వేసవి కాలంలో చికెన్ ధరలు తగ్గడం కామన్. వేసవి తాపానికి చికెన్ వినియోగం కాస్త తక్కువగా ఉంటుందని అందరూ భావిస్తారు. అందుకే ఎండాకాలంలో కాస్త చికెన్ వాడకం తగ్గుతుంది. ధరలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కానీ గతానికి భిన్నంగా ఉన్నాయి ఈ సారి చికెన్ ధరలు. స్కిన్ లెస్ చికెన్ ధర ఏకంగా రూ.300 పలుకుతోంది. స్కిన్ తో కూడిన చికెన్ విలువ రూ. 280 పైనే ఉంది. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు మండుతున్నాయి. వంట నూనెల నుంచి టమాట, నిమ్మకాయల వరకు ధరలు భగ్గున మండుతున్నాయి. తాజాగా ఈ లిస్టులో చికెన్ ధరలు కూడా చేరాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కిలో రూ. 300కు చేరింది.
ప్రతి ఏడా ఎండాకాలంలో చికెన్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. కానీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చికెన్ కు భాగా డిమాండ్ పెరుగుతోంది. మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు చికెన్ వ్యాపారులు. ఎండల తీవ్రత భారీగా పెరగడం, కోళ్ల పెంపకం తగ్గడం మూలంగానే చికెన్ కొరత ఏర్పడినట్లు చెప్తున్నారు. అందుకే ధరలు విపరీతంగా పెరిగాయంటున్నారు. వేసవి కారణంగా చాలా ఫారాల్లో కోళ్ల పెంపకం భారీగా తగ్గింది. ఈ ప్రభావం చికెన్ ధర మీద పడుతోంది.
తాజాగా ఆదివారం, సోమవారాల్లో చికెన్ ధరలు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా పెరిగాయి. కిలో రూ.300 వరకు స్కిన్ లెస్ ధర పలుకగా.. లైవ్ బర్డ్ కిలో రూ.180 వరకు అమ్మారు. చికెన్ ధర గడిచిన వారం రోజుల్లో రూ.260 నుంచి క్రమంగా పెరుగుతూ ఆదివారం నాటికి రూ.280కి చేరింది. స్కిన్ లెస్ ధర రూ. 300కి ఎగబాకింది. వచ్చే ఆదివారం నాటికి చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చికెన్ సెంటర్ల నిర్వాహకులు అంటున్నారు. ధర ఎక్కువగా ఉండడంతో వేస్టేజ్తో కూడా తమకు నష్టమే తప్ప పెద్దగా లాభం లేదంటున్నారు. వేసవి తీవ్రత పెరుగుతున్నందున కోడి పిల్లలు తక్కువగా వేయడంతో కోళ్ల కొరత ఏర్పడినట్లు చెప్తున్నారు. దీన్ని ఆసరగా చేసుకుని నష్టాల నుంచి తప్పించు కునేందుకు పౌల్ట్రీ వర్గాలు ధరలు భారీ పెంచుతున్నాయి.
వాస్తవానికి డిసెంబరు, జనవరి నెలల్లో ప్రారంభిస్తే ఒక కోడి పిల్ల కిలోన్నర ఎదగడానికి 39 నుంచి 40 రోజులు పడుతుంది. కానీ ఈ సంవత్సరం మార్చి నుంచే ఎండలు భారీగా పెరిగాయి. పిల్ల.. కోడిగా మారడానికి 45 నుంచి 60 రోజుల వరకు సమయం పడుతుంది. దీంతో బ్రాయిలర్ కోళ్ల ఉత్పత్తి తగ్గతున్నట్లు పౌల్ట్రీ సంస్థలు చెప్తున్నాయి. కూలర్లు, ఏసీలు పెడితే కానీ కోడి పిల్లలు బతికే పరిస్థితి కనిపించడం లేదు. నీటి కొరత మూలంగా కొంత మంది పౌల్ట్రీ రైతులు కోళ్ల పెంపకాన్ని చాలా వరకు తగ్గించారు. దీంతో కోళ్ల ఉత్పత్తి తగ్గి ధర భారీగా పెరుగుతోంది. అంతేకాదు.. పౌల్ట్రీ ఫారాలు రైతుల నుంచి పెద్ద పెద్ద కంపెనీఆల చేతుల్లోకి వెళ్లిన తర్వాత గడిచిన కొంత కాలంగా వేసవిలో చికెన్ ధరలు పెరుగుతున్నాయని చికెన్ షాపుల నిర్వాహకులు చెప్తున్నారు. గతంలో వేసవిలో కోళ్ల ఫారాల దగ్గర కోడిని రూ.50, రూ.70 వరకు ఇచ్చే వారని.. ప్రస్తుతం బడా కంపెనీలు సమ్మర్లో కావాలనే బర్డ్ షార్టేజ్ చేసి ధరలు పెంచుతున్నారని ఆరోపిస్తున్నారు.