collapse
...
Home / ఆంధ్రప్రదేశ్ / పవిత్ర పుణ్యక్షేత్రం.. ప్లాస్టిక్ రణక్షేత్రం.. తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం సాధ్యమా.. - 6TV News : Telugu in News | Telug...

పవిత్ర పుణ్యక్షేత్రం.. ప్లాస్టిక్ రణక్షేత్రం.. తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం సాధ్యమా..

2022-06-02  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

plastic ban

నిత్యావసరం గా మారిన ఒక వస్తువును నిషేధించాలి అంటే పోరాటం తప్పదు.. అలాంటిది నిత్యం వేలాదిగా భక్తులు హాజరయ్యే తిరుమల లాంటి పుణ్యక్షేత్రమే అయితే ప్లాస్టిక్ నివారణ దిశగా అది రణక్షేత్రం అవుతుంది. ఉదయం నుంచి రాత్రి దాకా కుప్పలుతెప్పలుగా నిండి ఉండే భక్తులతో ఉండే తిరుమల పుణ్యక్షేత్రంలో ప్లాస్టిక్ నివారణ సాధ్యాసాధ్యాలపై పలు సందేహాలు ఉన్నాయి. పాలకులు ,అధికారులు  పూర్తిస్థాయిలో చిత్తశుద్ధితో పని చేస్తే తప్ప ఇది సాధ్యపడే అవకాశం లేదు. ఒక్కసారి తిరుమలలో పరిస్థితిని పరిశీలిస్తే...

రద్దీ ఇలా.. 

ఆపదమొక్కులవాడు గా పేరుగాంచిన తిరుమల వెంకన్న సన్నిధి కి నిత్యం తరలి వచ్చే భక్తుల సంఖ్య వేలల్లో ఉంటుంది. ప్రత్యేక సందర్భాలలో అయితే లక్షల్లోకి చేరుతుంది. తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. ఈ క్రమంలో లో పోటు బందోబస్తు, మద్యం పొగాకు వంటి తనిఖీలు, ఇతరత్రా తనిఖీలతో హడావిడి ఉంటుంది. ఇలాంటి సమయంలో ప్లాస్టిక్ ను తనిఖీ చేసి నివారించడం అనేది సవాలుగానే చెప్పాలి. విపరీతమైన రద్దీ ఉండే తిరుమలలో భక్తులను దర్శనం చేయించి పంపే విషయంలో 24 గంటలు తలమునకలై ఉండే యంత్రాంగం అదనంగా ప్లాస్టిక్ భారాన్ని కూడా మోయ కలుగుతుందా.. అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదకరమైన ప్లాస్టిక్ నివారణ అత్యంత ముఖ్యమే అయినప్పటికీ దీనిని సుసాధ్యం చేయడానికి అధికారులు పెద్దఎత్తున పోరాటం చేయక తప్పదు.

ప్రయత్నం ఇలా..  

అయితే ప్లాస్టిక్ నివారణ దిశగా ఇప్పటికే టీటీడీ తన ప్రయత్నాలను మొదలు పెట్టింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జూన్ ఒకటవ తేదీనుంచి సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తిరుమల ఆస్థాన మండపం లో మంగళవారం దుకాణదారులు, హోటళ్ల నిర్వాహకులతో టిటిడి అధికారులు సమావేశం నిర్వహించారు. ప్లాస్టిక్ బ్యాగులు, బాటిల్ లు, కవర్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించి నట్లు ప్రత్యేక అధికారి మల్లికార్జున్ తెలిపారు. అలిపిరి చెక్ పాయింట్ వద్ద పూర్తిగా తనిఖీలు చేసి ప్లాస్టిక్ రహిత వస్తువులను మాత్రమే తిరుమల కు అనుమతి ఇస్తామని ఆయన వెల్లడించారు. ప్లాస్టిక్ కవర్లలో వచ్చే ఉత్పత్తులకు సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, బయోడిగ్రేడబుల్ కవర్లు, పేపర్ కవర్లను ఇందుకోసం ఉపయోగించాలని సూచించారు. ప్లాస్టిక్ షాంపూ పొట్ల పైన కూడా నిషేధం విధించినట్లు తెలిపారు. టీటీడీ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీదేవి హోటల్ లు, దుకాణాల వద్ద  తడి పొడి చెత్త వేరువేరుగా డస్ట్ బిన్ లో ఉంచాలని దుకాణదారులకు సూచించారు. విజిలెన్స్, హెల్త్ స్టేట్ అధికారులు  నిరంతర తనిఖీల ద్వారా ప్లాస్టిక్ నివారణ కు ప్రయత్నిస్తారని, ప్లాస్టిక్ వస్తువులను వినియోగించే దుకాణాలను సీజ్ చేస్తారని వెల్లడించారు.

సహకరిస్తేనే సాధ్యం.. 

తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం లో ప్లాస్టిక్ నిషేధం పై ఇంతకు ముందు కూడా ప్రయత్నాలు జరిగినప్పటికీ అవి ఫలితాలను ఇవ్వలేదు. ఇది పూర్తిస్థాయిలో ఫలితాలను ఇవ్వాలంటే ముందుగా భక్తులు స్పందించాలి. వేల సంఖ్యలో ఉండే భక్తులను పూర్తి స్థాయిలో తనిఖీ చేయడం సాధ్యపడదు. కాబట్టి భక్తులు తమ బాధ్యతగా భావించి స్వచ్ఛందంగా ప్లాస్టిక్ నివారణకు సహకరించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే దుకాణదారులు కూడా ప్లాస్టిక్ నిషేధాన్ని విడిగా పాటిస్తూ ముందుకు సాగాలి. అధికారులు ఈ విషయంలో దుకాణదారులు కట్టుదిట్టం చేయాల్సి ఉంటుంది. అందరూ కలసికట్టుగా సమన్వయంతో పని చేస్తేనే ప్లాస్టిక్ నిషేధం సాధ్యమవుతుంది. లేకుంటే కథ మళ్లీ మొదటికే వస్తుంది. నివారణలో కీలక పాత్ర మాత్రం నిస్సందేహంగా టిటిడి అధికారులదే.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 
 2022-06-02  News Desk