Courtesy:Twitter/@Adbhut321
యూపీలోని కాన్పూర్ లో రెండు వర్గాల మధ్య మళ్ళీ ఘర్షణలు జరిగాయి. ఓ టీవీ షోలో మహమ్మద్ ప్రవక్తను అవమానించారని ఆరోపిస్తూ.. ఒక వర్గం బలవంతంగా షాపులను మూయించివేసేందుకు యత్నించడంతో.. దీన్ని మరో వర్గం అడ్డుకుంది. వీరిపై ఓ గుంపు రాళ్ళ వర్షం కురిపించింది. నాటు బాంబులు విసిరింది. ఘర్షణలకు దిగిన రెండువర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు మొదట లాఠీచార్జి చేసి.. అనంతరం బాష్పవాయువు ప్రయోగించారు. 36 మందిని అరెస్టు చేశారు. 40 మందిని నిందితులుగా గుర్తించామని, మరో వెయ్యి మందికోసం గాలిస్తున్నామని వారు తెలిపారు. నిందితుల ఆస్తులను బుల్డోజర్లతో నాశనం చేస్తామని వారు హెచ్చరించారు. జ్ఞానవాపి మసీదు వివాదంపై టీవీలో చర్చాగోష్టి జరుగుతుండగా బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ .. మహమ్మద్ ప్రవక్తనుద్దేశించి ఓ వ్యాఖ్య చేయడంతో గొడవ మొదలైంది. ఇందుకు ఆగ్రహించిన ఓ గుంపు నిన్న శుక్రవారం ప్రార్థనల తరువాత కాన్పూర్ లోని అతి పెద్ద పరేడ్ మార్కెట్ లోకి ప్రవేశించి బలవంతంగా షాపులు మూసివేయించేందుకు యత్నించింది. హఠాత్తుగా దాదాపు 50 నుంచి 100 మంది వరకు అక్కడికి చేరుకొని నినాదాలు చేయడం ఆరంభించారని, దీంతో మరో వర్గం వారిని అడ్డుకుందని పోలీసులు చెప్పారు. కొద్దిసేపటిలోనే రెండు వర్గాలు రాళ్లు రువ్వుకోవడం ప్రారంభించాయి.. కొందరు నాటు బాంబులు విసిరి నాటు తుపాకులతో కాల్పులు కూడా జరిపారు. అని వారు వివరించారు. లాఠీ ఛార్జి చేసి. బాష్ప వాయువు ప్రయోగించినా పెద్దగా ఫలితం లేకపోవడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు 12 కంపెనీల పీఏసీ బలగాలను రంగంలోకి దించారు. ఈ అల్లర్లను పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే సంస్థ రెచ్చగొట్టి ఉండవచ్చునని భావిస్తున్నామని, దీని కుట్ర ఉందా అన్న అంశంపై ఆరా తీస్తున్నామని మీనా అనే పోలీసు అధికారి తెలిపారు. నిందితుల ఆస్తులను బుల్డోజర్లతో ధ్వంసం చేస్తామని ఆయన హెచ్చరించారు.
మహారాష్ట్రలోనూ రెండు కేసుల నమోదు
కాన్పూర్ లో బీజేపీ నేత నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్య తాలూకు దుమారం మహారాష్ట్ర లోనూ రేగింది. ఆమెపై థానే, సౌత్ ముంబైలో రెండు కేసులు నమోదయ్యాయి. రెండు వర్గాల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు యత్నించారని పోలీసులు పేర్కొన్నారు. అటు-ప్రధాని మోడీ యూపీ పర్యటనలో ఉండగానే బీజేపీ అధికార ప్రతినిధి.. ఇలా వివాదాస్పద వ్యాఖ్య చేసి అల్లర్లకు కారకులయ్యారని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ఆమెను అరెస్టు చేయాలనీ, రాష్ట్రంలో మతసామరస్యాన్ని కాపాడాలని ఆయన కోరారు. ఇప్పటికే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే సంస్థ.. దీన్ని తన ప్రయోజనాలకు వాడుకోజూస్తోందన్నారు. కాన్పూర్ లో రేగిన చిచ్చు దాదాపు మహారాష్ట్రకూ పాకే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఇలా ఉండగా కాన్పూర్ లో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నప్పటికీ అదుపులో ఉందని పోలీసువర్గాలు తెలిపాయి. కీలక ప్రాంతాల్లో పోలీసు పికెట్లు ఏర్పాటు చేసినట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవలే ఈ నగరంలో హిందూ. ముస్లిం వర్గాల మధ్య జరిగిన ఘర్షణలు మరువక ముందే నిన్న ఈ అల్లర్లు చోటు చేసుకున్నాయి. జ్ఞానవాపి మసీదు వివాదం ఇలా యూపీ వంటి రాష్ట్రాల్లో అవాంఛనీయ ఘటనలకు కారణమవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. సున్నితమైన ఈ అంశం పట్ల ఎవరైనా మాట్లాడే ముందు అప్రమత్తత అవసరమన్నది వారి అభిప్రాయం.