6tvnews

collapse
...
Home / జాతీయం / భారత్ కు వ్యతిరేకంగా పాక్ రేడియో ప్రచారం

భారత్ కు వ్యతిరేకంగా పాక్ రేడియో ప్రచారం

2022-01-14  News Desk

 

Pak Flag-1
 

పాకిస్తాన్...ఇది ఉగ్రవాద సంస్థలకు అడ్డా. నిషేధిత ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న దేశం. ఇది ప్రపంచం మొత్తానికి తెలిసిన బహిరంగ రహస్యం. ఒసామా బిన్ లాడెన్ లాంటి వారికి ఆశ్రయం కల్పించిన దేశం. ముఖ్యంగా భారత దేశంపై అక్కసుతో నిత్యం రగిలి పోతున్న  పాకిస్తాన్, మన దేశంలో జరిగిన అల్లర్లకు, బాంబు దాడులకు బాధ్యులైన వారిని అక్కున చేర్చుకుంటోంది. అందులో భాగంగానే ప్రస్తుతం భారత్ కు వ్యతిరేకంగా ప్రచారాన్ని మొదలు పెట్టింది. ఏర్పాటు వాద, భారత్ నిషేధిత ఉగ్ర సంస్థ సిక్కులు ఫర్ జస్టిస్‌కు(ఎస్.ఎఫ్.జే) సంస్థ కొమ్ము కాస్తూ, తన ఉగ్రబుద్దిని చాటుకుంటోంది.  


పాక్ రేడియో ముమ్మర ప్రచారం…

అందులో భాగంగా ఈ  జనవరి 12న, పాకిస్తాన్ ప్రభుత్వ మౌత్‌పీస్ రేడియో పాకిస్తాన్ మరోసారి భారత వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించింది.  నిషేధిత ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ ఎస్.ఎఫ్.జే  పక్షాన ఈ భారత్ వ్యతిరేక ప్రచారం సాగిస్తోంది. ఎస్.ఎఫ్.జే సంస్థ పరువు తీయడానికి భారత్ ప్రచారం చేస్తోందని రేడియో పాకిస్థాన్ తన వెబ్‌సైట్‌లో పోస్ట్ చేయడం విశేషం. ఇటీవల, భారత ప్రభుత్వం అందించిన ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా, జర్మనీ అధికారులు లుథియానా కోర్టు పేలుడు సంఘటనలో  పాల్గొన్నఎస్.ఎఫ్.జేకు చెందిన ఉగ్రవాది జస్విందర్ సింగ్ ముల్తానీని అరెస్టు చేశారు. మరోవైపు  ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఉగ్రవాదంగా భారత్ చెబుతోందని, అయితే ఆ వాదనను   అమెరికా ప్రభుత్వం తిరస్కరించిందని పాకిస్థాన్ సన్నాయి నొక్కులు నొక్కుతోంది.  మరి కొద్దు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్ లో ఎస్.ఎఫ్.జే సానుభూతి పరులైన  సిక్కులను రెచ్చగొట్టడం ద్వారా ఆ రాష్ట్రంలో అశాంతింతిని రెచ్చ గొట్టడమే ధ్యేయంగా పాకిస్తాన్ రేడియో ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. శత్రువుకు శత్రువులు మనకు మిత్రుడన్నట్లు పాకిస్తాన్ ఎస్.ఎఫ్.జేకు  మధ్దతు నిస్తోంది.  


అమెరికా కేంద్రంగా పని చేస్తున్న ఉగ్ర సంస్థ 

 

ఎస్.ఎఫ్.జే  అనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆధారిత వేర్పాటువాద సంస్థ.  భారతదేశం నుండి పంజాబ్‌ను విడదీసి,  ఖలిస్థాన్‌గా  విభజించాలన్న లక్ష్యంతో  స్థాపించబడింది. న్యాయవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ నేతృ త్వంలో సాగుతోంది. దీనిని చట్టవిరుద్ధమైన సంస్థగా  భారతదేశం నిషేధించింది.  2019 నాటికి అది తన వేర్పాటు వాద ఎజెండాలో భాగంగా ప్రత్యేక ఖలిస్తాన్‌ను రూపొందించడానికి పంజాబ్ స్వాతంత్ర్య ప్రజాభిప్రాయ సేకరణ కోసం ప్రచారం చేస్తోంది. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల నేపథ్యంలో 2013లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై కేసు పెట్టింది. 2014లో అప్పటి 13వ భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పై  మానవ హక్కుల ఉల్లంఘన కేసును దాఖలు చేసింది. అంతేకాదు 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్‌కు నివేదికను కూడా సమర్పించింది. మొత్తానికి పంజాబ్ ను ఖలిస్తాన్ గా భారత్ నుండి విభజించాలనే   డిమాండ్ తో, సందు దొరికితే దేశంలో ముఖ్యంగా పంజాబ్ లో  అల్లర్లు సృష్టించడమే ధ్యేయంగా ఎస్.ఎఫ్.జే ముందుకు సాగుతోం ది.  


మద్ధతు కోసం లేఖలు 

 

 పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ), సిఖ్స్  ఫర్ జస్టిస్ తో సహా ఖలిస్తాన్ గ్రూపులకు నిధులు సమకూరుస్తోందని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ రేడియో చేస్తున్న భారత వ్యతిరేక, సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థ అనుకూల ప్రచారంతో ఆరోపణలకు బలం చేకురుతోంది. గతంలో, సిఖ్స్ ఫర్ జస్టిస్ అధికారికంగా ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలంటూ పాకిస్థాన్ ప్రధానికి పలు సందర్భాల్లో లేఖలు రాశారు. ఇటీవల, గోల్డెన్ టెంపుల్ హత్య కేసుకు కేవలం రెండు రోజుల ముందు, ఎస్ ఎఫ్ జే కు చెందిన  గురుపత్వంత్ సింగ్ పన్నూ పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు ఎస్.ఎఫ్.జే కు, ఖలిస్థాన్ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని లేఖ రాశారు. గత ఏడాది డిసెం బరు 16న పాక్ ప్రధాని ఖాన్‌నుకు రాసిన లేఖలో, తీవ్రవాద సంస్థ ఎస్ ఎఫ్ జే తనను తాను "మానవ హక్కుల న్యాయవాద సమూహం"గా పేర్కొంది.  అంతేకాదు  ‘భారత్ పాలనలో ఉన్న పంజాబ్,  స్వతంత్ర దేశంగా ఉండా లా?’ అనే ప్రశ్నపై  ఎస్ ఎఫ్ జే తన ప్రజాభిప్రాయ సేకరణను  పంజాబ్ లో  మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణకు  మద్దతు ఇవ్వాలని ఆ లేఖలో ఖాన్ ను  కోరడం గమనార్హం. 


భారత్ కు  వ్యతిరేక ప్రచారం 

 

మరోవైపు.. గత కొన్నేళ్లుగా ఎస్.ఎఫ్.జే  వ్యవస్థాపకుడు, ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నాడు. ఎర్రకోటపై ఖలిస్తానీ జెండాను ఎగురవేయాలని సిక్కు యువకులను కోరారు.  గత ఏడాది జనవరి 26 సంఘటనతో అతనికి నేరుగా సంబంధం ఉంది. జనవరి 26న ఎర్రకోటపై పవిత్ర సిక్కు చిహ్నంతో రెండు జెండాలను ఎగురవేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఇటీవల, ఫిరోజ్‌పూర్‌లో ప్రధాని మోదీ కాన్వాయ్‌ను దిగ్బంధించే బాధ్యతను ఎస్.ఎఫ్.జే తీసుకుంది. మరోవైపు..  యూకే నుంచి  ఎస్.ఎఫ్.జే  కార్యకర్తల నుండి తమకు బెదిరింపు కాల్స్ వచ్చాయని, ఈ కేసును పరిశీలించవద్దని సుప్రీంకోర్టును హెచ్చరించినట్లు పలువురు న్యాయ వాదులు ఇటీవల కోర్టుకు నివేదించడం తెలిసిందే. మొత్తానికి భారత్ లో   ఎదో మూల అలజడి రేపడమే ధ్యేయంగా  సాగుతున్న పాకిస్తాన్ కు ఎస్.ఎఫ్.జే రూపరం అవకాశం చిక్కింది. ఉగ్రసంస్థ ఎస్.ఎఫ్.జే కు పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో తన ఏర్పాటు వాదానికి ఛాన్స్ చిక్కింది.మరి ఈ విషయంలో  భారత్ ఎలాంటి స్ట్రాటజీని అవలంబిస్తుందో వేచి చూద్దాం! 


 


2022-01-14  News Desk