జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో కొన్ని దశాబ్దాలుగా 24 సీట్లను ఖాళీగా ఉంచుతున్నారు. ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా వాటికి మాత్రం ఎమ్మెల్యేలు ఎన్నిక కావడం లేదు. అయినా అవి అలానే కొనసాగుతున్నాయి.
జమ్ము కశ్మీర్ రాజ్యాంగం 1956లో రూపొందించారు. జమ్మూ, కశ్మీర్ రాజ్యాంగాన్ని రద్దు చేస్తున్నప్పుడు, భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పిఓకె)కు సంబంధించిన నిబంధనలను అలాగే ఉంచింది. కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్ శాసనసభలో 24స్థానాలను పిఓకె కోసం రిజర్వ్ చేసింది.జమ్ము కశ్మీర్ ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించే బిల్లు లోని క్లాజ్ 14 సబ్-సెక్షన్ 4 (ఎ)లో ఇలా పేర్కొంది:‘పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ, కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో నివసించే ప్రజలు ఎన్నుకునే వరకు జమ్మూ, కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంత శాసనసభలో 24 స్థానాలు ఖాళీగా ఉంటాయి.అసెంబ్లీ లో మొత్తం సభ్యత్వాన్ని లెక్కించేందుకు వీటిని పరిగణించరు’.
పిఓకే ప్రాముఖ్యం ఏమిటి ?
భౌగోళికంగా పీఓకే అపారమైన వ్యూహాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది వివిధ దేశాలతో సరిహద్దులను పంచుకుంటుంది. పశ్చిమాన పాకిస్తాన్‌లోని పంజాబ్, వాయువ్య ఫ్రాంటియర్ ప్రావిన్స్ (ప్రస్తుతం ఖైబర్-పఖ్తుంఖ్వా అని పిలుస్తారు), వాయవ్యంలో ఆఫ్ఘనిస్తాన్ వాఖాన్ కారిడార్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్. ప్రస్తుతం పీఓకే కు సరిహద్దులుగా ఉన్నాయి.
ఆ రెండూ మన అంతర్భాగాలే...
ఇక్కడ ఆసక్తిదాయక అంశం మరొకటి ఉంది. పిఓకేని భారతదేశంలో అంతర్భాగంగా ప్రకటించినప్పటికీ, పిఓకే నుంచి లోక్‌సభకు స్థానాన్ని మాత్రం కేటాయించలేదు.‘జమ్మూ& కాశ్మీర్ ప్రస్తావన వచ్చినప్పుడు, తాను పాక్ ఆక్రమిత కాశ్మీర్, అక్సాయ్ చిన్‌లను సైతం చేర్చి ప్రస్తావిస్తున్నాని,ఆ రెండూ జమ్మూ, కశ్మీర్ ప్రాదేశిక సరిహద్దులలో చేరుతాయని పార్లమెంట్ లో ఒక సందర్భంలో హోంమంత్రి అమిత్ షా చెప్పడం గమనార్హం.
డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు
జమ్ము కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కోసం విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ అధ్యక్షతన ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర, జమ్ము కశ్మీర్ ఎన్నికల కమిషనర్ కెకె శర్మ ఎక్స్-అఫీషియో సభ్యులుగా డీలిమిటేషన్ కమిషన్ ను ఏర్పాటు చేసింది.
జమ్ముకు 43, కశ్మీర్ కు 47
డీలిమిటేషన్ కమిషన్పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకే)తో పాటు కశ్మీర్,జమ్మూ ప్రాంతాలలో అసెంబ్లీ సీట్ల కేటాయింపుపై కొన్ని ప్రతిపాదనలు చేసింది. జమ్మూ ప్రాంతానికి అదనంగా ఆరు సీట్లు, కశ్మీర్ లోయ లో ఒక సీటును ప్రతిపాదించింది. దీంతో జమ్మూ ప్రాంతంలో మొత్తం సీట్ల సంఖ్యను 43కి,కశ్మీర్ ప్రాంతంలో 47గా సూచించింది. పిఓకే లో ఇరవై నాలుగు సీట్లు ఖాళీగా ఉంటాయని ప్యానెల్ పేర్కొంది. తొమ్మిది స్థానాలను షెడ్యూల్డ్ తెగలకు, ఏడు షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయాలని ప్యానెల్ ప్రతిపాదించింది. తమ సూచనలపై డిసెంబర్ 31 లోగా తమ అభిప్రాయాలను తెలపాలని కమిషన్ కోరింది.
ఎవరికి లాభం
జమ్మూ డివిజన్లో ఆరు సీట్ల పెంపుదల ఆశించిన స్థాయిలోనే ఉందని జమ్మూలోని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 11సీట్లు ఉన్న జమ్మూ జిల్లాలో కొత్త నియోజకవర్గం ఏదీ ప్రతిపాదించనప్పటికీ, గుజ్జర్, బకర్వాల్ వర్గాలతో కూడిన ఎస్టీలకు మొదటిసారిగా సీట్లు రిజర్వ్ చేయాలని ప్రతిపాదించినందున పిర్ పంజాల్, చీనాబ్ వ్యాలీ ప్రాంతాలలో బిజెపికి లాభించవచ్చని భావిస్తున్నారు. జమ్ము కశ్మీర్లో కాశ్మీరీలు, డోగ్రాల తర్వాత మూడవ అతిపెద్ద సమూహంగా ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు.ఈ రెండు వర్గాలు కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్, గందర్బల్, బండిపోరా ప్రాంతాలతో పాటు సరిహద్దు జిల్లాలైన రాజౌరి, పూంచ్‌లలో ఎక్కువగా నివసిస్తున్నాయి.
ఎలాంటి రాజకీయ రిజర్వేషన్లు లేకుండానే, ఏడుగురు గుజ్జర్ నాయకులు 2014ఎన్నికల సమయంలో కాశ్మీర్‌లోని కంగన్ నుండి ఒకరు జమ్మూ డివిజన్ నుండి, ముఖ్యంగా రాజౌరి, పూంచ్ జిల్లాల నుండి శాసనసభకు ఎన్నికయ్యారు.
సీనియర్ డిప్యూటీ ఈసీ చంద్ర భూషణ్ కుమార్ మాట్లాడుతూ, గత డీలిమిటేషన్ నుండి, జిల్లాల సంఖ్య 12నుండి 20కి, తహసీల్‌ల సంఖ్య 52నుండి 207కి పెరిగిందని తెలిపారు. ఈ 20జిల్లాలను ఏ, బీ, సీ అంటూ మూడు విస్తృత వర్గాలుగా కమిషన్ వర్గీకరించింది.జిల్లాలకు సీట్లు కేటాయిస్తున్నప్పుడు ఒక్కో నియోజకవర్గానికి సగటు జనాభాలో 10 శాతం మార్జిన్ ఇచ్చినట్టు తెలిపారు.