జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్ కూడా ఉంది. ఇందులో పలు రకాల మొక్కలు అమ్మడంతోపాటు మొక్కల పెంపకానికి సంబంధించిన పుస్తకాలు విక్రయిస్తున్నారు.

పుస్తక ప్రదర్శనలో ఈ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చు. పచ్చదనం పెంపునకు ప్రభుత్వం నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమం వల్ల, దానిపై ప్రభుత్వం చేస్తున్న ప్రచారం వల్ల ప్రజల్లో గ్రీనరీ పట్ల బాగా అవగాహన పెరిగింది. అందుకే ఈ స్టాల్ బాగా ఆకర్షిస్తోంది. ప్రధాన, పెరిన్నికగన్న ప్రచురణ సంస్థలు నవోదయ, నవచేతన, ప్రజాశక్తి, నవ తెలంగాణా, జైకొ, ఆనంద్ బుక్స్, గోదావరి ప్రచురణలు ....ఇలాంటి అనేక సంస్థలు పుస్తక ప్రదర్శనలో స్టాల్స్ ఏర్పాటు చేశాయి. ముస్లిం, క్రైస్తవ సంస్థలు కూడా వారి ప్రచురణల విక్రయం కోసం స్టాల్స్ ఏర్పాటు చేశాయి. ఇస్లాం తెలుగు ప్రచురణల స్టాల్, ఉర్దూ, ఇంగ్లిష్ ప్రచురణల స్టాల్స్ వేరువేరుగా ఉన్నాయి.

 నేషనల్ హ్యాండ్ రైటింగ్ అకాడమీ వారు స్టాల్ ఏర్పాటు చేశారు. దీని నిర్వాహకుడు మల్లికార్జున రావు మాట్లాడుతూ హ్యాండ్ రైటింగ్ లో తాము విద్యార్థులకు శిక్షణ ఇస్తామని చెప్పారు. విద్యార్థులు పరీక్షలు బాగా రాయడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుందని అన్నారు. హ్యాండ్ రైటింగ్ బాగుంటే పరీక్షల్లో ఎక్కువ మార్కులు పొందవచ్చని అన్నారు. ఈ స్టాల్ లో రకరకాల పెన్నులు కూడా విక్రయిస్తున్నారు. శిక్షణ పొందాలనే ఆసక్తి ఉన్నవారి పేర్లు నమోదు చేసుకుంటున్నారు.

పుస్తక ప్రదర్శనలో మరో ఆకర్షణీయమైన స్టాల్ వికీపీడియా తెలుగు స్టాల్. వికీపీడియా గురించి అందరికీ తెలిసిందే. దాని కోసం స్టాల్ ఏమిటని అడిగినప్పుడు తెలుగు వికీపీడియాలో ఏదైనా రాయాలనుకున్నప్పుడు చాలామందికి తెలియదని, దాని కోసం తాము ఆన్ లైన్ లో ఉచితంగా శిక్షణ ఇస్తామని నిర్వాహకులు తెలిపారు. జనవరి మూడో తేదీ నుంచి తర గతులు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి ఉన్నవారి పేర్లు నమోదు చేసుకుంటున్నారు. ఈ బుక్ ఫెయిర్ లో పాత ఇంగ్లిష్ పుస్తకాలు అంటే బయట మార్కెట్ లో దొరకని పుస్తకాలు కూడా అమ్ముతున్నారు. అలాంటి కొన్ని స్టాల్స్ ఉన్నాయి. అక్కడ ఏ పుస్తకమైనా పది, ఇరవై, యాభై, వంద రూపాయలకు విక్రయిస్తున్నారు.

నవలలు సహా అన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి. నక్షత్ర మ్యూజిక్ అనే సంగీతానికి సంబంధించిన స్టాల్ కూడా ఉంది. ఇక్కడ శాస్త్రీయ (కర్ణాటక, హిందూస్థానీ) సంగీతానికి సంబంధించిన, సినిమా సంగీతానికి సంబంధించిన సీడీలు, డీవీడీ లు, వీడియోలు, పెన్ డ్రైవ్ లు విక్రయిస్తున్నారు. కేవలం ఆంగ్ల పుస్తకాలు అమ్మే స్టాల్స్ కూడా ప్రత్యేకంగా ఉన్నాయి. అలాగే హిందీ పుస్తకాలు అమ్మే స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇక తెలుగు, ఆంగ్ల దినపత్రికల వారు కూడా స్టాల్స్ పెట్టారు. వీటిల్లో ప్రచురణలు ఏమీలేవు. కేవలం వారి పేపర్లు మాత్రమే ఉన్నాయి.

  పుస్తక ప్రదర్శనలో ప్రతిరోజూ కొన్ని పుస్తకాలను ఆవిష్కరిస్తారు. వాటి గురించి పుస్తకాల రచయితలు, ప్రముఖులు మాట్లాడారు. నిర్దిష్టంగా కొన్ని పుస్తకాలు కొనుగోలు చేయాలని వచ్చినవారికి నిరాశ ఎదురైంది. అనుకున్న పుస్తకాలు కొన్ని స్టాల్స్ లో లేవు. అంటే అవుటాఫ్ ప్రింట్ అన్న మాట. కొన్ని అయిపోయాయి.

వచ్చినవారిలో చాలామంది స్టాల్స్ లో నిర్వాహకుల విజిటింగ్ కార్డులు, కేటలాగులు తీసుకున్నారు. ఏ పుస్తకాలు కావా లో  తెలియచేస్తే  పోస్టులో పంపుతామన్నారు. కొందరు పుస్తకప్రియులు జనవరి ఒకటో తేదీ నుంచి విజయవాడలో మొదలయ్యే పుస్తక ప్రదర్శనకు వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీన్నిబట్టి పుస్తకాలను ప్రేమించేవారు ఈ తరంలోనూ ఉన్నారని అర్ధమవుతోంది. పుస్తకాల రేట్లు పెరిగాయని కొందరన్నారు. అన్ని రేట్లు పెరిగినప్పుడు పుస్తకాల రేట్లు పెరగడం సహజమేనని కొందరు నిర్వాహకులు చెప్పారు. పుస్తక ప్రదర్శన నిర్వహణ బాగుందని ఎక్కువమంది మెచ్చుకున్నారు. పదిహేను రోజులైనా నిర్వహిస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయపడ్డారు. 


2021-12-29  Lifestyle Desk