collapse
...
Home / చదువు / వందేళ్ల ఘన చరితకు సాక్ష్యంగా ఢిల్లీ యూనివర్సిటీ - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News fo...

వందేళ్ల ఘన చరితకు సాక్ష్యంగా ఢిల్లీ యూనివర్సిటీ

2022-05-03  Education Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

delhi-3

courtesy: FB/Shashi Kant

భారతదేశంలోని 40 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఢిల్లీ యూనివర్సిటీ(DU) ఒకటి. ఈ విద్యా సంవత్సరంలో 70 వేల సీట్లకు నాలుగు లక్షలకు పైగా విద్యార్థులు పోటీపడ్డారంటేనే ఈ యూనివర్సిటీ పాపులారిటీ ఏంటో తెలుసుకోవచ్చు. ఇంతటి ఘన చరిత్ర కలిగి, విద్యార్థుల కలల యూనివర్సిటీగా పరిగణించబడే DU ఇప్పుడు శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమైంది. సరికొత్త స్వేచ్ఛకు నిర్వచనంగా, సహృదయ భావానికి మారుపేరుగా దేశ రాజధానిలో కొలువుదీరిన యూనివర్సిటీ వందేళ్ల చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పలువురు పూర్వ విద్యార్థులు యూనివర్సిటీతో తమకున్న జ్ఞాపకాలను పంచుకున్నారు. 
 
DU చరిత్ర 
ఢిల్లీ విశ్వవిద్యాలయం 1922లో స్థాపించబడింది. అయితే ఇందులోని సౌత్ క్యాంపస్ మాత్రం బ్రిటిష్ ఇండియా లెజిస్లేచర్, సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ చట్టం ద్వారా యూనిటరీ, టీచింగ్ అండ్ రెసిడెన్షియల్ యూనివర్సిటీగా 1973లో ఏర్పాటైంది. యూనివర్సిటీకి సంబంధించిన మూడు అనుబంధ కళాశాలల్లో సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ 1881లో, హిందూ కళాశాల 1899లో ఏర్పాటవగా.. 14 మే 1917న రాంజాస్ కళాశాల స్థాపించబడింది. ఈ మూడు కళాశాలలు గతంలో పంజాబ్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండేవి. ఇక యూనివర్సిటీ విషయానికొస్తే.. ఇప్పుడు కశ్మీర్ గేట్ వద్ద రిట్జ్ సినిమా ఉన్న భవనంలో ప్రారంభమైంది. 1933లో వైస్‌రిగల్ లాడ్జ్‌గా ఉన్న భవనం(గాంధీ-ఇర్విన్ ఒప్పందం ఇక్కడే జరిగింది) విశ్వవిద్యాలయ ఆస్తిలో భాగమైంది. ఈ కలోనియల్ మాన్షన్‌లోనే ఇప్పుడు వైస్-ఛాన్సలర్ కార్యాలయం ఉంది. 
 
భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర. 
భారత స్వాతంత్ర్య ఉద్యమంలో DU ముఖ్యమైన పాత్ర పోషించింది. భారతదేశ చరిత్రలో అనేక మైలురాళ్లుగా నిలిచిన క్షణాలకు సాక్షిగా నిలిచింది. వైస్రెగల్ లాడ్జ్(కలోనియల్ మాన్షన్) 1902లో నిర్మించబడినప్పటికీ, 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు సమయంలో బ్రిటీష్ అధికారులు ఇదే ప్రదేశంలో దాక్కున్నట్లు చరిత్ర చెబుతోంది. 1929 ఏప్రిల్ 8 నాటి సెంట్రల్ అసెంబ్లీ బాంబు దాడుల తర్వాత నిర్భంధించబడిన భగత్ సింగ్‌ను వైస్‌రిగల్ లాడ్జి కింద ఉన్న చెరసాల వంటి గదిలోనే విచారించినట్లు తెలుస్తోంది. ఇక విప్లవకారుడు చంద్రశేఖర్ ఆజాద్ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదురుతిరిగినపుడు రాంజాస్ కాలేజీ విద్యార్థులే ఆయనను దాచిపెట్టారు. హిందూ కళాశాల విద్యార్థులు 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.
 
కాఫీ, బర్గర్‌లు.. కాలేజీ రొమాన్స్ 
పూర్వ విద్యార్థి, సుప్రసిద్ధ రాజకీయ వ్యాఖ్యాత మరియు మాజీ ఎంపీ అయిన స్వపన్ దాస్‌గుప్తా.. DU క్యాంపస్ కొన్ని అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో సమానంగా ఉందని పేర్కొన్నారు. ఆయన 1975లో విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడయ్యాడు. చాలా మందికి తమ జీవితంలో ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్‌లోనే అత్యంత ఫ్రీడమ్ దొరికిందని చెప్తుంటారు. ఇక మిరాండా హౌస్, ఇంద్రప్రస్థ కళాశాల సమీపంలోని కాఫీ షాపులు కాలేజీ రొమాన్స్‌కు కేంద్రంగా ఉండేవని.. బర్గర్లు 50 పైసలు, ఒక మసాలా దోసె ఒక్క రూపాయి ఉండేదని మ్యూజిక్ కంపోజర్ రామ్ చెప్పారు. కాగా కాలేజ్ ఫెస్టివల్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఢిల్లీ విశ్వవిద్యాలయం.. వివిధ క్యాంపస్‌లలో ఏడాదికి 10కి పైగా ఉత్సవాలను నిర్వహిస్తుంది. ఇక DUలో చదివిన శశి థరూర్, అరుణ్ జైట్లీ, షారుఖ్ ఖాన్ వంటివారు ప్రస్తుతం సినీ రాజకీయ రంగాల్లో రాణిస్తున్నారు.
 
ఖ్యాతి గాంచిన విశ్వ విద్యాలయం : 
ఢిల్లీ యూనివర్సిటీ స్వంత చార్టర్ కలిగి ఉంది. దీన్ని అప్పటి వైస్ ఛాన్సలర్(1938-1950) మారిస్ గ్వైర్ రాశారు. ఈయన 1937 నుంచి 1943 వరకు భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా కూడా ఉన్నారు. 1948లో మిరాండా హౌస్‌ను స్థాపించిన ఘనత కూడా ఆయనకే దక్కింది. 1973లో సౌత్ క్యాంపస్ ఏర్పాటైన తర్వాత, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన కొన్ని అసాధారణమైన లైఫ్ సైన్సెస్ పరిశోధనలకు DU కేంద్రంగా మారింది. ‘హెచ్‌ఐవీ’ నిర్ధారణకు విశ్వసనీయమైన, చౌక ధరలో పరీక్షతో పాటు గ్లోబల్ ప్రయత్నాల్లో భాగంగా బియ్యం జీనోమ్ సీక్వెన్సింగ్ వంటివి సౌత్ క్యాంపస్‌లోని డిపార్ట్‌మెంట్లు చేసిన ప్రయత్నాలే. ఇప్పుడు DU కళాశాలలు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF)’లో స్థిరంగా అగ్రస్థానంలో ఉన్నాయి. 
 
విద్యార్థి రాజకీయాలు 
జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) వలె రాజకీయ అంశాల వైపు మొగ్గు చూపనప్పటికీ, DU రాజకీయ సమీకరణల్లో కొంత వాటా కలిగివుంది. 1970, 1975 మధ్య కాలంలో DUలో కొన్ని విద్యార్థి, ఉపాధ్యాయ ఉద్యమాలు జరిగాయి. 1973లో పూర్వ విద్యార్థులు, విద్యార్థుల మధ్య హింసాత్మక ఘర్షణ ఫలితంగా మూడు నెలల పాటు విశ్వవిద్యాలయం మూసివేయబడింది. 1975 ఎమర్జెన్సీ సమయంలో, జయప్రకాష్ నారాయణ్ ప్రారంభించిన స్థాపన వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న 300 మందికి పైగా విద్యార్థి సంఘాల నాయకులు సహా అప్పటి ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు అరుణ్ జైట్లీ జైలుకు పంపబడ్డారు. ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాల ప్రభావం ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులపైనా పడింది. 1970లలో నక్సలైట్ ఉద్యమం చాలామందిని ఆకర్షించింది.
 
వివాదాలు 
DU అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు అధిక కటాఫ్ మార్కులకు సంబంధించి గతేడాది కొంత విమర్శలకు గురైంది. అయితే ఇతర కేంద్రీయ విశ్వవిద్యాలయాల మాదిరిగానే ఈ సంవత్సరం కామన్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తుంది. 2016లో ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతలపై బీజేపీకి, ప్రత్యర్థి రాజకీయ పార్టీల మధ్య జరిగిన మాటల యుద్ధంలోనూ DU తెరపైకి వచ్చింది. 1978 నాటి ప్రధానమంత్రి డిగ్రీలు ‘ప్రామాణికమైనవి’ అని ఈ యూనివర్సిటీ స్పష్టం చేసిన తర్వాతే వివాదం ముగిసింది. DU 2013లో నాలుగు-సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (FYUP)ని అమలు చేసింది. అయితే విద్యార్థుల నుంచి నిరసనలు తలెత్తడంతో ఒక సంవత్సరం తర్వాత కేంద్ర ప్రభుత్వం దీనిని రద్దు చేసింది. ఇక 2019-2020 సంవత్సరంలో అవినీతి ఆరోపణలపై DU అప్పటి వైస్-ఛాన్సలర్ యోగేష్ త్యాగిని సస్పెండ్ చేసింది. సంస్థ పర్యవేక్షణ కమిటీ ఇద్దరు ప్రముఖ దళిత రచయితలు 'బామా, సుకీర్తరాణి'తో పాటు రచయిత్రి, కార్యకర్త మహాశ్వేతకు సంబంధించిన టెక్ట్స్‌ను మూడో సంవత్సరం ఇంగ్లీస్ లిటరేచర్ సిలబస్ నుంచి తొలగించిన తర్వాత 2020లో ఈ విశ్వవిద్యాలయం మరోసారి హెడ్‌లైన్స్‌లో నిలిచింది.


2022-05-03  Education Desk