ఈ ఏడాది వేసవి మండిపోతోంది. ఏప్రిల్ నెల ముగిసేవరకే ఎండలు ఉగ్రరూపం దాల్చాయి. సగటున 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. మరోవైపు భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉష్ణోగ్రతలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఇప్పటికే 48 డిగ్రీలకుపైగా వేడిమి నమోదవడంతో అక్కడున్న స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ ఎండలతో 128 ఏళ్ల రికార్డులు బద్దలయినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక ఈ ఎండల కారణంగా వలస కూలీలు తీవ్రంగా నష్టపోతున్నారు. కీలకమైన పగటి సమయంలో ఎండలు మండిపోతుండటంతో పని చేసుకోలేక సతమతమవుతున్నారు. ఏదేమైనా వాతావరణ మార్పుల కారణంగా ఇలా ఎండలు మండిపోతుండటంపై పలు దేశాలు ఇప్పటికే ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా సముద్రతీర ప్రాంత దేశాలు వణికిపోతున్నాయి. భరించలేని ఎండల కారణంగా సముద్ర మట్టలు పెరిగి భూభాగం ముంపునకు గురువతున్నట్లు వాపోతున్నాయి.
కొన్ని సంరక్షణ చర్యలు అవసరం..
ఎండలు పెరిగినప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. బయట వేడి పెరగడంతో గాలిలో ఆర్ద్రత పెరుగుతుంది. దీని కారణంగా విప రీతంగా చెమటలు పడుతాయి. దీంతో శరీరంలోని నీటి శాతం తగ్గి వడదెబ్బకు గురయ్యే అవకాశముంటుందని విశ్లేషకులు పేర్కొంటు న్నారు. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు నీటిని తాగుతూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక ఎండాకాలనికి సంబంధించి కొన్ని చిట్కాలు పాటిస్తే ఉపయోగం ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా ఇంటి నిర్మాణంలో లైమ్ స్టోన్ వాడకంతోపాటు ధారళంగా గాలి వచ్చేలా కిటికీలు, తలుపులు బిగించుకోవాలని పేర్కొంటున్నారు. ఇక అవసరమైనప్పుడు కర్టెన్లు వేసుకోవడంతోపాటు సూర్యునికి వేరే వైపు ఉన్న తలుపులు తీసుకుంటే ఫలితం ఉంటుంది. బయటకు వెళ్లినప్పుడు సన్ స్క్రీన్ లోషన్ పెట్టుకోవడంతోపాటు లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలి. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని పేర్కొంటున్నారు.
ఆరోగ్య సమస్యలున్న వారు జాగ్రత్త..
గుండె సమస్యలు ఉన్నవారు.. వేసవిలో ఎక్కువగా వ్యాయామం చేయకూడదు. బాల్కనీల్లో, ఇంటి కప్పు మీద ఎక్కడైనా గానీ వేడి వాతావరణంలో కఠినమైన వ్యాయామాలేవీ చేయొద్దు. నీడ పట్టున సులభమైన వ్యాయామాలు చేసుకోవాలి. వేసవిలో సాధారణంగానే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. మీరు బయటకు వెళ్లి వ్యాయామం చేస్తే మీ శరీర ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఎక్కువ. బాడీ టెంపరేచర్ పెరిగే కొద్దీ.. గుండెపై ప్రభావం ఎక్కువ పడుతుంది. మన శరీరానికి శ్రమ పెరిగే కొద్దీ.. గుండె రక్తాన్ని వేగంగా సరఫరా చేస్తుంది. వ్యాయామం చేసేప్పుడు.. ఇంటిలోపలే చేస్తే మంచిది. మీ బాడీ టెంపరేచర్ కొంత నార్మల్గా ఉంటుంది.
కాఫీ, ఆల్కహాల్ తాగకపోవటం మంచిది. ఇవి తీసుకుంటే యూరిన్ ఎక్కువగా వచ్చేలా చేసి ఒంట్లో నీటి శాతం తగ్గేలా చేస్తాయి.తేలికైన, గాలి ఆడేలా చూసే పలుచటి దుస్తులు ధరించాలి. లైట్ రంగు దుస్తులు వేసుకోవాలి.ఇంట్లో చల్లగా ఉండేలా, గాలి వచ్చి పోయేలా చూసుకోవాలి. రోజూ బీపీ చెక్ చేసుకోవడం మంచిది. బీపీ మరీ పెరిగినా, తగ్గినా డాక్టర్ను సంప్రదించాలి. గుండె వైఫల్యం, అధిక రక్తపోటు గల వృద్ధులకు మందుల మోతాదు మార్చాల్సిన అవసరముండొచ్చు. డాక్టర్ను సంప్రదిస్తే తగినట్టు మార్పులు చేస్తారు. ఈక్రమంలో వేసవిలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా గడపొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.