6tvnews

collapse
...
Home / ఆంధ్రప్రదేశ్ / వైజాగ్ / Corona: పండుగ స‌మ‌యంలో జాగ్ర‌త్త‌

Corona: పండుగ స‌మ‌యంలో జాగ్ర‌త్త‌

2022-01-14  News Desk

sankranthi rush
 

కొవిడ్ మ‌హ‌మ్మారి ఇంత‌కుముందెన్న‌డూ లేనంత వేగంతో వ్యాప్తి చెందుతోంద‌ని, కొత్త‌గా వ‌చ్చిన ఒమైక్రాన్ వేరియంటే ఇందుకు ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని విశాఖ‌ప‌ట్నంలోని కిమ్స్ ఐకాన్ ఆసుప‌త్రికి చెందిన ఇంట‌ర్నల్ మెడిసిన్ వైద్య‌నిపుణులు డాక్ట‌ర్ ఆర్‌.వి. ర‌వి క‌న్న‌బాబు తెలిపారు. ఒమైక్రాన్ వ్యాప్తి నేప‌థ్యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇది అత్యంత సుల‌భంగా మ‌నిషి నుంచి మ‌నిషికి వ్యాపిస్తుంద‌ని, అందువ‌ల్ల ముఖానికి, ముక్కుకు బాగా ప‌ట్టి ఉండే మాస్కులు ధ‌రించ‌డం, వాటిని ఎప్పుడూ తీయ‌క‌పోవ‌డం, భౌతిక‌దూరం త‌ప్ప‌నిస‌రిగా పాటించ‌డం లాంటి నియ‌మాలు  ప్ర‌తి ఒక్క‌రూ పాటించాల‌ని సూచించారు. చాలామంది మాస్కులు పెట్టుకుంటున్నా, వాటిని ముక్కుకింద‌కు జారుస్తున్నార‌ని, దానివ‌ల్ల ఉప‌యోగం లేద‌ని ఆయ‌న అన్నారు. ఎన్95 మాస్కులే అవ‌స‌రం లేద‌ని, ఎలాంటిదైనా బాగా ప‌ట్టి ఉంచేలా చూసుకోవాల‌ని ఆయ‌న తెలిపారు. కొవిడ్ మూడోద‌శ‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అత్యంత ఎక్కువ కేసులు న‌మోద‌వుతున్న ప్రాంతాల్లో విశాఖ‌ప‌ట్నం ఒక‌ట‌ని, పండుగ త‌ర్వాత కేసుల సంఖ్య మ‌రింత పెరిగే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించారు. ఇప్ప‌టికే వ్యాప్తి మొద‌లైంద‌ని, అందువ‌ల్ల సంక్రాంతికి ఊళ్లు వెళ్ల‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని సూచించారు. త‌ప్ప‌నిస‌రిగా వెళ్లాల్సి వ‌చ్చినా ఎక్క‌డా మాస్కు తీయ‌కూడ‌ద‌ని, వేరే ఇంటికి వెళ్లి, మాట్లాడేట‌ప్పుడు మాస్కు తీసినా కొవిడ్ వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని అన్నారు.

ప్ర‌తి నాలుగు కేసుల్లో ఒక‌టి ఒమైక్రాన్ 

వ‌స్తున్న ప్ర‌తి నాలుగు కేసుల్లో ఒక‌టి ఒమైక్రాన్ అవుతోంద‌ని, కొన్ని డెల్టా కేసులూ ఉంటున్నాయ‌ని ఆయ‌న చెప్పారు. అయితే స‌మీప భ‌విష్య‌త్తులో ఒమైక్రాన్ కేసులు భారీగా న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌న్నారు. సెకండ్ వేవ్‌లో ఉన్నంత‌గా ఆసుప‌త్రిలో ప్ర‌వేశాలు ఇప్ప‌టికి లేవ‌ని, కానీ ఇంకా విశాఖ ప్రాంతంలో మొద‌ట్లోనే ఉంద‌ని అన్నారు. గొంతులో గ‌ర‌గ‌ర‌లు, జ‌లుబు, ద‌గ్గు, కొద్దిపాటి జ్వ‌రం, నీరం, త‌ల‌నొప్పి, ఒళ్లు నొప్పుల లాంటి ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని చెప్పారు. కొంత‌మంది ఇంటివ‌ద్దే ప‌రీక్ష‌లు చేయించుకుంటున్నార‌ని, వాటిలోనూ పాజిటివ్‌లు బ‌య‌ట‌ప‌డుతున్నాయ‌ని చెప్పారు. కొవిడ్ ల‌క్ష‌ణాల్లో ఏ ఒక్క‌టి క‌నిపించినా వెంట‌నే ప‌రీక్ష చేయించుకోవాల‌ని డాక్ట‌ర్ ర‌వి క‌న్న‌బాబు సూచించారు.

ఒక‌వేళ పాజిటివ్ అని తెలిస్తే వైద్యులు సూచించిన మందులు వాడ‌టంతో పాటు త‌గిన‌న్ని నీరు తీసుకోవ‌డం, విశ్రాంతిగా ఉండ‌టం, పోష‌కాహారం తీసుకోవ‌డంతో పాటు ఎప్ప‌టిక‌ప్పుడు ఆక్సిజ‌న్ శాచ్యురేష‌న్ త‌ప్ప‌నిస‌రిగా చూసుకోవాల‌ని, అందులో ఏదైనా మార్పు క‌నిపిస్తే వెంట‌నే వైద్యసాయం పొందాల‌ని ఆయ‌న తెలిపారు.

టీకాలే ముఖ్యం  
కొవిడ్‌లో ఎలాంటి వేరియంట్ వ‌చ్చినా, వ్యాధి తీవ్ర‌త‌రం కాకుండా కాపాడ‌టంలో టీకాల పాత్ర చాలా ముఖ్య‌మ‌ని, అందువ‌ల్ల ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా రెండు డోసుల టీకాలు తీసుకోవాల‌ని డాక్ట‌ర్ ర‌వి క‌న్న‌బాబు చెప్పారు. సాధార‌ణ ఆర్‌టీపీసీఆర్ ప‌రీక్ష‌తోనూ ఒమైక్రాన్‌ను గుర్తించ‌వ‌చ్చ‌ని, మూడు ల‌క్షిత జ‌న్యువుల్లో ఒక‌టైన ఎస్ జ‌న్యువు లేక‌పోతే అది ఒమైక్రాన్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని అన్నారు. టీకాలు తీసుకున్నా, తీసుకోక‌పోయినా ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా భౌతిక దూరం పాటించాల‌ని, బాగా బిగుతుగా ఉండే మాస్కు ధ‌రించాల‌ని, చేతి శుభ్ర‌త పాటించాల‌ని, గ‌దిలో ఉన్నా త‌గినంత గాలి, వెలుతురు త‌గిలేలా చూసుకోవాల‌ని, స‌మూహాల్లోకి వెళ్ల‌కూడ‌ద‌ని డాక్ట‌ర్ ర‌వి క‌న్న‌బాబు ఈ సంద‌ర్భంగా సూచించారు.


2022-01-14  News Desk