6tvnews

collapse
...
Home / అంతర్జాతీయం / కజకిస్థాన్ ఎందుకు రగిలిపోతోంది ?

కజకిస్థాన్ ఎందుకు రగిలిపోతోంది ?

2022-01-10  News Desk

kazak violence
మధ్య ఆసియా దేశమైన కజకిస్థాన్ అల్లర్లతో అట్టుడికిపోతోంది. సుమారు  15 రోజులుగా ఆందోళనకారులు రాజధాని అల్మాటీ వీధుల్లో చెలరేగిపోతున్నారు. ప్రభుత్వ భవనాలకు అగ్గిపెడుతూ విధ్వంస రచన చేస్తున్నారు. మంటల్లో కాలిపోతున్న ప్రభుత్వ , పోలీసు వాహనాలకు లెక్కే లేకుండా పోతోంది. సాధారణ జనజీవనం అస్తవ్యస్థమైంది. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టకుని బ్రతుకుతున్నారు. ఇప్పటి వరకు సాగిన హింసలో  164 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కజక్ స్థాన్ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. వీరిలో అల్మాటీకి చెందిన వారే  103 మంది కావడం గమనార్హం. డజన్ల కొద్దీ భద్రతా బలగాలు కూడా ఈ హింసలో అమరులయ్యారని తెలిపింది. మరోవైపు దేశ వ్యాప్తంగా  5800 మంది నిరసనకారులను నిర్బంధంలోకి తీసుకున్నారు. అల్లర్లను అదుపు చేసేందుకు రష్యా సైన్యం కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది. అయితే ఆ దేశ బలగాలు దేశంలో శాంతిపునరుద్ధరణ తర్వాత తిరిగి స్వదేశం పయనమవుతాయని కజక్ అధ్యక్షుడు కస్సీం జోమార్ట్ టొకయెవ్ వెల్లడించారు. దేశంలో ఇంకా ఎక్కడైనా అశాంతి చెలరేగినట్లు కనిపిస్తే కాల్చివేత ఆదేశాలను జారీ చేసినట్లు చెప్పారు. మరోవైపు కజకిస్థాన్ లో విదేశీయులు సహా దాదాపు  6 వేల మంది చిక్కుకుపోయారు. నిరసనకారులు ఆక్రమించుకున్న పలు పరిపాలన భవనాలను బలగాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. వారం రోజుల క్రితం ఆందోళనకారుల అదుపులో ఉన్న అల్మాటీ అంతర్జాతీయ విమానశ్రయం కూడా తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. సోమవారం నుంచి విమానశ్రయంలో రాకపోకలు పునరుద్ధరించనున్నారు.  

వాళ్లు ఉగ్రవాదులు , అణిచివేస్తాం : అధ్యక్షుడు 

నిరసనకారులను అధ్యక్షుడు టొకొయెవ్ బండిట్లు(ఉగ్రవాదులు)గా అభివర్ణించారు. అలాంటి వాళ్లను ఎలాంటి పరిస్థితుల్లో విడిచిపెట్టబోమని శపథం చేశారు. ‘ఉగ్రవాదులు ఆస్తుల విధ్వంసానికి పాల్పడుతున్నారు. సామాన్య పౌరులకు వ్యతిరేకంగా ఆయుధాలను ఉపయోగిస్తున్నారు. పౌరుల భద్రత కోసం ఎలాంటి హెచ్చరిక లేకుండా ఉగ్రవాదులను కాల్చి చంపాలని ఆదేశాలు జారీ చేశాను’ అని ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.  

అసలు హింసకు దారితీసిన కారణాలేంటీ.. ? 

ప్రశాంతంగా ఉన్న కజకిస్థాన్ లో అనూహ్యంగా ఆందోళనలు మిన్నంటడం , అవి హింసాత్మక ఘటనలకు దారి తీయడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇటీవల కజక్ ప్రభుత్వం ఇంధన ధరలను రెండింతలు చేసింది. వాహనాల్లో నిత్యం ఉపయోగించే ఎల్పీజీ ధరలపై నియంత్రణ ఎత్తివేసింది. ఈ నిర్ణయమే కజకిస్థాన్ లో జాతీయ సంక్షోభానికి దారి తీసింది. ఆందోళనలకు తక్షణ కారణం చమురు ధరల పెంపుదలే అయినప్పటికీ దేశంలో పెరిగిపోతున్న నిత్యవసరాల ధరలు , ఆదాయ అసమానతలు , దానికి తోడు కరోనా మహమ్మారి కారణంగా జీవనస్థితిగతుల్లో విపరీతమైన మార్పు , కొద్ది సంవత్సరాలుగా దేశంలోని పలు అంతర్గత అంశాలకు సంబంధించి ప్రజల్లో గూడుకట్టుకున్న ఆవేదన నిరసనలకు మరింత ఆజ్యం పోసిందని పరిశీలకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం లేకపోవడం కూడా మరో కారణంగా చెబుతున్నారు.  

చైనా మద్దతు ఎవరికి.. ? 

కజకిస్థాన్ ఒకప్పుడు రష్యా డామినేషన్ లోని సోవియెట్ దేశం. ఇక్కడ మాస్కో ప్రభావం సహజంగా ఉంటుంది. ప్రస్తుత అశాంతియుత పరిస్థితుల్లో కజకిస్థాన్ , రష్యా సాయం కోరడంతో అధ్యక్షుడు పుతిన్ తమ బలగాలను రంగంలోకి దింపారు.  2500 మంది సైనికులు కజకిస్థాన్ లో దిగాయి. దీనికి అధ్యక్షుడు టొకయెవ్ ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు తాజా పరిణామాలపై పొరుగుదేశం చైనా ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు టొకయెవ్ కు సంపూర్ణ మద్దతు ఉంటుందని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రకటించారు. కజకిస్థాన్ ను అస్థిర పరిచే కుట్రను వ్యతిరేకిస్తామన్నారు. అల్లర్లను అణచివేయడానికి టొకయెవ్ నిర్ణయాత్మక చర్యలను ప్రశంసించారు. 


2022-01-10  News Desk