డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో క్లీన్ చిట్ ఇచ్చాక.. ఈ కేసును మొదట దర్యాప్తు చేసిన వివాదాస్పద ఐ ఆర్ ఎస్ అధికారి సమీర్ వాంఖడే చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. నాడు ముంబైలో ఈ సంస్ధకు జోనల్ డైరెక్టర్ గా ఉన్న ఈయన మామూలోడు కాదని తాజాగా తెలియవచ్చింది. ఈయన అసలు ముస్లిం అని, కానీ పేరు మార్చుకున్నాడని ఎన్సీపీ మంత్రి నవాబ్ మాలిక్ లోగడ తెలిపారు. యూపీ ఎస్ సి (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) పరీక్ష రాసేటప్పుడు సమీర్ వాంఖడే నకిలీ (ఫోర్జరీ చేసిన) కాస్ట్ సర్టిఫికెట్ ఇచ్చాడని, ఎస్టీలకు రిజర్వ్ చేసిన పోస్టు కోసం ప్రయత్నించాడని ఆయన చెప్పారు. అసలు నాడు క్రూజ్ షిప్ లో ఎన్సీబీ దాడి అన్నది ఫేక్ అని, ప్రముఖ బాలీవుడ్ స్టార్ల నుంచి డబ్బు గుంజడానికి చేసిన యత్నమే అదని ఆయన అన్నారు. సుమారు రెండు దశాబ్దాల క్రితం నవీ ముంబైలో ఓ బార్, రెస్టారెంటును ఏర్పాటు చేయడానికి లైసెన్స్ కోసం వాంఖడే మోసపూరిత పధ్దతులను అనుసరించాడని ఆయన పేర్కొన్నారు. మాలిక్ ఇచ్చిన ఫిర్యాదుతో జిల్లా కుల నిర్ధారణ కమిటీ ..వాంఖడే యవ్వారంపై దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. తాజాగా ముంబై డిస్ట్రిక్ట్ కాస్ట్ సర్టిఫికేషన్ స్క్రూటినీ కమిటీ ... జూన్ 8 న తమ ఎదుట హాజరు కావాలంటూ ఆయనకు సమన్లు జారీ చేసింది. అయితే వీటిని ఆయన సవాలు చేసినప్పటికీ ఎంక్వయిరీ మాత్రం కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో ఆయనను దోషిగా ఈ కమిటీ పేర్కొంటుందేమో వేచి చూడాల్సి ఉంది. ఇక బార్ లైసెన్స్ కి సంబంధించి ఈయనపై వచ్చిన ఫిర్యాదును పురస్కరించుకుని.. అసలు ఈ లైసెన్స్ పొందడానికి ఈయన అర్హుడు కాదని, నాడు ఇతని వయసు 17 ఏళ్ళు మాత్రమేనని థానే కలెక్టర్ మహేష్ నర్వేకర్ కనుగొన్నారు. 1997 అక్టోబరు 27 న వాంఖడేకి పర్మిట్ లభించింది. కానీ మహారాష్ట్ర ప్రొహిబిషన్ యాక్ట్ పనిబంధనల ప్రకారం ఈ లైసెన్సును రద్దు చేశారు. ఆయనపై కేసు కూడా దాఖలయింది. కానీ కలెక్టర్ రిపోర్టును, క్రిమినల్ ప్రొసీడింగ్స్ ని సవాలు చేస్తూ వాంఖడే బాంబేహైకోర్టు కెక్కారు. కాగా ఆర్యన్ ఖాన్ కేసు దర్యాప్తులో ఈయన అనుమానాస్పదంగా వ్యవహరించాడని, ఈయనపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతే కాదు.. ఫేక్ సర్టిఫికెట్ సమర్పించాడని వచ్చిన ఆరోపణలపై ఇన్వెస్టిగేట్ చేయాలని కూడా సూచించింది.ఇతని ఆధ్వర్యంలో డ్రగ్స్ కేసు దర్యాప్తు విఫలమైందని ఢిల్లీ లోని ఎన్సీబీ ప్రధాన కార్యాలయ అధికారులు పేర్కొన్న విషయం గమనార్హం. ఇలా ఈయనపై వచ్చిన వివిధ అభియోగాలను పురస్కరించుకుని ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఈయనపై చర్యలు తీసుకోనుంది. డ్రగ్స్ కేసు దర్యాప్తు బాధ్యతల నుంచి వాంఖడేను ఎన్సీబీ ప్రధాన కార్యాలయం గత ఏడాది నవంబరు 6 న తప్పించింది. పైగా ఈ కేసును ముంబై నుంచి ఢిల్లీలో తమ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఆపరేషన్స్) సంజయ్ కుమార్ సింగ్ నేతృత్వంలోని 'సిట్' కి బదిలీ చేసింది. ప్రస్తుతం ఆర్యన్ ఖాన్ కి, మరో 5 గురికి ఈ కేసులో క్లీన్ చిట్ లభించిందని, అయితే సమీర్ వాంఖడే తోబాటు ఆయన టీమ్ పైన, వారి ప్రైవేటు సైన్యం పైన ఎన్సీబీ చర్యలు తీసుకొంటుందా లేక దోషులను కాపాడుతుందా అని నవాబ్ మాలిక్ ట్వీట్ చేశారు. ఇప్పుడు వాంఖడే ముంబైలోని డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ శాఖలో పని చేస్తున్నాడు.
లోగడ బయట పడినా ఇప్పుడు వాంఖడేకి ముప్పు తప్పదా ?
1997 లో తన బార్, రెస్టారెంటుకు లైసెన్స్ పొందడం కోసం సమీర్ వాంఖడే ఫోర్జరీ చేసిన పత్రాలను సమర్పించాడని వచ్చిన ఆరోపణలపై థానే పోలీసులు కేసు పెట్టినా.. వారు బలవంతంగా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని బాంబే హైకోర్టు లోగడ ఉత్తర్వులిచ్చింది. అది గత ఫిబ్రవరి నాటి మాట.. ఇది 1997 నాటిదని.. అప్పటి ఈ కేసు విషయంలో ఇప్పటివరకు మీరేం చేస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని వాంఖడేని న్యాయమూర్తులు ఆదేశించారు. కానీ ఇప్పుడు తాజా కేసునుంచి ఆయన బయటపడతాడా లేక దోషిగా తేలుతాడా అన్న విషయం స్పష్టం కావలసి ఉంది. మతం పేరు తప్పు చెప్పి, తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి సంబంధిత పోస్టును ఎలా సంపాదించాడో.. ఇలాంటివన్నీ తేలాల్సి ఉంది.
మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి