Courtesy:Twitter/@RaoVeeraganti
తెలుగు దేశం పార్టీకి సినీ మహిళా గ్లామర్ అచ్చిరానట్లు ఉంది. జయప్రద మొదలు కొందరు సినీ నటీమణులు తెలుగుదేశంపార్టీలో చేరి బాధ్యతలు చేపట్టారు. వీరిలో జయప్రద. రోజా, కవిత వంటి వారు కీలక బాధ్యతల్లోనే ఉండేవారు. జయసుద కూడా పార్టీలో చేరినా ఆమె సేవలను కూడా పార్టీ
అంతంత మాత్రంగానే ఉపయోగించుకుంది. కారణాలు ఏమైనప్పటికీ వారంతా చివరికి పార్టీని వీడి వెల్ళిపోయారు. వీరి తర్వాత కొంత కాలంగా మరో నటి దివ్యవాణి పార్టీ లో చేరి అధికార ప్రతినిధి గా వ్యవహరిస్తుండేవారు. పార్టీ విషయాలను వెల్లడిస్తుండే వారు. కొంత కాలంగా ఆమె టిడిపిని వీడుతారనే వార్తలు వచ్చినా వాటిని ఖండించారు ఆమె.
కానీ ఇటీవల కాలంలో దివ్యవాణి పార్టీకి రాజీనామా చేస్తున్నారనే వార్తలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. రెండు రోజుల క్రితం ఆమె పార్టీకి రాసీనామా చేస్తున్నానని, "పార్టీలో కొన్ని దుష్టశక్తులు నా ఎదుగుదలను అడ్డుకుంటున్నాయి. ఈ శక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తున్నాను. నాకు లభించిన గౌరవానికి, ఆదరించిన నాయకులకు, ప్రతీ కార్యకర్తకు కృతజ్ణతలు" అంటూ ట్వీట్ చేశారు.
ఆ కొద్దిసేపటికే ఆ ట్వీట్ ను డిలిట్ చేసి మరో సందేశాన్ని విడుదల చేశారు. కొన్ని దుష్ట శక్తులు తనను పార్టీనుంచి సస్పెండ్ చేసినట్టు ఒక నకిలీ లేఖ సృష్టించి వైరల్ చేశారని, అది నిజమేనని పొరబాటు పడి తాను రాజీనామా చేశానని వివరిస్తూ తాను రాజీనామా ను వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించారు.
ఆ తర్వాత బుధవారంనాడు దివ్యవాణి పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు. చర్చల అనంతరం ఆమె సంతోషంగానే బయటికి వచ్చినట్టు కనిపించింది. ఆమె కూడా హుషారుగానే మాట్లాడుతూ చంద్రబాబు తనను ఎంతో గౌరవంగా చూశారని కొన్ని విషయాలు చర్చించుకున్నామని, తనపై చాలామంది చాలా విశ్లేషణలు చేశారని, వారితో పాటు తనకు రాజకీయం చేయడం రాదంటూ విశ్లేషించిన వారికి కూడా ధన్యవాదాలు అంటూ చెప్పారు. అయితే ఆమె మాట్లలో అంతర్లీనంగా కొంత వ్యంగ్యం ధ్వనించిందనే అనుమానాలు అప్పుడు కలిగినా, ఆమె సంతోషంతో కూడిన హావభావాలు చూసి దివ్యవాణి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతారని అంతా భావించారు. ఇంతలోనే దివ్యవాణి మరో ట్విస్ట్ ఇచ్చింది.
ఈ సారి నిజంగా ..రాజీనామా ..
తాను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నానని.. ఇది ఈ సారి కన్ఫమ్ అంటూ వీడియో సందేశంలో పేర్కొన్నారు. పార్టీకి రాజీనామా చేశాను.పార్టీలో నాకు ఎంతో మర్యాద ఇచ్చారు. వారందరితో పాటు ప్రతి కార్యకర్తకు ధన్యావాదాలు అని చెప్పారు. చంద్రబాబును కలిసివచ్చిన సందర్భంలోనూ,తాజా వీడియో సందేశం సందర్భంలోనూ కూడా దివ్యవాణి మాటలు వ్యంగ్యంగానే ఉన్నాయనేది స్పష్టంగా తెలుస్తోంది. అంటే పార్టీలో ఆమెకు తగినంత గౌరవం దక్కలేదనే విషయం ఆమె మాటలే రుజువు చేస్తున్నాయని దివ్య అభిమానులు అంటున్నారు. ఇటీవల జరిగిన మహానాడులో కూడా పార్టీ అధికార ప్రతినిధిగా ఉంటున్న దివ్యవాణికి వేదికపై ప్రసంగించే అవకాశం కల్పించకపోవడాన్ని వారు ఎత్తి చూపుతున్నారు. అప్పటినుంచే ఆమె తీవ్రంగా కలత చెందారంటున్నారు. వెంటనే రాజీనామా చేయాలని అనుకున్నా సంయమనం పాటించారని, అయినప్పటికీ ఆమెను పార్టీ నుంచి వెళ్ళగొట్టేందుకు కొన్ని శక్తులు ప్రయత్నించాయని చెబుతున్నారు. దివ్య వాణి కూడా "ఆ శక్తుల" గురించి ప్రస్తావించిన విషయం తెలిసిందే.
రాజీనామా ఇందుకేనా..?
అయితే దివ్యవాణి రాజీనామా వ్యవహారం ఇప్పటికిప్పుడే బయటపడింది కాదని కొంత కాలంగా ఆమె రాజీనామా విషయం పై పార్టీలో కూడా తర్జన భర్జన జరుగుతోందని తెలిసింది. కొంతకాలం క్రితం ఆమె పార్టీ అధికార ప్రతినిధి హోదాలో ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పార్టీ అంతర్గత విషయాలను వెల్లడిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారని అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్ళాయి. దీనిపై పార్టీ అధిష్ఠానం సీరియస్ గా ఉందని చెబుతున్నారు. అందుకే మహానాడులో కూడా ఆమెకు మాట్లాడే అవకాశం రాలేదంటున్నారు. చంద్రబాబుతో ఆమె భేటీ సందర్భంగా కూడా ఇదే విషయాలపై చర్చజరిగిందని, దీనిలో ఆమె వైఖరినే తప్పుబడుతూ పార్టీ అధినేత మాట్లాడారని అందుకే ఆమె గుంభనగా బయటికి వచ్చి రాజీనామా చేశారని తెలుస్తోంది.
ఏ పార్టీలో చేరుతున్నారంటే..
ఈ వ్యవహారం కొంతకాలంగా నడుస్తూ ఇప్పడు పొక కొలిక్కి వచ్చిందంటున్నారు. ఇక దివ్యవాణి రాజకీయంగా ఎటువైపు అడుగులు వేస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. కొంత కాలం క్రితమే ఆమె వైసిపి లో చేరతారనే వార్తలు కూడా వచ్చాయి. ఇందుకు సంబంధించి ఆమె వైసిపి ముఖ్యులతో టచ్ లో ఉన్నారని కూడా వదంతులు వచ్చాయి. కానీ అటువంటి సూచనలేవీ కనబడలేదు ఆ తర్వాత. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసే|శారు కాబట్టి ఆమె ప్రత్యామ్నాయ పార్టీని వెదుక్కోవాల్సి పుంది. దివ్యవాణి జనసేన పార్టీ వై పు చూస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేయాలని ఆశిస్తున్నట్టు చెబుతున్నారు. మరి దివ్యవాణి రాజకీయ భవితవ్యం తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి