హైదరాబాద్‌లో పబ్ కల్చర్ ఇటీవలి కాలంలో భారీగా పెరిగిపోతోంది. పబ్ అంటే అదేదో భూతల స్వర్గంలా భావిస్తోంది యువత. అలాగే అదో స్టేటస్ సింబల్‌లా భావిస్తున్నారు. 17 ఏళ్ల బాలిక గత నెల 28న జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 36లోని అమినీషియా పబ్‌లో జరిగిన పార్టీకి ఇద్దరు యువకులతో కలిసి వెళ్లింది. అక్కడ కొద్దిసేపు గడిపిన అనంతరం పబ్ నుంచి బయటకు వచ్చింది. అనంతరం ఆమెను ఆరుగురు యువకులు కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో ఓ బేకరీ దగ్గరకు వెళ్లాక.. ఆమెను మరో వాహనంలోకి మార్చారు. గంటన్నర తర్వాత బాలికను పబ్ వద్ద వదిలారు. ఆ తర్వాత బాలిక ఇంటికి చేరుకుంది. ఇంటికి వెళ్లిన బాలిక మెడపై గాట్లు ఉండడం తండ్రి గమనించాడు. ఆమెతో ఉన్న యువకులు అసభ్యంగా ప్రవర్తించారని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. సంబంధించి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తిరిగి పబ్‌కు రావడం అనుమానాలకు తావిస్తోంది..
పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్, జూబ్లీహిల్స్ పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ ప్రారంభించారు. ఈ కేసులో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలిక పబ్ నుంచి బయటకు రాగానే కొందరు యువకులు ఆమెను మెర్సిడస్ బెంజ్ కారులో ఎక్కించుకున్నారు. సీసీ టీవీ ఫుటేజి ప్రకారం.. కారులో బాలికను బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 14లోని కాన్సు బేకరీ వద్దకు వెళ్లడం.. కొద్ది సేపటి తరువాత కారులో తిరిగి పబ్‌కు రావడం అనుమానాలకు తావిస్తోంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా.. పబ్ కేసులో గురువారం ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక కారును పోలీసులు సీజ్ చేశారు. బాలికను వేధించిన వారిలో ఓ కార్పొరేషన్ చైర్మన్ కుమారుడు, ఎమ్మెల్యే కొడుకు కూడా ఉన్నారని మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఈ విషయమై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు. కాగా, నిబంధనలకు విరుద్ధంగా పబ్‌లోకి మైనర్‌ను ఎలా అనుమతించారనే ప్రశ్న తలెత్తుతోంది.
నిందితులందరూ మైనర్లే..
ఈ ఘటనలో ఎమ్మెల్యే కుమారుడి ప్రమేయం ఉందని, నేరంలో పాల్గొన్న నిందితులందరూ మైనర్లేనని పోలీసు వర్గాలు తెలిపాయి. జూన్ 1వ తేదీ బుధవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసుకు సంబంధించి వాస్తవాలను ధృవీకరించడానికి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తొలుత ఈ ఘటనలో పాల్గొన్న ముగ్గురు నిందితులపై ఐపీసీ సెక్షన్ 354, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం పంపారు. పోలీసులు ఇప్పుడు కేసును మార్చి.. దానికి IPC సెక్షన్ 376 (గ్యాంగ్ రేప్) జోడించారు. ఒక ఎమ్మెల్యే కుమారుడు, మైనారిటీ బోర్డు ఛైర్మన్ పార్టీలో ఉన్నారని.. వీరివురూ అమ్మాయితో కలిసి ఉన్నారని సీనియర్ పోలీసు అధికారి ఇండియా టుడే టీవీకి తెలిపారు. బాధితురాలు మైనర్ అయిన ఒక నిందితుడిని మాత్రమే గుర్తించి.. అతని పేరు చెప్పగలిగింది.
నన్ను బెంజ్ కారులో బలవంతంగా తీసుకెళ్లారు..
ఇక బాధితురాలు తనపై అత్యాచారం జరిగిందంటూ మీడియాకు వెల్లడించింది. గత నెల 28న అమినీషియా పబ్‌లో పార్టీకి వెళ్లగా... సాయంత్రం 5 గంటలకు గుర్తుతెలియని యువకులు.. తనను బలవంతంగా కారులో తీసుకెళ్లారని తెలిపింది. రాత్రి 7 గంటలకు జూబ్లీహిల్స్ దగ్గర వదిలిపెట్టారని... కారులో తనపై అత్యాచారానికి పాల్పడ్డారని వెల్లడించింది. ‘‘ఓ రెస్టారెంట్లో కాలేజ్ ఫ్రెండ్స్ పార్టీ చేసుకున్నాం. పార్టీలో కొందరు యువకులు.. నన్ను బెంజ్ కారులో బలవంతంగా తీసుకెళ్లారు. బెంజ్ కారులో నాపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. పబ్ దగ్గర నన్ను దింపేసి యువకులు వెళ్లిపోయారు. నాపై జరిగిన అఘాయిత్యం గురించి నాన్నకు చెప్పా. నాకు మెడ దగ్గర తీవ్ర గాయాలయ్యాయి. మా నాన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు’’ అంటూ బాలిక తెలిపింది.