collapse
...
Home / ఆరోగ్యం / పొగ… పర్యావరణానికి సెగ - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu | News Telugu

పొగ… పర్యావరణానికి సెగ

2022-05-31  Health Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

tobaco
 

కొందరికి కొన్ని తేదీలంటే భయం. ఎందుకంటే… ఆ రోజు వాళ్లు ఇష్టమొచ్చినట్టు ఉండేందుకు వీల్లేదు. ఉదాహరణకు మద్యపాన వ్యతిరేక దినం. ఇక మే 31అన్నా కూడా చాలామందికి భయం. ఎందుకంటే ఆరోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం. ఈ టైంలో మీకింకో సంగతి చెప్పాలి. అలనాడు గురజాడ రాసిన ‘కన్యాశుల్కం’ నాటకంలో గిరీశం అనే పెద్దమనిషి ‘పొగతాగనివాడు దున్నపోతై పుట్టున్’ అని ఒక సూక్తి విసిరాడు. అంతే. అప్పట్నుంచి పొగరాయుళ్లు విచ్చలవిడిగా సిగరెట్లు పీల్చేస్తున్నారు. చెయిన్ స్మోకర్లుగా తయారయ్యారు. మీకింకో విషయం కూడా చెప్పాలి. ఆ గిరీశం వట్టి మాయగాడు. మాటలతో మాయ చేసేస్తాడు. కాబట్టి అతని మాటలు నమ్మకండి. మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి. కాబట్టి పొగ మానండోయ్ బాబూ, కళ్లు తెరవండోయ్.

ఆరోగ్య సంస్థ ప్రోగ్రాం ఏమిటి?   

ప్రతి సంవత్సరం మే 31న పొగాకు వ్యతిరేక దినాన్ని పాటిస్తున్నాం. కొన్ని సభ్యదేశాల ప్రతిపాదనతో 1987లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ రోజును ‘పొగాకు వ్యతిరేక దినం’గా పాటిస్తోంది. పొగాకు వల్ల కలిగే దుష్ఫలితాలు, అందువల్ల వచ్చే వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించి, వారిని చైతన్యవంతులను చేయాలి, ఆ అలవాటును మాన్పించాలి… అనే లక్ష్యంతో ఈరోజును పాటిస్తున్నారు. పొగాకు వల్ల కలిగే ప్రమాదాలు, పొగాకు ఉత్పత్తిదారుల ఎత్తులు, పొగాకు పిశాచంపై పోరాటానికి ఆరోగ్య సంస్థ తీసుకున్న చర్యలపై ప్రపంచమంతా ఈ రోజు దృష్టిని కేంద్రీకరిస్తుంది. ఆరోగ్య సంస్థ ప్రచారం చేస్తుంది. ఆరోగ్యంగా జీవించాలంటే ఏం చేయాలో చెప్పి ప్రజల్ని చైతన్యపరుస్తుంది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎందరో ఆరోగ్య నిపుణులతో కలిసి పనిచేసి…  పొగాకువల్ల మనం నివసించే పర్యావరణానికి ఎన్ని విధాలుగా హాని కలుగుతుందో తెలియజేయాలనుకుంది. ‘పర్యావరణాన్ని కాపాడండి’ అనే అంశాన్ని ఈ ఏడాది ముఖ్యాంశంగా స్వీకరించింది. పర్యావరణమంతా పొగతో నిండిపోతే…గాలి కలుషితమవుతుంది. పొగాకు కారణంగా ఉత్పత్తి అయ్యే చెత్తవల్ల వ్యవసాయానికి, పంటలకు  ఎలా నష్టం వాటిల్లుతుందో చెప్పి అవగాహన కలిగించడమే ఈ ఏడాది ఆరోగ్యసంస్థ ఎంచుకున్న అంశం. అంతేకాదు. ప్రకృతిలో పచ్చదనాన్ని నాశనం చేసేందుకు పొగాకు కంపెనీలు ఏ విధంగా, ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాయి, ఎన్ని కుట్రలు చేస్తున్నాయి అన్నది కూడా ఆరోగ్యసంస్థ అందరి దృష్టికీ తెస్తుంది. 

ప్రపంచ పొగాకు వ్యతిరేకదినం ప్రాధాన్యత   

కరోనా వల్ల మిగతావారికంటే పొగతాగే వారికి 50 శాతం ఎక్కువ ప్రమాదం ఉంది. అంతేకాదు, మరణానికి కూడా దారితీయవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ ఆధనోం హెబ్రియేసస్ హెచ్చరించారు. పొగాకు వాడకం వల్ల కార్డియో వాస్కులర్ వ్యాధి, కేన్సర్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి, మధుమేహం వంటి …నాలుగు ప్రధానమైన, ఒకరి నుంచి ఒకరికి సోకని ప్రమాదకర వ్యాధుల బారినపడే ప్రమాదముందని ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ తెలిపింది. 

పొగాకు వ్యతిరేక దినం చరిత్ర  

ప్రపంచ ఆరోగ్యసభ 1987లో  ‘డబ్ల్యూహెచ్ ఏ 40.38’ పేరుతో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. 1988 ఏప్రిల్ 7న దాన్ని ‘వరల్డ్ నో స్మోకింగ్ డే’ (ప్రపంచ పొగ వ్యతిరేక దినం) గా ప్రకటించారు. అలా ప్రకటించిన ఆ తీర్మానానికి ‘డబ్ల్యూహెచ్ ఏ 42.19’ అని పేరు పెట్టారు. చివరగా ఆ తీర్మానాన్ని 1988లో ఆమోదించారు. ఆ తీర్మానం ప్రకారం ప్రతి ఏటా మే 31వ తేదీని ‘ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం’గా పాటించాలని నిర్ణయించారు. 

ఈ ఏడాది అంశం  

ఈ రోజుకు ప్రతి ఏటా ఒక ప్రధాన అంశాన్ని ఎంచుకొని, దాని అమలుకు ప్రయత్నిస్తారు. పొగాకు ఏ రూపంలో ఉన్నా, లేదా దాని సమీపంలో ఉన్నా…  అది కలిగించే చెడు ప్రభావాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆ అంశం ద్వారా అవగాహన కలిగిస్తారు. అలా ఈ ఏడాది ఎంచుకున్న అంశం – ‘పొగాకు నుంచి పర్యావరణాన్ని కాపాడండి’. ఈ అంశం అమలులో సఫలం కావాలని ఆశిద్దాం.


 

మరిన్ని ఆరోగ్య వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి   
 



2022-05-31  Health Desk