దేశ వ్యాప్తంగా రాజకీయాలు దేవాలయాలు, మసీదుల చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలోని కుతుబ్ మినార్, ఉత్తరప్రదేశ్‌లోని జ్ఞానవాపి మసీదు వివాదాలకు కేంద్ర బిందువులు కాగా.. ప్రస్తుతం చార్మినార్, భాగ్యలక్ష్మి దేవాలయం సైతం వివాదంలోకి అడుగు పెట్టాయి. హైదరాబాద్ అనగానే చార్మినార్ గుర్తుకు వస్తుంది. చార్మినార్ దగ్గరున్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి కూడా చాలా ప్రాధాన్యత ఉన్నది. ఈ రెండు పాత బస్తీలో మతసామర్యానికి ప్రతీకలుగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం చార్మినార్, భాగ్యలక్ష్మి ఆలయాల చుట్టూ వివాదం రాజుకుంటుంది. చార్మినార్ లో నమాజ్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు కాంగ్రెస్ నాయకుడు రషీద్ ఖాన్. ఆర్కియాలజీ అధికారులకు సైతం విజ్ఞప్తి చేశారు. గతంలో చార్మినార్ దగ్గర ముస్లింలు నమాజ్ చేసేవారని.. రెండు దశాబ్దాల క్రితం నిషేధించారని చెప్పారు. గతంలో మాదిరిగా మళ్లీ నమాజ్ చేసుకునేందుకు అనుమతించాలని కోరారు.
*సంతకాల సేకరణపై బీజేపీ తీవ్ర ఆగ్రహం
కాంగ్రెస్ నేత రషీద్ ఖాన్ చేపట్టిన సంతకాల సేకరణపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందువులు భాగ్యలక్ష్మీ అమ్మ వారిని దర్శించుకోవడానికి వస్తుంటే.. మీకు నమాజ్ కావాల్సి వచ్చిందా? అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. అంతకుముందు నమాజ్ ఎందుకు చేయలేదని నిలదీశారు. భాగ్యలక్ష్మీ ఆలయం జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి ఈ కుట్రకు తెరలేపాయని ఆయన ఆరోపించారు. చార్మినార్ దగ్గర ఆలయం లేదని చెప్పేవాడిని ద్రోహులుగా బండి సంజయ్ అభివర్ణించారు.
*అల్లర్లకు కాంగ్రెస్ కుట్ర
చార్మినార్ దగ్గర నమాజ్ కు అనుమతించాలని కాంగ్రెస్ సంతకాల సేకరణ చేపట్టడాన్ని గోషామాహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా తప్పుబట్టారు. కేవలం పబ్లిసిటీ కోసమే సంతకాల సేకరణ చేపట్టారని విమర్శించారు. ఇలాంటి చిల్లర పనులు చేసే వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే తాము కూడా సంతకాల సేకరణ చేపడుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ పొలిటికల్ మైలేజ్ కోసం ఈ ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు అవుతుందన్న ఆయన.. సంతకాల సేకరణ చేపట్టిన రషీద్ ఖాన్ పై సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో అల్లర్లు స్పష్టించేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తుందని బీజేపీ సీనియర్ నేత రామచంద్రరరావు మండిపడ్డారు. మతపరమైన అంశాలను తీసుకొచ్చి.. తమ బలం పెంచుకోవడానికి ఆ పార్టీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు.
*భాగ్యలక్ష్మి ఆలయం బీజేపీ సొంతం కాదు..
అటు కాంగ్రెస్ నేతలు సైతం బీజేపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. చార్మినార్, భాగ్యలక్ష్మి ఆలయం అందరివి అన్నారు సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క. భాగ్యలక్ష్మి ఆలయం తమ సొంతమన్నట్లుగా బండి సంజయ్ మాట్లాడం మానుకోవాలని హితవు పలికారు. ఈమేరకు ఆయన పార్టీ నాయకులతో కలిసి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు.
*భాగ్యలక్ష్మీ ఆలయ విశిష్టత
భాగ్యలక్ష్మి ఆలయం.. చార్మినార్ లోని ఆగ్నేయ మినార్లలో ఒకటి దాని వెనుక భాగంలో ఉంది. ఈ ఆలయం 1960ల నుంచి ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే చార్మినార్ కంటే ముందే ఆలయం ఇక్కడ ఉండేదని బీజేపీ నేతలు చెప్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత నెలతో పాటు 2020లో తెలంగాణలో జరిగిన ఎన్నికల సందర్భంగా ఆలయాన్ని సందర్శించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు ఆలయాన్ని సందర్శించారు. నగరాన్ని భాగ్యలక్ష్మి దేవి పేరు మీద భాగ్యనగర్‌గా మార్చాలని పిలుపునిచ్చారు.
*హైదరాబాదీల ఆందోళన
అటు చార్మినార్ కేంద్రంగా తాజాగా సాగుతున్న వివాదంపై హైదరాబాద్ వాసుల్లో ఆందోళన కల్గిస్తోంది. రాజకీయ లబ్ది కోసం సున్నితమైన అంశాలపై వివాదం చేయడం సరికాదని పలువురు ప్రముఖులు కోరుతున్నారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నగర గొప్పతనాన్ని అనవసర వివాదాలతో ఆగం చెయ్యొద్దంటున్నారు. ఇలాంటి విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు.