ఒడిశా వైపు వెళ్తున్నట్లు కనిపించిన తీవ్ర తుపాను మరోసారి దిశ మార్చుకుంటూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మచిలీపట్నానికి ఆగ్నేయంగా 90 కి.మీ దూరంలో అసని కేంద్రీకృతమైనట్లుగా వాతావరణ కేంద్రం హెచ్చరించింది విశాఖ తీరం వైపు ప్రయాణించి నెమ్మదించిన అసని తుఫాను క్రమంగా బలహీన పడుతూ పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోందని, బలహీన పడి తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని, ఇది పూర్తిగా బలహీనపడే వరకూ తీరం వెంబడే పయనిస్తుందని ఐఎండీ అధికారులు మీడియాకు తెలిపారు.
ఈ తుపాను ప్రభావంతో పలు పలు జిల్లాలలో మోస్తరు నుంచి భారీవర్షాలుపడే అవకాశాలున్నాయని ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో. జిల్లాతోపాటు ఏలూరు, కోనసీమ, విశాఖ జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదు అవుతాయని పేర్కొన్నారు. తుపాను దృష్ట్యా తీర ప్రాంతాల్లో 95-105 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ఆస్కారం ఉండటంతో ముందస్తు జాగ్రత్తగా 36 రైళ్లు రైల్వే శాఖ రద్దు చేయగా విశాఖ మీదుగా ప్రయాణించే అన్ని విమాన సర్వీసు లను రద్దు చేసారు. అసని కారణంగా రాబోయే పరిణామాలను ఎదుర్కొనటంతో పాటు బాధితుల సహాయ కార్యక్రమాలలో పాల్గొనేందుకు వీలుగా జాతీయ విపత్తు నిర్వహణ దళంకు చెందిన 50 బృందాలను ప్రభావిత ప్రాంతాల్లో మోహరించింది ప్రభుత్వం. కాగా
మరోవైపు సీఎం వైయస్.జగన్ కలెక్టర్లు, ఎస్పీలు ఇతర ఉన్నతాధికారులతో క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అసని తుపాను ప్రభావిత జిల్లాల్లో తీసుకుంటున్న చర్యను అడిగి తెలుసుకున్నారు. తుపాను నేపథ్యంలో హై అలర్ట్‌గా ఉండాలని తుపాను తీరం వెంబడి ప్రయాణిస్తున్న విషయం గమనించి ఇచ్చిన నిధులను ఎప్పటికప్పుడు పారదర్శకంగా ఖర్చు చేయాలన్నారు.
తుఫాను బాధితుల పట్ల మానవత్వంతో అధికారులు వ్యవహరించాలని సూచించిన సిఎం జగన్ ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని, అవసరమైన చోట మరిన్ని సహాయ పునరావాస శిబిరాలను తెరవాలన్నారు. సహాయ శిబిరాల్లో భోజన వసతి తో పాటు మంచి నీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కరెంట్‌కు ఇబ్బంది కలిగితే జనరేటర్లు ఏర్పాటు చేసుకోవా లన్నారు.. సహాయ శిబిరాలకు తరలించిన ఒక వ్యక్తికి రూ.వెయ్యి, కుటుంబానికి రూ.2వేల చొప్పున ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసారు సిఎం.
కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం కలిగితే తక్షణ చర్యలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి అందించాలని ఆయన ఆదేశాలిచ్చారు. తుఫాను బలహీనపడటం ఊరటనిచ్చే అంశమే అయినా,దీనిని తేలికగా తీసుకుని నిర్లక్ష్యం ప్రదర్శిస్తే... అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
కోస్తా తీరప్రాంతాలతో పాటు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణ, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, ఏలూరు, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలపై తుపాను ప్రభావం ఉండే ఆస్కారం ఉందని ఇక్కడి అధికారులు సెలవులను మంజూరు చేయటంలేదని, వారంతా ప్రజలలో నిత్యం అప్రమత్తతో ఉండాల్సిందేనని సిఎం తేల్చి చెప్పారు.
మరోవైపు విపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా అనీస తుఫానులో బాధితులకు అన్ని విధాలుగా సహాయం అందించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ మేరకు తుఫాను ప్రభావిత జిల్లల నేతలతో ప్రత్యేక వీడియో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తిత్లి తరహాలోనే ఏక్షణమైనా తుఫాను తిరిగి విరుచుకు పడే అవకాశాలున్నాయని, జనం రక్షణకు అన్ని విధాలా చర్యలు తీసుకోవటంతో పాటు వారికి తగిన వసతులు, ఆహారం అందుతుందో లేదో చూడాలని సూచించారు.