గడువుకన్నా ఒక రోజు ముందుగానే పార్లమెంట్ నిరవధికంగా వాయిదా పడడంపై అధికార, విపక్షాలు విమర్శలు గుప్పించుకున్నాయి. ముఖ్యంగా 12మంది కాంగ్రెస్, టిఎంసి తదితర పక్షాలకు చెందిన రాజ్యసభ సభ్యులను సభ నుంచి ఈ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయడం వెనక ప్రభుత్వం పక్కా ప్రణాళిక దాగి ఉందని ఆరోపించాయి. తమకు కావాల్సిన బిల్లులను ఆమోదించుకునేందుకు వారికి తగిన సంఖ్యాబలం లేకపోవడంతో, విపక్షాలకు చెందిన సభ్యులను సస్పెండ్ చేసి ప్రభుత్వానికి అడ్డులేకుండా చేసుకుందని ప్రధాన విపక్షం కాంగ్రెస్ దుయ్యబట్టింది. ‘ఎగువ సభలో విపక్ష సభ్యుల బలం 120, వాళ్లకు 118 మంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం బిల్లులు నెగ్గడం కష్టం. అందుకే 12మంది ప్రతిపక్ష ఎంపిలను సమావేశాలు ముగిసే వరకు ఒక పథకం ప్రకారం సభ నుంచి పంపించి వేశారు’ అని రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆక్షేపించారు.
భారత దేశాన్ని పీడిస్తున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, చైనా చొరబాట్లు తదితర అంశాలను లేవనెత్తి చర్చ జరిపించేందుకు తాము సిద్ధమై వచ్చామని, కానీ ప్రభుత్వ కావాలని అడ్డుపడిందని మండిపడ్డారు. సభ నుంచి సభ్యులను సస్పెండ్ చేసిన రోజే(నవంబర్ 29) తాను అందరి పక్షాన సభలో విచారం వ్యక్తం చేస్తూ ప్రకటన చేస్తానని చెప్పినప్పటికీ ప్రభుత్వం వినిపించుకోలేదని, వాళ్ల ఎజెండాను అమలు చేశారని ఖర్గే పేర్కొన్నారు. సభలో జరిగిన అభ్యంతకర ఘటనలను పేర్కొంటూ అందుకు విచారం వ్యక్తం చేస్తూ చేయాల్సిన ప్రకటన కూడా తయారు చేసుకున్నామని వివరించారు.
మరో కాంగ్రెస్ నేత జైరాం రమేష్ మాట్లాడుతూ..తాను వ్యక్తిగతంగా రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, సభానాయకుడు పీయూష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి మాట్లాడినా ఫలితం లేకుండా పోయిందన్నారు. సభలో ప్రతిపక్ష నేతగా నిలబడి క్షమాపూర్వక ప్రకటన చేస్తానని ఖర్గే, గోయల్ కు చెప్పారని అన్నారు.
లోక్ సభలోనూ అంతే : అధిర్ రంజన్
దిగువసభలో శీతాకాల సమావేశాలు జరిగిన తీరుపై లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి పెదవి విరిచారు. దేశంలో సంచలనం కలిగించిన లఖీంపూర్ ఖేరి హింసాత్మక సంఘటనలపై మాట్లాడేందుకు ప్రభుత్వం అనుమతించకుండా పారిపోయిందని ఆరోపించారు. లఖీంపూర్ అనే మాట వినపడితే చాలు తమ మైకులు కట్ చేయడం మొదలు పెట్టారని చౌదరి దుయ్యబట్టారు. లఖీంపూర్ హింస, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా రాజీనామాకు పట్టుబట్టి తద్వారా రైతుల కుటుంబాలకు న్యాయం చేయాలని స్పష్టమైన ఎజెండాతో సభకు వచ్చామని పేర్కొన్నారు.
మేం కాంగ్రెస్ కు దూరంగా ఉన్నాం..
పార్లమెంట్ సమావేశాలు ఆసాంతం తాము కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నామని, సొంతంగా కార్యాచరణ రూపొందించుకుని ప్రజా సమస్యలపై పోరాటం చేశామని టిఎంసి సభ్యుడు డెరెక్ ఓబ్రియన్ అన్నారు. సిపిఎం, డిఎంకె, శివసేన పార్టీలతో కలిసి వెళ్లామని తెలిపారు. పశ్చిమ బెంగాల్ లో కాంగ్రెస్ పార్టీ తమ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలను లాక్కోవడానికి ప్రయత్నించిన నేపథ్యంలో ఇరు పార్టీల నడుమ సంబంధాలు దెబ్బతిన్నాయని అన్నారు.
అంతా విపక్షాల వల్లే: ప్రహ్లాద్ జోషీ
విపక్షాల వైఖరి కారణంగానే శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు అనుకొన్న స్థాయిలో ఉత్పాదకత సాధించలేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ దుయ్యబట్టారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ సహా ఇతర పక్షాలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాయని, అందుకే సభా కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నాయని ఆరోపించారు. సమగ్ర చర్చ జరగాలన్న ఉద్దేశంతోనే వివాహ వయసుకు చెందిన బిల్లుతో సహా ఆరు బిల్లులను ప్రభుత్వం పార్లమెంటరీ కమిటీకి పంపించినట్లు చెప్పారు. బిల్లులపై అధ్యయనం చేసేందుకు తమకు తగినంత సమయం ఇవ్వలేదన్న విపక్షాల ఆరోపణలను ప్రహ్లాద్ జోషీ తోసిపుచ్చారు. చర్చ జరగాలంటే విపక్షాలు సభ జరగనివ్వాలిగా అని ఆయన అన్నారు. స్పీకర్, చైర్మన్ ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినప్పటికీ అవి ఉపయోగించుకోలేకపోయాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు.