ఆధిపత్య పాలిటిక్స్‌లో అమెరికా తర్వాత స్థానమే కాదు.. ఆ మాటకొస్తే ఆర్థికంగా అగ్రరాజ్యం అమెరికాపై పైచేయి సాధించిన దేశం చైనా.. ప్రపంచ దేశాలతో ద్వైపాక్షిక, వ్యూహాత్మక ఆర్థిక సంబంధాలు నెలకొల్పుకోవడం ద్వారా అగ్రరాజ్యంపై పైచేయి సాధించిందంటారు.. అటువంటి చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అంతు చిక్కని వ్యాధితో బాధ పడుతున్నారట.. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మెదడుకి సంబంధించిన ‘సెరిబ్రల్ అనూరిజం’తో బాధపడుతున్నారని స్థానిక మీడియా పేర్కొంది. ఈ వ్యాధి కారణంగానే గతేడాది 2021 చివరిలో ఆసుపత్రిలో చేరినట్లు తెలిపింది. నిజానికి కరోనా విజృంభించినప్పటి నుంచి బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ వరకూ కూడా జిన్‌పింగ్ విదేశీ నాయకులను ఎవ్వరినీ కలవలేదు. దీంతో జిన్‌పింగ్ ఆరోగ్యం క్షీణించిందంటూ పుకార్లు వెల్లువెత్తాయి.
ఎప్పుడూ ఈ వ్యాధి బయటపడిందంటే?
మార్చి 2019 లో జిన్‌పింగ్ తన ఇటలీ పర్యటనలో భాగంగా నడిచేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లినప్పుడు కూర్చోవడానికి చాలా ఇబ్బందిపడ్డారు. వెంటనే ఆయన వైద్యులను సంప్రదించారు. పలు వైద్య పరీక్షల అనంతరం ఈ వ్యాధి బయటపడింది. అంతేకాదు 2020లో షెన్జెన్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు కూడా దగ్గుతో విపరీతంగా ఇబ్బంది పడ్డారు. అప్పటి నుంచే జిన్‌పింగ్ ఆరోగ్యంపై ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. అయితే ఆ వ్యాధి సోకిన వారికి శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుంది. కానీ జీ జిన్‌పింగ్ సంప్రదాయ చైనా ఔషధాలు మాత్రమే వాడి నయం చేసుకోవాలని భావిస్తున్నారు. అందువల్లే బయటి ప్రపంచానికి దూరంగా ఉంటున్నారని సమాచారం. ఈ చికిత్స ద్వారా మెదడులోని రక్త నాళాలు మెత్తబడి వ్యాధి తగ్గే అవకాశాలు ఉంటాయి. ఈ క్రమంలోనే గత ఏడాది చివరలో ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుని అనంతరం డిశ్చార్జ్ అయినట్లు సమాచారం.
ఏంటీ సెరిబ్రల్ లేదా ఇంట్రాక్రానియల్ అనూరిజం..
సెరిబ్రల్ అన్యురిజం వ్యాధిగ్రస్థుల మెదడులోని రక్త నాళాలు అసాధారణంగా ఉబ్బటం వల్ల రక్త ప్రసరణకు మార్గం సన్నబడుతుంది. రక్త నాళాలు అకస్మాత్తుగా పగిలిపోయే అవకాశం కూడా ఉంటుంది. దీంతో మెదడు చుట్టూ రక్తస్రావం అవుతుంది. దీన్ని సబ్‌అరాక్నోయిడ్ హెమరేజ్ (ఎస్ఏహెచ్) అంటారు. ఈ రక్తస్రావం కారణంగా సదరు వ్యక్తి స్ట్రోక్ లేదా కోమాలోకి వెళ్లిపోవడం లేదా మరణించడం జరుగుతుంది. అన్యురిజం అంటే ఎటువంటి లక్షణాలు లేకుండా రక్తనాళాల నుంచి బ్లడ్ లీక్ అవుతూ ఉంటుంది. తీవ్రమైన తలనొప్పి నుంచి ప్రాణాంతక స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. అన్యురిజంలోకి రక్తం సరఫరాను అడ్డుకునేందుకు విభిన్న పద్దతులను అవలంభిస్తారు. అన్యురిజంలోకి అవసరానికి మించి రక్తం సరఫరా కాకుండా దారి మళ్లిస్తారు. కండరాల టొనాకా (ధమని 3 పొరలలో ఒకటి) అసాధారణమైన నష్టం లేదా లేకపోవడం వల్ల సంభవించే ఈ విస్తరణ కారణంగా, ధమని గోడ బలహీనంగా మరియు మరింత పెళుసుగా ఉంటుంది. అందువల్ల, అనూరిజం చీలిపోయే ప్రమాదం ఉంది. ఒకే రోగికి ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ అనూరిజం ఉండవచ్చు. 90% సెరిబ్రల్ అనూరిజంలు లక్షణరహితంగా ఉంటాయి. అవి చీలిపోయే వరకు గుర్తించబడవు.