ఇప్పటి వరకూ అగ్నిపర్వతం పేలి.. లావా ప్రవహించడం చాలా సార్లు టీవీల్లో చూసే ఉంటాం. కానీ కొండ మొత్తం కళ్లెదుటే అలా కూలిపోవడం ఎప్పుడైనా చూశారా? అది కూడా ఏదో ప్లాన్ చేసినట్టుగా.. నీట్‌గా కూలిపోవడం ఎప్పుడైనా చూశారా? సమస్యే లేదు. ఇంతవరకూ ఎప్పుడూ చూసింది లేదు అంటారా? కానీ విశాఖ జిల్లా పెందుర్తి మండలం దువ్వపాలెం క్వారీ పరిసర ప్రాంత ప్రజలు ఆ దృశ్యాన్ని కళ్లారా చూశారు. ఆ వీడియోను మనతో కూడా పంచుకున్నారు. వీడియో చూస్తుంటే.. ఒక విచిత్రాన్ని చాలా దగ్గరగా చూస్తున్నట్టుగా అనిపించింది. కొండ చుట్టూ తొలుత దుమ్ము రేగుతూ కొండరాళ్లు కిందకు దొర్లాయి. అనంతరం కొండంత చిన్నగా కూలడం కనిపించింది. అయితే క్వారీ తవ్వకాల్లో ప్రమాదం చోటు చేసుకుంది. రాయి తవ్వకాల్లో భాగంగా ఒక్కసారిగా కొండ కుప్పకూలింది. అక్కడే ఉన్న గుత్తేదారు వెంటనే అప్రమత్తమవడంతో ప్రాణ నష్టం తప్పింది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
కూలడానికి వెనుక దశాబ్దాల చరిత్ర..
అసలు కొండ కూలడమేంటి? ఎవరైనా పని గట్టుకుని డైనమేట్స్ పెట్టి పేల్చడం కూడా జరగలేదు. కానీ చూస్తుండగానే కుప్పకూలింది. అసలు ఈ కొండ ఎక్కడ ఉందంటే.. విశాఖ నగర సమీపంలోని పెందుర్తి మండలం ఎస్ఆర్పురం గ్రామంలో సర్వే సంఖ్య 100లో దాదాపు 80 ఎకరాల్లో ఉంది. అయితే వీడియోలో చూడటానికి ఇదేదో అకస్మాత్తుగా కూలినట్టు కనిపిస్తున్నప్పటికీ దీని వెనుక దశాబ్దాల చరిత్రే ఉంది. ఒకటి కాదు.. రెండు కాదు.. నాలుగు దశాబ్దాలుగా లీజుకు తీసుకుని పలువురు గ్రావెల్, రాళ్ల కోసం ఇక్కడ తవ్వుతున్నారు. మరి ఇన్నేళ్లుగా తవ్వకాలు సాగిస్తుంటే కొండ ఉంటుందా? కొంతకాలంగా చిన్న చిన్న రాళ్లు జారి పడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే కొండకు చీలిక ఏర్పడింది. ఇక పెద్ద మొత్తంలో మట్టి, రాళ్లు జారుతుండటమనేది బుధవారం నుంచి కూడా జరుగుతోంది. దీనిని గమనించిన గుత్తేదారు పనులను నిలిపివేశారు.
కొండ కూలడానికి కారణం ఏంటంటే..
నిబంధనలకు విరుద్ధంగా క్వారీ తవ్వకాలు చేపట్టి, యంత్రాలతో తొలిచేయడంతోనే కొండచరియలు విరిగిపడ్డాయని స్థానికులు చెబుతున్నారు. కార్మికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని అంటున్నారు. ఇక్కడ సుమారు ఆరు హెక్టార్ల పరిధిలో తవ్వకాలకు స్వయంగా ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది. అయితే అంతకు మించి తవ్వకాలు సాగించడమే కొండ కూలడానికి కారణమైందని నిపుణులు చెబుతున్నారు. ఈ తవ్వకాల కోసం భారీ యంత్రాలను వినియోగించడం కూడా ఇబ్బందికరంగా మారింది. అంతేకాదు.. ఈ ఘటనకు ముందురోజు క్వారీలో ఎక్స్కవేటర్లతో పనులు నిర్వహించారని తెలుస్తోంది. ఆ సమయంలో పైనుంచి గ్రావెల్ జారిపడిందని, మట్టిపెళ్లలు సైతం విరిగిపడ్డాయని తెలుస్తోంది. దీనిని గుర్తించిన గుత్తేదారు.. వెంటనే తవ్వకాలు నిలిపివేసి, యంత్రాలను సమీపంలోని లేఅవుట్‌కు తరలించారని స్థానికులు చెబుతున్నారు.
పక్కనే జగనన్న కాలనీలు..
ఈ దువ్వపాలెం క్వారీ సమీపంలోని ఎస్ఆర్పురం వద్ద సుమారు మూడు ఎకరాల్లో ఇటీవల జగనన్న లే అవుట్ వేసి 200 మందికి పట్టాలు ఇచ్చారు. దీంతో వారిలో కొందరు లబ్ధిదారులు ఆనందంగా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పుడు కేవలం కూతవేటు దూరంలోనే కొండచరియలు విరిగిపడడంతో వారంతా భయాందోళనకు గురవుతున్నారు. ఇంకా ఇక్కడ తవ్వకాలు కొనసాగిస్తే తమ కాలనీకి ప్రమాదం తప్పదని వాపోతున్నారు. సంఘటన స్థలాన్ని తహసీల్దార్ పరిశీలించారు. మైనింగ్ అనుమతులపై ఆరా తీశారు. శాఖాపరమైన విచారణ చేపడతామని చెప్పారు.