సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభించి నిన్నటికి(శుక్రవారం) 100 రోజులు. ఈ వంద రోజుల్లో రష్యా సాగించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. కేవలం రెండు, మూడు రోజుల్లో ఈ యుద్ధం ముగుస్తుందని భావించిన ప్రపంచాన్ని ఇన్ని రోజుల పాటు కొనసాగిన యుద్ధం నివ్వెరపరిచింది. ఒక్కొక్క నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు రష్యా పెద్ద ఎత్తున పోరాడాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే ఎక్కడ చూసినా బాంబుల మోత. మొత్తానికి ఉక్రెయిన్‌లోని ప్రభుత్వ నిర్మాణాలతో సహా అనేక నగరాల్లోని వేలాది భవనాలు నేలకూలాయి. ఎందరో పౌరులు మరణించారు. ఇది చాలదన్నట్టు రష్యా సేనలు ఉక్రెయిన్ పౌరులను లక్ష్యంగా చేసుకొని పాల్పడిన దురాగతాలు చెప్పలేనివి. వందల మందిని హతమార్చి సామూహిక ఖననాలు చేశారని, మహిళలు, బాలికలపై అత్యాచారాలకు పాల్పడ్డారని ఉక్రెయిన్ అధికారులతో పాటు అనేక అంతర్జాతీయ మీడియా సంస్థలు ఘోషించాయి. ఇటువంటి భయానక పరిస్థితుల నేపథ్యంలో ఉక్రెయిన్‌లో ఉండలేక లక్షలాది మంది పౌరులు కట్టుబట్టలతో శరణార్థులుగా పొరుగుదేశాలకు వలస వెళ్లిపోయారు.
అంతర్జాతీయ పిల్లల సంరక్షణ దినోత్సవం సందర్భంగా..
ఇక రష్యా అధ్యక్షుడు మామూలోడు కాడు. ఇప్పటికే ఆయన కేన్సర్‌తో ఇబ్బంది పడుతున్నారని కథనాలు వెలువడుతున్నాయి. మరోవైపు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పుతిన్ గురించి అటువంటి వార్తే హల్చల్ చేస్తోంది. తన ప్రియురాలు, జిమ్నాస్ట్ అలీనా కబయేవా గౌరవార్థం పుతిన్ జిమ్నాస్టిక్ ఫెస్టివల్‌ను నెల కిందట నిర్వహించినట్టు అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఆ ఈవెంట్‌కు అలీనా ఫెస్టివల్ అని పేరు పెట్టారని న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. ఈ వార్తా సంస్థ కథనం ప్రకారం.. ఆ ఫెస్టివల్‌కు సంబంధించిన వీడియో క్రెమ్లిన్ అనుకూల టీవీ ఛానెల్ రష్యా-1లో బుధవారం ప్రసారమైంది. అంతర్జాతీయ పిల్లల సంరక్షణ దినోత్సవం సందర్భంగా ఈ వీడియోను ప్రసారం చేసినట్టు రష్యా 1 తెలిపింది. వేదికపై జిమ్నాస్ట్‌లు, చిన్నారులు, ఇతరుల సహా వందల మంది ప్రదర్శన ఇవ్వగా.. వెనుక సోవియట్ యూనియన్ నాటి దేశభక్తి గీతాలు వినిపించాయి. ఈ వీడియోల్లో అలీనా కబయేవా కూడా కనిపించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి అలీనా ఒక జిమ్నాస్ట్.. రెండుసార్లు ఒలింపిక్ పతకాలు సహా పలు అంతర్జాతీయ పోటీల్లోనూ రాణించింది.
మరో ఆసక్తికర విషయం ఏంటంటే..
రష్యా మోస్ట్ ఫ్లెక్సిబుల్ విమెన్‌గా అలీనా కబయేవాకు పేరు. న్యూస్‌వీక్ నివేదిక ప్రకారం... ఉక్రెయిన్‌పై రష్యన్ దండయాత్రకు మద్దతుగా బ్లాక్, ఆరెంజ్ చారలతో Z అక్షరాన్ని ప్రదర్శించిన వీడియోలో కబయేవా కూడా కనిపిస్తుంది. రష్యన్ మిలిటరీని అలీనా మెచ్చుకుంటూ రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సోవియట్ యూనియన్ విజయాన్ని ఉక్రెయిన్‌లో ప్రస్తుత సంఘటనలతో పోల్చినట్టు కూడా కనిపిస్తోంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. కబయేవా కనీసం 2007 నుంచి పుతిన్‌తో రిలేషన్షిప్ కలిగి ఉందని తెలుస్తోంది. అయితే పుతిన్ తమ సంబంధాన్ని ఎప్పుడూ అధికారికంగా ధృవీకరించలేదు. అంతేకాదు.. పుతిన్, కబయేవా జంటకు ముగ్గురు పిల్లలు ఉన్నారని అమెరికా నివేదికలు వెల్లడిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం 100 రోజుల మార్క్‌ను దాటుతున్న వేళ, ఉక్రెయిన్‌లోని తూర్పు ప్రాంతంపై మాస్కో తన దాడిని కొనసాగిస్తోంది.