ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. ట్విట్టర్ డీల్ కు తాత్కాలిక బ్రేక్ వేస్తున్నట్లు వెల్లడించారు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. స్పామ్, ఫేక్ అకౌంట్స్ 5 శాతం కంటే తక్కువ ఉంటాయన్న లెక్కలకు సంబంధించిన ఆధారాలను తనకు అందజేయాల్సి ఉందన్నారు. వాటినిఅందించే వరకు ఈ డీల్ కు బ్రేక్ వేస్తున్నట్లు తెలిపారు. ట్విట్టర్ నుంచి స్పామ్ బాట్స్‌ని తొలగించడం తన కీలక ప్రాధాన్యతల్లో ఒకటిగా చెప్పిన ఆయన.. ఆదిశగా అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు. 44 బిలియన్ డాలర్ల డీల్‌తో ట్విట్టర్‌ని సొంతం చేసుకుంటున్నట్టు గతంలో ప్రకటించిన మస్క్.. తాజాగా ఈ డీల్‌కు తాత్కాలిక బ్రేక్ పడిందని చెప్పడం సంచలనం కలిగిస్తోంది.
*ట్విట్టర్ షేర్ వ్యాల్యూ పతనం
ఎలన్ మస్క్ తాజా ప్రకటనతో స్టాక్ మార్కెట్లో ట్విట్టర్ షేర్ ధర 20 శాతం పతనం అయ్యింది. మస్క్ ప్రకటన పట్ల ట్విట్టర్ ఎలాంటి కామెంట్ చేయలేదు. త్వరలోనే ఆ సంస్థ నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కంపెనీ మొదటి త్రైమాసికంలో డైలీ యాక్టీవ్ యూజర్లలో 5 శాతం కంటే తక్కువ ఫేక్, స్పామ్ అకౌంట్స్ ఉన్నట్టు ట్విట్టర్ అంచనా వేసింది. ఆ వివరాలను మస్క్ కు అందిస్తామని ప్రకటించింది. అటు మస్క్‌తో ఒప్పందం ముగిసే వరకు, ప్రకటనదారులు ట్విట్టర్లో యాడ్స్ కొనసాగించాలా? వద్దా? అనే విషయంతో సహా పలు ఇబ్బందులు ఉన్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది.
ఇక మస్క్ ట్విట్టర్ డీల్ విషయానికి వస్తే తొలుత ట్విట్టర్లో 9 శాతం వాటాలు కొన్నట్టు ఏప్రిల్ 4న ప్రకటించారు. ఆ తర్వాత 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్‌ను సొంతం చేసుకుంటున్నట్టు వెల్లడించారు. తాజాగా ఈ డీల్ ను పెండింగ్ లో పెట్టినట్లు ప్రకటించడం ఆశ్చర్యంతో పాటు సంచలనంగా మారింది.
*ట్విట్టర్ లో కీలక మార్పులు
అటు ట్విట్టర్ మస్క్ చేతికి వెళ్లనున్న నేపథ్యంలో ప్రస్తుత సీఈవో పరాగ్ అగర్వాల్ కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. తన కన్స్యూమర్ ప్రొడక్ట్ చీఫ్ గా ఉన్న కేవాన్ బేక్‌పౌర్, రెవెన్యూ ప్రొడక్ట్ హెడ్ బ్రూస్ ఫాల్క్‌లను రిజైన్ చేయాల్సిందిగా ఆదేశించారు. వీరిద్దరు ట్విట్టర్ ఫీచర్స్‌తో పాటు రెవెన్యూ విభాగాలను మానీటర్ చేస్తున్నారు. ప్రస్తుతం కన్స్యూమర్ ప్రొడక్ట్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న జే సల్లివాన్ ట్విట్టర్ కన్స్యూమర్ ప్రొడక్ట్ టీమ్‌ను చూసుకుంటారు. మస్క్ డీల్ తర్వాత సంస్థలో పలు కీలక మార్పులు జరుగుతున్నాయి. ఇదే నేపథ్యంలో మస్క్ డీల్ హోల్డ్‌లో ఉన్నట్టు చెప్పడం అత్యంత గందరగోళ పరిస్థితులను కలిగిస్తోంది.
*ఈ డీల్ ముందుకు సాగేనా?
ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఎలన్ మస్క్ ఈ డీల్ ను ముందుకు కొనసాగిస్తారా? లేదంటే మధ్యలోనే వెనక్కి తగ్గుతారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మస్క్ నిర్ణయాలతో ట్విట్టర్ సంస్థ అతలాకుతలం అవుతుందని మాత్రం చెప్పుకోచ్చు. ఎడిట్ బటన్ తో ట్విట్టర్ పై తీవ్ర విమర్శలు మొదలు పెట్టిన ఆయన.. దానిపై నిత్యం విమర్శలు చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత సడెన్ గా ట్విట్టర్ ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతే వేగంగా ట్విట్టర్ డీల్ ను హోల్డ్ చేస్తున్నట్లు ప్రకటించం చూస్తుంటే మస్క్ మనసులో ఏదో ఉందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.