కొవిడ్-19 మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల కంటే ఎక్కువ మందిని పేదరికంలోకి నెట్టివేసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ), ప్రపంచ బ్యాంకు తాజాగా విడుదల చేసిన నివేదికల్లో వెల్లడించింది. కొవిడ్ సోకడం వల్ల వైద్యసేవల కోసం తమ సొంత డబ్బును ఖర్చు చేయాల్సి రావడం వల్ల50 కోట్ల కంటే ఎక్కువమంది తీవ్ర పేదరికంలోకి వెళ్లారని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. గడచిన రెండు దశాబ్దాలుగా సాధించిన పురోగతిని కొవిడ్ మహమ్మారి ఆపే అవకాశముందని పేర్కొంది. కరోనా బారిన పడిన ప్రజలు తమ సొంత జేబుల నుంచి ఆరోగ్య సేవలకు డబ్బు చెల్లించాల్సి వచ్చిందని, అందువల్ల వారు పేదరికంలోకి వెళ్లారని తెలిపింది.కొవిడ్ నుంచి కోలుకొని మరింత మెరుగ్గా నిర్మించుకునేందుకు ప్రయత్నించాలని ప్రపంచఆరోగ్య సంస్థ అన్ని దేశాలను హెచ్చరించింది.
ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయాలి
కరోనా మహమ్మారి యొక్క మూడవ సంవత్సరం సమీపిస్తున్నందున, మన ఆరోగ్య వ్యవస్థ సామర్థ్యాన్ని అత్యవసరంగా బలోపేతం చేయాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ చెప్పారు. అందరికీ మెరుగైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ లేని దేశాల్లో ఆరోగ్య అత్యవసర పరిస్థితి తీవ్రంగా దెబ్బతీస్తుందని చెప్పారు.పేదరికం పెరిగి, ఆదాయాలు తగ్గడం వల్ల ప్రజల ఆర్థిక కష్టాలు పెరిగాయని డబ్ల్యూహెచ్ఓ, ప్రపంచబ్యాంకు నివేదికలు హెచ్చరించాయి. ప్రపంచం 2030నాటికి సార్వత్రిక ఆరోగ్య కవరేజిని సాధించాలనే లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రభుత్వాలు నిబద్ధతగా ఉండాలని సూచించారు.కొవిడ్ వల్ల ఆరోగ్య సేవలకు తీవ్ర అంతరాయం కలిగిందని, 1930వ సంవత్సరం తర్వాత అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి కారణమైందని పేర్కొంది. ప్రపంచ దేశాలన్ని ఆర్థిక పరిణామాలకు భయపకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్య సేవలు పొందగలరని తమ పౌరులకు నమ్మకం కలిగించాలని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తెలిపారు.2020వ సంవత్సరంలో కరోనా మహమ్మారి వల్ల ఆరోగ్య సేవలకు అంతరాయం కలిగిందని దేశాల ఆరోగ్య వ్యవస్థలు వాటి పరిమితికి మించి విస్తరించిందని నివేదికలో పేర్కొన్నారు.
టీబీ, మలేరియాలతో పెరిగిన మరణాలు
గత పదేళ్లలో మొదటిసారి ఇమ్యూనైజేషన్ కవరేజీ పడిపోయిందని, టీబీ, మలేరియాల వ్యాప్తితో మరణాలు పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అన్ని ప్రభుత్వాలు తక్షణమే మేల్కొని ఆరోగ్య సేవలను మెరుగుపర్చాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ కోరారు. మహమ్మారికి ముందు సాధించిన పురోగతి అంత బలంగా లేదని, ఈసారి భవిష్యత్తులో ఎదురయ్యే కొవిడ్ మహమ్మారులు ఇచ్చే షాక్‌లను తట్టుకునేలా ఆర్థిక వ్యవస్థలను నిర్మించాలని ఆయన కోరారు. యూనివర్సల్హెల్త్ కవరేజ్ దిశగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. పేదలు వైద్యం కోసం డబ్బులు వెచ్చించే పరిస్థితి నుంచి వారిని మినహాయించాల్సి ఉందని ఆరోగ్య సంస్ధ వెల్లడించింది. అందుకోసం పేద, బలహీన వర్గాలకు సేవలు అందించేలా పథకాలు రూపొందించాలని కోరింది.