6tvnews

collapse
...
Home / ఆంధ్రప్రదేశ్ / తూర్పు గోదావరి / పందెం కోడి: సిక్స్ ప్యాక్ పుంజు గురూ..

పందెం కోడి: సిక్స్ ప్యాక్ పుంజు గురూ..

2022-01-14  News Desk

Fight in ap 1
 

సంక్రాంతి పందెం షురూ.. 
ఏపీలో కోడి పందాలకు సిద్ధమవుతున్న పుంజులు.. 
3.60 లక్షల దాకా పందెం కోడి రేటు.. 
జోరందుకున్న అమ్మకాలు.. 
పోలీసులు వద్దంటున్నా ఆగని కోడి పందాలు

సినిమాల్లో ముష్టి యుద్ధాలు చేసే  హీరో సిక్స్ ప్యాక్ చూపిస్తే పండగ చేసుకుంటాం.. చప్పట్లు, ఈలలతో సందడి చేస్తాం.. అలాంటి సందడి ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సందర్భంగా చోటు చేసుకోబోతోంది. సంక్రాంతి పోటీల్లో భాగం గా పంద్యాల బరిలోకి దిగుతున్న కోళ్లు ఈసారి సిక్స్ ప్యాక్ తో కనువిందు చేస్తున్నాయి.

వివిధ రకాల కోళ్లు…

ప్రభుత్వం నిషేధించినా, పోలీసులు వద్దంటున్నా ఆగని ఈ కోడిపందాల్లో వివిధ రకాల జాతుల కోళ్లను వేల సంఖ్యలో పెంచుతూ ఈ సంక్రాంతికి పోటీలోకి దించేందుకు చాలామంది సన్నద్ధమయ్యారు. ఈ పోటీలను ఆసక్తిగా తిలకించేందుకు వేలాది మంది సిద్ధమవుతున్నారు. ఈ పోటీలో వెనుక ఆసక్తికరమైన అంశాలకు తెర తీస్తే..

నువ్వా..నేనా.. 

అన్న రీతిలో కోడి పుంజులు తలపడడం సంక్రాంతికి కొత్త కాదు. దీనికి సంబంధించి లక్షల్లో పుంజుల ఖరీదు, కోట్లలో లావాదేవీలు ఉంటాయి. ప్రస్తుతం పోటీకి సిద్దమవుతున్న పుంజులు ఆరు నెలలుగా శిక్షణ పొందుతున్నా యంటే అతిశయోక్తి కాదు. కోనసీమ, కాకినాడ, రాజమండ్రి, గుంటూరు తదితర ప్రాంతాల్లో కొబ్బరి తోటలు, గోదాములు, ఫామ్ హౌస్ లలో  ఒక్కోచోట పదుల సంఖ్యలో, మరికొన్ని చోట్ల వందల సంఖ్యలో వీటిని పెంచు తున్నారు. పోటీలకు సంసిద్ధంగా ఉన్న ఒక్కో పుంజును 30 వేల తో మొదలు పెట్టి, 3.60 లక్షల వరకు విక్రయి స్తున్నారు. లక్షల్లో పందేలు కాసి కోట్ల రూపాయలను గడించే వ్యక్తులు వీటిని కొనడానికి ఆసక్తి చూపిస్తు న్నారు.

నేతల చేతలు.. 

కోడి పందేలపై నిషేధం ఉన్న నేపథ్యంలో ఎక్కువశాతం వైసిపి నాయకులు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ పోటీలకు దిగుతున్నట్లు తెలుస్తోంది. కాకినాడ రూరల్ ప్రాంతంలో వైసీపీకి చెందిన ఓ సర్పంచ్ పదెకరాల తన ఫాంహౌస్లో పందెం కోళ్లను పెంచుతున్నారు. జాతి పుంజులను తీసుకువచ్చి ఇక్కడ వాటికి శిక్షణ ఇస్తున్నాడు. పోలీసుల బెడద లేకుండా తన తోటలో ఉన్న కొబ్బరి చెట్లకు వైసిపి రంగులు పూసి నట్లు తెలుస్తోంది. ఇక మరో నేత తనకున్న పాత సభ్యుల పరిశ్రమలో వందల సంఖ్యలో పందెం కోళ్లను పెంచుతున్నట్లు తెలుస్తోంది. ఏడాదిన్నర మొదలుకొని రెండేళ్ల లోపు వయసున్న జాతి పుంజులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని అలాంటి పుంజులను పోటీలకు సిద్ధం చేస్తున్నారు. రోజుకు 50 గ్రాముల మటన్, 15 రకాల ఎండు ఫలాల తో కూడిన ఉండలను కోళ్లకు ఆహారంగా అందిస్తున్నారు. జనాల్లో మరింత ఆసక్తి రేపేందుకు సిక్స్ ప్యాక్  పుంజుల పేరిట కొన్ని పుంజులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దడం విశేషం.

వీడియో లో ప్రచారం.. 

ఈ విడత ప్రత్యేకంగా తమ కోళ్లు పోటీకి ఎలా సంసిద్ధం అవుతున్నాయో చెప్పేందుకు అమ్మకందారులు పందెంరాయుళ్ల కోసం ప్రత్యేకంగా వీడియోలు తయారు చేస్తున్నారు. తాత్కాలికంగా పోటీలను ఏర్పాటు చేసి వీడియోలు తీసి ప్రచారం చేస్తున్నారు. డేగ, నెమలి, కాకి, అబ్రాస్, సేతు, మైల,కొమ్మెరా, రసంగి, పర్ల సవల, ఎరుపు నెమలి వంటి జాతులకు పోటీలో మంచి డిమాండ్ ఉంటుంది. ఇలాంటి జాతి కోళ్లను పోటీలో దించారు. నిబంధనలు ఎన్ని ఉన్నా  పందాల విషయంలో  తగ్గేదే లే.. అంటున్నారు. మరి వీటిని అడ్డుకునే దిశగా పోలీసులు ముందడుగు వేస్తారా.. అందరితో పాటు తాము వేడుక చూస్తారా.. అన్నది చర్చనీయాంశంగా మారింది.


2022-01-14  News Desk