యూపీలోని ఘజియాబాద్ లో 5 ఏళ్ళ బాలికకు మంకీ పాక్స్ సోకిందని ఫిర్యాదులు రావడంతో ఆమె శాంపిల్స్ ను అధికారులు పూణేలోని వైరాలజీ సంస్థకు పంపారు. ఈ చిన్నారి శరీరంపై పొక్కులు, దద్దుర్లు వచ్చాయని, దురదతో బాధపడుతోందని తెలిసింది. దీంతో ఆమె శాంపిల్స్ ని పంపామని ఘజియాబాద్ వైద్య అధికారి తెలిపారు. ఆమెకు మరే ఇతర ఆరోగ్య సమస్య లేదని, ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. గత నెల రోజుల్లో విదేశాలకు వెళ్లి వఛ్చిన వారెవరైనా ఉంటే వారితో ఈ బాలిక కాంటాక్ట్ లో ఉన్నట్టు తాము భావించడం లేదని అన్నారు. ఈ చిన్నారి కుటుంబ సభ్యుల నుంచి ఈ వివరాలు సేకరించామన్నారు. కాగా.. దేశంలో మంకీ పాక్స్ కేసులు బయటపడనప్పటికీ ఇవి ఇతర దేశాల్లో పెరుగుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ గైడ్ లైన్స్ ని జారీ చేసింది. దేశ వ్యాప్తంగా ఈ వ్యాధినెదుర్కొనేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వీటిలో కోరారు. ఈ మార్గదర్శక సూత్రాల ప్రకారం.. మంకీపాక్స్ వైరస్ ను ఏదో ఒకల్యాబ్ నిర్ధారించవలసి ఉంటుంది. పాలిమరేజ్ చైన్ రియాక్షన్ లేదా సీక్వెన్సింగ్ ద్వారా ఈ వైరస్ ను ధృవీకరించాలని ల్యాబ్ లను కోరారు. అలాగే అన్ని క్లినికల్ స్పెసిమన్లను పూణే లోని ఎపెక్స్ లేబొరేటరీకి పంపాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ సర్వేలెన్స్ ప్రోగ్రాం కింద జిల్లా లేదా రాష్ట్ర స్థాయిలో ఈ ప్రక్రియ జరగాలని నిర్దేశించారు. వీటిని మేనేజ్ మెంట్ ఆఫ్ మంకీపాక్స్ డిసీజ్ గైడ్ లైన్స్ గా పేర్కొంటున్నారు. ఈ వైరస్ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సోకకుండా రిస్క్ ని తగ్గించేందుకు ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ వ్యాధికి సంబంధించిన ఏ ఒక్క లక్షణం కనబడినా వెంటనే ఆసుపత్రిని గానీ డాక్టర్లను గానీ సంప్రదించాలని కోరుతున్నారు. ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ చర్యలు, ఇంటిలో రోగి ఐసోలేషన్, అదనపు జాగ్రత్తలు వంటివి కూడా ఈ మార్గర్శక సూత్రాల్లో ఉన్నాయి. ప్రధానంగా ప్రజల్లో ఈ వైరస్ గురించి ఎవేర్ నెస్ పెంచాలని అంటున్నారు. పైగా రోగుల కేరింగ్ విషయంలో శ్రద్ధ వహిస్తున్నవారు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలట .
ఇప్పటివరకు మంకీపాక్స్ కేసులు బయట పడని దేశాల్లో కూడా ఇవి వెలుగులోకి వస్తున్నాయి. అమెరికా, బ్రిటన్, బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, పోర్చుగల్ వంటి దేశాల్లో సైతం మంకీ పాక్స్ కేసులు బయట పడుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మొదట ఆఫ్రికా దేశాల నుంచి వ్యాప్తి చెందిన ఈ వైరస్ ప్రస్తుతం 20 కి పైగా దేశాల్లో ఉందని, ఈ కేసులు 200 కి పైగా పెరిగిపోయాయని ఈసంస్థ పేర్కొంది. ఇలా ఉండగా ఇప్పటివరకు ఇండియాలో మంకీ పాక్స్ కేసులు బయటపడనప్పటికీ,, యూపీలోని ఘజియాబాద్ జిల్లాలో ఓ అయిదేళ్ల బాలికకు ఇది సోకిందా అని భయపడుతున్నారు. ఆమె ఆరోగ్యంగానే ఉందని, కానీ ముందు జాగ్రత్త చర్యగా అన్ని పరీక్షలూ చేస్తున్నామని వైద్యాధికారులు వెల్లడించారు. పూణే లోని ల్యాబ్ నుంచి రిపోర్టు అందవలసి ఉందన్నారు. స్మాల్ పాక్స్ కేసు మాదిరే మంకీపాక్స్ కేసులు ప్రాణాంతకం కానప్పటికీ అప్రమత్తత అవసరమని కేంద్రం భావిస్తోంది. ఇవి సుమారు మూడు, నాలుగు వారాల పాటు రోగిని బాధ పెడతాయని, అయితే స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ దీనికి సరిపోతుందని అంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి