collapse
...
Home / ఆధ్యాత్మికం / జయంతి: ‘దివ్యజ్ఞాన’మూర్తి జిడ్డు కృష్ణమూర్తి - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for T...

జయంతి: ‘దివ్యజ్ఞాన’మూర్తి జిడ్డు కృష్ణమూర్తి

2022-05-12  Spiritual Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

j-krishnamurti-1024
 

ఆధ్యాత్మికత , తాత్వికత… రెండూ విభిన్నమైన మార్గాలు. ఆధ్యాత్మికత అంటే దైవం, భక్తికి, మోక్షానికి సంబంధించింది. వేదాలు , ఉపని షత్తులు పూర్తిగా ఆధ్యాత్మిక పరమైనవి. తాత్వికత అంటే ఒక వైరాగ్యం. పూర్తిగా వ్యక్తిగతమైంది. ఆ వైరాగ్యం జీవిత వాస్తవాల నుంచి కానీ , అనుభవాల నుంచి కానీ పుట్టవచ్చు. అనుభవాల సారమే వేదాంతం. వేదాలు వేరు, వేదాంతం వేరు అని చెప్పవచ్చు. వేదాలు, ఉప నిషత్తులు అనేవి ధర్మశాస్త్రాలు. ప్రభుసమ్మతమైనవి. అవి శాసిస్తాయి. ఆజ్ఞాపిస్తాయి. ధర్మశాస్త్రాలకు మనసు లేదు. కొంత పరుషంగా ఉంటాయి.

వేదాంతం, తాత్వికత మనసును తాకే, మనసును అర్థం చేసుకునే సున్నితమైన భావసంపద. తాత్వికత సలహా ఇస్తుందే కానీ శాసించదు. తాత్వికత మనిషి కష్టసుఖాల కలబోత. చాలామందికి ఆధ్యాత్మికతకు, తాత్వికతకు ఉన్న ఈ విభజన రేఖ తెలీదు. రెండూ ఒకటనే అనుకుంటారు. ఆధ్యాత్మికతలో ఆచారాలు, విశ్వాసాలు, సంప్రదాయాలు, శాస్త్రబద్ధమైన కట్టుబాట్లు కూడా ఉంటాయి. మొదట వీటిని సమాజ శ్రేయస్సుకోసం ఏర్పాటు చేసుకున్నారు. క్రమంగా వాటిలో కొన్నింటిని వక్రీకరించారు. ఆ వక్రీకరణలో సమాజాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవాలనే కొందరి స్వార్థమూ ఉంది. ఆ స్వార్థం వల్లే వక్రీకరణ జరిగి , పెరిగి… కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు మూఢ నమ్మకాలుగా మారాయి. మనదేశంలో కొందరు సంస్కర్తలు వాటిని ఖండించి , అభ్యుదయ మార్గదర్శకులయ్యారు. 

కృష్ణమూర్తి జీవితం  

తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి  1895 మే  12న ఆంధ్ర ప్రదేశ్ మదనపల్లెలో  జన్మించారు. కొంతకాలం తర్వాత వారి కుటుంబం మద్రాసుకు (ఇప్పటి చెన్నై) తరలింది. అక్కడే నివాసమున్నారు. మద్రాసు అడయారులో ఉన్న దివ్యజ్ఞాన సమాజానికి అనీబిసెంట్ అప్పట్లో అధ్యక్షు రాలిగా ఉన్నారు.ఆమె కృష్ణమూర్తి , ఆయన తమ్ముడు నిత్యానందను విద్యాభ్యాసం కోసం ఇంగ్లాండ్ పంపించింది. కృష్ణమూర్తి ఆ తర్వాత పారిస్ లోని సారబాన్ విశ్వవిద్యాలయంలో సంస్కృతం, ఫ్రెంచి భాషలను అధ్యయనం చేశారు. అయితే.. తన కొడుకులిద్దరిని తిరిగి రప్పించాలంటూ అనీబిసెంట్ పై కృష్ణమూర్తి తండ్రి కోర్టులో దావా వేశాడు. చివరికి అనీబిసెంట్ కు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది.. అయినప్పటికీ ఆ సోదరులిద్దరూ తన దగ్గరే ఉండేలా చూసుకుంది. ఎందుకంటే.. జిడ్డు కృష్ణమూర్తి కాబోయే జగద్గురువని ఆమె నమ్మకం. అయితే జిడ్డు కృష్ణమూర్తి ఏనాడూ తనని తాను జగద్గురువుగా భావించలేదు. అలా ప్రకటించలేదు.

తమ్ముడి మరణం

ఇలా కాలం గడుస్తుండగా.. కృష్ణమూర్తి తమ్ముడికి జబ్బు చేసింది. ఆయన తన సోదరుడిని తీసుకుని అమెరికాలోని కాలిఫోర్నియా వెళ్ళి పోయారు. ఆరోగ్యవంతమైన ప్రదేశమని 1922లో కాలిఫోర్నియా కొండల్లో ఒక ఇంటిలో సోదరులిద్దరూ నివాసం ఏర్పరుచుకున్నారు. కానీ ఫలితం లేకుండా పోయింది.  1925లో తమ్ముడు నిత్యానంద మరణించాడు. తమ్ముడి మరణం కృష్ణమూర్తిలో పెను మార్పును తెచ్చింది. నిజానికి చిన్నప్పట్నుంచీ ఏ విషయాన్ని పూర్తిగా నమ్మేవారు కాదు. కరడు కట్టిన సాంప్రదాయ వాసనలతో బూజు పట్టిపోతున్న మతాల మీద ఆయనకు నమ్మకముండేది కాదు. తనను జగద్గురువని ప్రచారం చేసిన దానిలోనూ ఆయనకు నమ్మకముండేది కాదు.  

ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ది ఈస్ట్  

కృష్ణమూర్తిని జగద్గురువుగా భావించిన డాక్టర్ అనిబిసెంట్ ‘ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ది ఈస్ట్’ అనే ఒక అంతర్జాతీయ సంఘాన్ని స్థాపించి , కృష్ణమూర్తిని దానికి ప్రధానిని చేసింది. కృష్ణమూర్తి   అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కానీ ఆ పదవిని చేపట్టక నిర్లిప్తంగా ఉన్నారు.

తమ్ముడి మరణం తర్వాత కొంతకాలం బాధపడ్డారు కానీ ఆ తర్వాత ఒక విధమైన ఉత్సాహం వచ్చింది. తాను జగద్గురువు అని అనీబి సెంట్ చేసిన ప్రచారాన్ని కాదనలేదు. కానీ   అందువల్ల వచ్చిన గౌరవాలను నిరాకరించారు. సాధారణ జీవితాన్నే గడపేవారు.జగద్గురు పీఠాన్ని స్వీకరించమని చాలామంది వత్తిడి చేశారు. కానీ ఇష్టంలేక తిరస్కరించారు.  

1929లో హాలెండ్ లోని ‘ఆమెన్’లో తాను జగద్గురువు కాదని ప్రకటించి ,  ‘ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ది ఈస్ట్’ను రద్దు చేశారు.ఆ సంఘటనకు అనీబిసెంట్ తోపాటు చాలామంది చాలా బాధపడ్డారు. తన అభిప్రాయాన్ని మార్చుకోమని ఒత్తిడి తెచ్చారు. కాని లాభం లేకపోయింది. తాను జిడ్డు కృష్ణమూర్తినే కాని జగద్గురువును కానని స్పష్టంగా చెప్పారు. అప్పుడే ఆయన తను పయనించాల్సిన మార్గాన్ని ఎంచుకున్నా రు.

ఆనాటి సమాజం

భారతదేశం సంస్కృతీ-సంప్రదాయాలకు పుట్టినిల్లుగా పరిగణిస్తారు. అదేవిధంగా మూఢనమ్మకాలూ ఉన్నాయి. ప్రపంచదేశాలన్నీ సాంకేతికంగా, ఆర్థికపరంగా అభివృద్ధి చెందుతూ దూసుకెళుతుంటే భారతదేశంలో మాత్రం అప్పటి ప్రజలు  అజ్ఞానంలో ఉండిపోయారు. మూఢవిశ్వాసాల పేరు చెప్పి బతికేవారూ ఉండేవారు.ఆ సామాజిక పరిస్థితిలో   కొందరు మూఢనమ్మకాలను పాలద్రోలేందుకు,  ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు తమ జీవితాలనే త్యాగం చేశారు. మన దేశం ప్రపంచదేశాలకు పోటీగా     నిలబడాలంటే ముందు   మూఢనమ్మకాలను శాశ్వతంగా నిర్మూలించాలి. ఆ లక్ష్యంతోనే అడుగులు వేశారు.  

మనిషి తనంతట తానుగా భయం, కట్టుబాట్లు, అధికారం, మూఢవిశ్వాసాల నుంచి విముక్తి చెందాలని జిడ్డు కృష్ణమూర్తి ఆకాంక్షించారు.  1929 నుండి  1986 తను మరణించే వరకు ప్రపంచమంతటా పర్యటించారు. మానసిక విప్లవం, మనోభావ విచారణ, ధ్యానం, మానవ సంబంధాలు, సమాజంలో మౌలిక మార్పు వంటి తాత్విక , ఆధ్యాత్మిక విషయాలపై అనేక ప్రసంగాలు చేశారు. సమాజంలో చైతన్యంకోసం నిరంతరం శ్రమించి , ప్రపంచ తత్వవేత్తగా కీర్తి పొందిన   ఈయన  1986 ఫిబ్రవరి  17న కాలిఫోర్నియాలో మరణించారు.2022-05-12  Spiritual Desk