రష్యా, ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధం 100 రోజులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో భారత్ వైఖరిపై యూరప్ దేశాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఉక్రెయిన్ పరిస్థితి పట్ల భారత్ స్పందించాలని యూరప్ గట్టిగా వాదిస్తోంది. భారత్ విదేశాంగ విధాన వైఖరిని దుమ్మెత్తి పోస్తోంది. దీనిపై విదేశాంగ మంత్రి జై శంకర్ స్పందించారు. ప్రపంచ సమస్యలపై ఒక్కో దేశం ఒక్కోలా స్పందిస్తుందని.. అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని లేదని తేల్చి చెప్పారు.
తాను ఫెన్సింగ్‌పై కూర్చోలేదని నేలపైనే కూర్చున్నానని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ విమర్శకులకు దిమ్మతిరిగే సమాధానం చెప్పారు. విదేశాంగ విధానం విషయానికి వస్తే దానికో సొంత అభిప్రాయం ఉంటుందని పేర్కొన్నారు. ప్రపంచ సమస్యలపై దాని టేకింగ్ ఇతరులకు ఆమోదయోగ్యం కానందున, భారతదేశం ఫెన్సింగ్‌పై కూర్చున్నదని అర్థం కాదన్నారు. జైశంకర్ GLOBESEC 2022 బ్రాటిస్లావా ఫోరమ్‌లో మాట్లాడుతూ, "నేను మీతో ఏకీభవించనందున.. నేనేదో ఫెన్సింగ్‌పై కూర్చున్నట్టు కాదు.. నేను నా నేలపై కూర్చున్నాను ”అని పేర్కొన్నారు. ‘ఇండో-పసిఫిక్‌లో మిత్రులు : స్నేహాన్ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లడం’ అనే అంశంపై మాట్లాడారు. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించి భారతదేశం అభివృద్ధి చెందుతున్న ప్రపంచ నాయకుడిగా ఫెన్సింగ్‌పై కూర్చోవడమేంటని విదేశాంగ శాఖ మంత్రిని ప్రశ్నించగా ఆయన తనదైన రీతిలో స్పందించారు.
యూరప్ ఇకనైనా ఎదగాలి.. మైండ్ సెట్ మార్చుకోవాలి..
ముఖ్యంగా ఉక్రెయిన్‌పై రష్యా దండెత్తిన నేపథ్యంలో భారత్ అవలంబిస్తున్న తటస్థ వైఖరిని యూరప్ దేశాలు తీవ్రస్థాయిలో విమర్శిస్తుండడం పట్ల కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ స్పందించారు. చైనా అవలంబిస్తున్న హానికర వైఖరిపై అంతర్జాతీయ సమాజం స్పందించాలని భారత్ కోరుకుంటున్నట్టయితే, ఉక్రెయిన్ పరిస్థితి పట్ల భారత్ కూడా మాట్లాడాలన్న యూరప్ వాదనను జైశంకర్ తిరస్కరించారు. ఉక్రెయిన్ సమస్య ఇటీవల సంభవించిందని, అంతకంటే చాలాముందే చైనాతో తమ ప్రతిష్టంభన చోటుచేసుకుందని వివరించారు. యూరప్ ఇకనైనా ఎదగాలని, తన మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. యూరప్ దేశాలు తమ సమస్యను ప్రపంచ సమస్యగా రుద్దాలని భావిస్తున్నాయని ఆరోపించారు. కానీ అదే సమయంలో ప్రపంచ సమస్యలను మాత్రం యూరప్ తన సమస్యలుగా భావించడంలేదని జైశంకర్ విమర్శించారు. భారత్ ఏ పక్షానికి కొమ్ముకాయదని, భారత్ కు సొంత ప్రాధాన్యతలు ఉన్నాయని స్పష్టం చేశారు.
ప్రపంచం మారుతోంది.. ఇకపై యూరోసెంట్రిక్ కాదు
ప్రపంచం ఇకపై ‘యూరోసెంట్రిక్’గా ఉండదని.. ఐరోపా ఆ ఆలోచనకు దూరంగా ఉండాలని జైశంకర్ హితవు పలికారు. “యూరప్ వెలుపల చాలా జరుగుతున్నాయి. ప్రపంచంలోని మన ప్రాంతంలో చాలా మానవ, ప్రకృతి వైపరీత్యాలు తలెత్తుతున్నాయి. అనేక దేశాలు సహాయం కోసం భారతదేశం వైపు చూస్తున్నాయి. ప్రపంచం మారుతోంది. కొత్త ప్లేయర్స్ వస్తున్నారు. ప్రపంచం ఇకపై యూరోసెంట్రిక్ కాదు’’ అని జైశంకర్ పేర్కొన్నారు. జైశంకర్ రెండు మధ్య యూరోపియన్ దేశాలతో సంబంధాలను బలోపేతం చేయడానికి స్లోవేకియా, చెక్ రిపబ్లిక్లకు రెండు దేశాలలోనూ పర్యటిస్తున్నారు. తన పర్యటనలో మొదటి దశలో ఆయన బ్రాటిస్లావాకు చేరుకున్నారు. స్లోవాక్ ప్రధాన మంత్రి ఎడ్వర్డ్ హెగర్ను కలుసుకున్నారు. ఉక్రెయిన్ వివాదంపై రాజకీయ, ఆర్థిక, రక్షణ సహకార విస్తరణపై ఇద్దరూ ఆయనతో చర్చించారు.