collapse
...
Home / తెలంగాణ / ప్రగతి కావాలా నాయనా.. ఇదిగో - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu | News Telu...

ప్రగతి కావాలా నాయనా.. ఇదిగో

2022-06-04  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

CM KCR FACE


కేసిఆర్ పాలనలో అవినీతి తప్ప అభివృద్ధి లేదు.. 8 ఏళ్ల పాలనలో ముఖ్యమంత్రి చేసింది ఏమీ లేదు.. అంటూ విమర్శిస్తున్న ప్రతిపక్షాలకు సమాధానంగా, ప్రజలకు వివరణ గా టిఆర్ఎస్ సర్కార్ విజయాల జాబితాను ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారు. ఎనిమిదేళ్ల కాలంలో వివిధ రంగాలలో తాము చేసిన అభివృద్ధికి సంబంధించిన వివరాలతో కూడిన జాబితాను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వివరించారు. దీనిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మంత్రులకు, ఎమ్మెల్యేలకు సూచించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ విడుదల చేసిన జాబితాను  ఒక్కసారి పరిశీలించినట్లయితే..

ఇది ఎదుగుదల..  

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ఎనిమిదేళ్ల కాలంలో   రాష్ట్ర స్థూల ఉత్పత్తి రెండింతలు పెరిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. ఆయన అందించిన వివరాల ప్రకారం టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయం, విద్యుత్, విద్య, ఆరోగ్య రంగాలలో గుణాత్మక వృద్ధి నమోదైంది. 2014 -15 లో  రాష్ట్ర తలసరి ఆదాయం 1.24.104 లక్షలు గా ఉండగా, 2021- 22 నాటికి  అది 2.78.833 కు  చేరుకుంది. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి 2013 - 14 నాటికి  5.05.849 కోట్లు ఉండగా 2021-22 నాటికి అది 11.54.860 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం తెలంగాణ సగటు వార్షిక వృద్ధి రేటు 17.24 శాతం ఉండడం రాష్ట్రానికి గర్వకారణం అని  కెసిఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లు కాగా, టిఆర్ఎస్ ప్రభుత్వం కృషి తో ప్రస్తుతం 17,305 మెగావాట్లకు చేరుకుందని తెలిపారు. అదేవిధంగా సోలార్ పవర్ 74 మెగావాట్ల నుంచి 4,478 మెగావాట్లకు చేరుకున్నట్లు వివరించారు. విద్యా రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా 7,289 కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. గడిచిన ఎనిమిది ఏళ్లలో 1.33 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన ప్రభుత్వం ప్రస్తుతం మరో 91,142 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సిద్ధమైందన్నారు. అంతేకాకుండా 71,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లు వెల్లడించారు. కొత్త రిక్రూట్ మెంట్ లతో కలిపి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి దాకా 2,24,142 ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందని పేర్కొన్నారు. ఖచ్చితమైన ప్రణాళికతో, కఠినమైన ఆర్థిక వివేకంతో ఆదాయ వనరులను పెంచుకుంటూ తమ ప్రభుత్వం వేగంగా అడుగు ముందుకు వస్తుందని స్పష్టం చేశారు.

విమర్శల వెల్లువ..  

ముఖ్యమంత్రి కేసిఆర్ విడుదల చేసిన జాబితాపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. బిజెపి నాయకులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క దీనిపై స్పందిస్తూ తప్పుడు లెక్కలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇవన్నీ ప్రభుత్వపు నోటి లెక్కలే తప్ప చేతల్లో ఏవి ఆచరణలో లేవన్నారు. రెండు లక్షల పైగా ఉద్యోగాలు భర్తీ చేసినట్లు చెప్పడం హాస్యాస్పదం అని అన్నారు. ప్రభుత్వ, కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఎక్కడా కనిపించడం లేదన్నారు. అయితే దీనిపై టి ఆర్ ఎస్ మంత్రులు ఇరు పార్టీలకు కౌంటర్ ఇచ్చారు. మంత్రి హరీష్ రావు, మల్లారెడ్డి తదితరులు వేర్వేరు ప్రకటనల్లో మాట్లాడుతూ అసలు ఎనిమిదేళ్ల కాలంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా ఇక్కడ అభివృద్ధి కోసం  ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీలేని పోరాటం చేశారన్నారు. దేశాన్ని, రాష్ట్రాన్ని మిగతా అన్ని పార్టీల కన్నా ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ వల్లనే తెలంగాణ దుర్గతి పాలయిందన్నారు. కేసీఆర్ విడుదల చేసిన జాబితాపై అటు ప్రతిపక్షాలు, ఇటు మంత్రుల మధ్య  మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది.

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  
 2022-06-04  News Desk